Neena Nizar: ఇది నాకు పెద్ద షాక్‌.. పేరు లేని విలన్‌ కాటేసింది!

6 Jun, 2021 05:25 IST|Sakshi
పిల్లలతో నినా నైజర్‌

ఇది నాకు పెద్ద షాక్‌. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది: నినా నైజర్‌

ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాటం ఎక్కడా ఆపకూడదని... ఎన్ని ఒడిదొడుకులకు లోనైనా ఎక్కడా ఆగిపోకూడదని... నినా నైజర్‌ జీవితం చాటి చెబుతుంది. పుట్టుకతోనే అరుదైన వ్యాధి వెంటాడినా ఆ వ్యాధి తనను వీల్‌చెయిర్‌కే పరిమితం చేసినా చదువుల రాణిగా వర్ధిల్లింది. మోటివేషనల్‌ స్పీకర్‌గా ఎదిగింది. తనకు పుట్టిన పిల్లలనూ అదే వ్యాధి కబళించి అడుగడుగునా నిరాశ తరుముతున్నా విధి విసిరిన ఛాలెంజ్‌ను చిరునవ్వుతో స్వీకరించింది.

‘అరుదైన వ్యాధి కారణంగా మేం ఒంటరిగా, బలహీనులుగా అనిపించవచ్చు. కానీ, మా కథను పంచుకోవడం ద్వారా చావు అంచున నిలబడిన వారిలో చిన్న ఆశను మిగిలిస్తే చాలు’ అంటోంది నీనా నైజర్‌. నాలుగు పదుల వయసు దాటిన నీనా నైజర్‌ దుబాయిలో ఓ వ్యాపారస్తుడి కుటుంబంలో పుట్టింది. పుట్టుకతోనే వెన్నెముకలో అరుదైన వ్యాధికి లోనైంది. ఏళ్లకేళ్లుగా చికిత్స జరుగుతూనే ఉంది. కానీ, వ్యాధి పేరేంటో తెలియలేదు. వెన్నెముకలో లోపాల వల్ల శరీరం అంతగా ఎదగలేదు. ఈ కారణంగా వీల్‌చైర్‌కే పరిమితం అయ్యింది. ఇండియా వచ్చి వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకుంది. లండన్, అమెరికాలోనూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంది. ఏమంత ప్రయోజనం లేకపోయింది. అయినా ఆమె చదువుల తల్లిని వదిలిపెట్టలేదు.

పీహెచ్‌డి పట్టా పుచ్చుకొని..
‘చదువు ధైర్యాన్ని ఇస్తుందని నా నమ్మకం. అందుకే, నా దృష్టి అంతా చదువు మీదే. నాకు 16 ఏళ్ల వయసులో అమెరికాలోని క్రైటన్‌ విశ్వవిద్యాలయం లో చదువుకోవడానికి పూర్తి స్కాలర్‌షిప్‌ తో అవకాశం వచ్చింది. ఆ సమయంలో నా శరీరం శస్త్రచికిత్సల కారణం గా మరింత బలహీనంగా ఉంది. మా అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. అంతదూరం పంపించడానికి ఒప్పుకోలేదు. కానీ, నేను చదువుకోవాల్సిందే అని బలంగా చెప్పి, వెళ్లాను. 2018 లో క్రైటన్‌ విశ్వవిద్యాలయం నుండి ఎడ్యుకేషన్‌ లీడర్‌షిప్‌లో పీహెచ్‌డి పట్టాతో బయటకు వచ్చాను’ అని వివరించే నినా నైజర్‌ చదువులోనే కాదు వ్యాస రచన, పెయింటింగ్, చర్చాపోటీల్లో అనేక బహుమతులు గెలుచుకుంది. దేశవిదేశాల్లో మోటివేషనల్‌ స్పీచుల్లో పాల్గొంది.  

తలకిందులైన ప్రపంచం.. పునర్నిర్మాణం
తను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే ఆడమ్‌ను కలుసుకున్న నినా పెళ్లి తర్వాత ప్రయాణం గురించి వివరిస్తూ ‘పిల్లలు కలగరనే భయంతో పెళ్లే వద్దనుకున్నాను. ఆడమ్‌ తన ప్రేమ ప్రస్తావన తీసుకురావడంతో పెళ్లి చేసుకున్నాం. ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను’ అని వైవాహిక జీవితం గురించి ఆనందంగా చెప్పే నైజర్‌ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తుంది. నైజర్‌కు మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఎలాంటి లోపం కనిపించలేదు. చాలా ఆనందంగా ఉన్నారు. రెండేళ్ల తర్వాత పుట్టిన చిన్నకొడుకులో మాత్రం పుట్టుకతోనే అరుదైన వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఆ తర్వాత పెద్ద కొడుకుని పరీక్షించడంతో వాడిలోనూ ఈ అరుదైన సమస్య ఉందని, ఇది మెటాఫిసల్‌ కొండ్రోడైస్పా›్లసియా అని, జన్యుపరమైనదని వైద్యులు తేల్చారు. ‘ఇది నాకు పెద్ద షాక్‌. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది.

నా శరీరం లోపల పేరులేని విలన్‌ నన్ను ఇంకా కృంగదీయాలనే చూసింది.  కానీ, ఈ అరుదైన ప్రయాణంలో నా కుమారులతో కలిసి నడవాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైన మార్గం అని నాకు తెలుసు. కానీ, ఆ మార్గంలో చిరునవ్వుతో బయల్దేరాను’ అంటున్న నినా, తన ఇద్దరు కుమారులతో వైద్య పరిశోధనల్లో భాగమైంది. ముగ్గురూ వీల్‌చైర్‌లలో ఉండటంతో వారు ఇంటి నుండి బయటకు రావాలంటే మరొకరి సహాయం కావాలి. కానీ, తన కుటుంబంలో నిత్యం నవ్వులు పూయించడానికి తపిస్తూనే ఉంది నినా.

‘నాకు డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇది వైకల్యం ఉన్నవారిలో కలిగే స్వతంత్ర భావనగా నేను ఆనందిస్తాను. మీ లక్ష్యం కేవలం ప్రయాణికుడిగా ఉంటే చాలదు, జీవితానికి బాధ్యత వహించాలి. ఈ రోజు నా కొడుకులు అర్షాన్, జహాన్‌ సూపర్‌ హీరోల్లా నాకు కనిపిస్తుంటారు. వారి ఆటపాటలు, అల్లరిని చూస్తుంటే ఎంతటి శత్రువునైనా ఓడించగల బలం వచ్చేస్తుంది’ అని ఆనందంగా వివరిస్తుంది నినా నైజర్‌. ఇప్పటికీ జీవితంలోని ఒడిదొడుకులను సవాళ్లుగా తీసుకొని చిరునవ్వుతో నిత్య పోరాటం చేస్తున్న నినా నైజర్‌ ఎంతో మంది నిరాశావాదులకు ఆశాదీపంలా కనిపిస్తుంది.

ఇది నాకు పెద్ద షాక్‌. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. నా శరీరం లోపల పేరులేని విలన్‌ నన్ను ఇంకా కృంగదీయాలనే చూసింది. కానీ, ఈ అరుదైన ప్రయాణంలో నా కుమారులతో కలిసి నడవాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైన మార్గం అని నాకు తెలుసు. కానీ, ఆ మార్గంలో చిరునవ్వుతో బయల్దేరాను.
– నినా నైజర్‌


భర్త, పిల్లలతో నినా నైజర్‌
 

మరిన్ని వార్తలు