Neena Gupta: లెక్కలంటే నీనాకు బొమ్మలను చూసినంత సంబరం.. ఈ అంకెలు ఎంత అమాయకంగా ఉన్నాయో!

18 Dec, 2021 12:45 IST|Sakshi

జీనియస్‌

లెక్కలేనంత ఇష్టం!

రామానుజన్‌ పురస్కార గ్రహీత డా. నీనా 

Neena Gupta: లెక్కలు అంటే భయపడని పిల్లలు తక్కువ. అయితే తన బాల్యంలో లెక్కలు అంటే నీనాకు బొమ్మలను చూసినంత సంబరం. ఆ సంబరమే ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చింది. ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్‌ ప్రైజ్‌’ పురస్కారానికి ఎంపికైంది. ప్రతి సంవత్సరం నలభై ఐదేళ్ల వయసులోపు వారికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డిఎస్‌టీ–ఇండియా), ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియెరిటికల్‌ ఫిజిక్స్‌ (ఐసీటిపి)లు ఈ పురస్కారం అందజేస్తాయి.

మన దేశం నుంచి ఈ పురస్కారం అందుకుంటున్న నాలుగో వ్యక్తి, మహిళలలో మూడో వ్యక్తి నీనా గుప్తా. 2014లో ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ నుంచి ‘యంగ్‌ సైంటిస్ట్‌’ అవార్డ్, 2019లో శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ ప్రైజ్‌ అందుకుంది నీనా. ఆమె బడిరోజుల్లోకి వెళదాం. ఖాల్సా హైస్కూల్లో చదువుకునే రోజుల్లో తన అద్భుతమైన గణితప్రతిభ తో టీచర్లను ఆకట్టుకునేది నీనా. ‘ఈ ప్రాబ్లమ్‌ ఎవరు సాల్వ్‌ చేస్తారు?’ అని టీచర్‌ పిల్లల వైపు చూసేవారు. పిల్లలు మాత్రం నీనా వైపు చూసేవారు. ‘నీనా సంగతి సరే మీ సంగతి ఏమిటి?’ అడిగేవారు టీచర్‌. అలా అని తల గర్వంగా ఎగరేసేది కాదు నీనా. డౌట్ల మీద డౌట్లు వచ్చే పిల్లల దగ్గరకు వెళ్లి వారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పేది.

జూనియర్స్‌ కూడా రకరకాల ‘ప్రాబ్లమ్స్‌’తో ఆమె దగ్గరికి వచ్చేవారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులభంగా వారికి చెప్పేది. తరాలు మారుతున్నా... సాంకేతిక జ్ఞానం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా... చాలామంది పిల్లల్లో ‘మ్యాథ్స్‌ ఫోబియా’ పోవడం లేదు. ఒక వైపు తన పరిశోధనలకు టైమ్‌ను వెచ్చిస్తూనే అలాంటి పిల్లల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది ‘ది ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌–కోల్‌కతా’ ప్రొఫెసర్‌ అయిన నీనా. ‘ఈ అంకెలను చూడండి....ఎంత అమాయకంగా ఉన్నాయో. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు!’ అని అడుగుతుంది ఆమె. పిల్లలు గట్టిగా నవ్వుతారు.

‘ఈ ప్రాబ్లమ్‌ను ఎంత ఈజీగా సాల్వ్‌ చేయవచ్చో ఒకసారి చూడండి’ అని బ్లాక్‌బోర్డ్‌ వైపు వెళుతుంది. పిల్లలో ఎక్కడిలేని ధైర్యం వస్తుంది! ‘మ్యాథ్‌మెటిక్స్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ టైమ్స్‌ ఆఫ్‌ కోవిడ్‌’పై జరిగిన ఆన్‌లైన్‌ చర్చా వేదికలో విలువైన సూచనలు ఇచ్చింది. ‘ఇండియన్‌ వుమెన్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌’ అంశంపై అద్భుత ప్రసంగం చేసింది.
70 సంవత్సరాలుగా పరిష్కారం కాని ఒక గణితసమస్యను పరిష్కరించి ‘భేష్‌’ అనిపించుకుంది. అయితే గణితాన్ని చూసి గజగజలాడుతున్న పిల్లలు, గణితాన్నే పెద్ద సమస్య అనుకుంటున్న పిల్లలు ఉన్నారు. వారి భయాలను తొలగించి గణితం అంటే అంతులేని ప్రేమను కలిగించే పుస్తకం ఒకటి రాస్తే... తనలాంటి జీనియస్‌లు మరెంతోమంది వస్తారనడంలో సందేహం లేదు కదా!

చదవండి: Health Tips: వాతం ఎక్కువైందా? నిద్ర పట్టడం లేదా? అయితే..
  

మరిన్ని వార్తలు