వద్దంటే వద్దు నీరానా.. ససేమిరా

27 Feb, 2021 05:47 IST|Sakshi
నీరా టాండన్‌

నీరా టాండన్‌ : బడ్జెట్‌ చీఫ్‌గా జో బైడెన్‌ ఎంపిక

అమెరికా అధ్యక్షుడు ఎవర్ని ఏ అత్యున్నత స్థాయి పదవిలో నియమించినా ఆ నియామకాన్ని సెనెట్‌ ఆమోదించాలి. సెనెట్‌లో వంద మంది సభ్యులు ఉంటారు. వారిలో కనీసం 51 మంది అనుకూలంగా ఓటు వేస్తేనే వారు ఆ స్థానానికి అర్హత సాధిస్తారు. సాధారణంగా అధ్యక్షుడు నియమించిన వ్యక్తిపై వ్యతిరేకత ఉండదు కానీ.. ప్రస్తుతం నీరా టాండన్‌ విషయంలో సెనెట్‌ నియామక కమిటి ఇప్పటికి రెండుసార్లు ఓటింగ్‌ను వాయిదా వేసింది. అందుకు కారణం ప్రస్తుతం సెనెట్‌లో ఉన్న 50 మంది రిపబ్లికన్‌లతో పాటు, డెమోక్రాటిక్‌ పార్టీలోని ఒకరిద్దరు ఆమెను వ్యతిరేకిస్తుండటమే! గతంలో సోషల్‌ మీడియాలో ఆమె ప్రదర్శించిన నోటి దుడుకుతనమే ఇప్పుడు ఆమె నియామకాన్ని ఓకే చేసే ఓటింగ్‌ను జాప్యం చేస్తున్నాయి.

నీరా టాండన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యురాలు అయినప్పటికీ సోషల్‌ మీడియాలో ఆమె పూర్వపు ‘ప్రవర్తనను’ వ్యతిరేకిస్తున్న వారు డెమోక్రాటిక్‌ పార్టీలోనూ ఉండటతో ఆమె నియామక నిర్థారణ అవకాశాలు సన్నగిల్లాయి. నీరా ప్రస్తుతం వాషింగ్టన్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌’కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్థిక, న్యాయ విషయాల్లో నిపుణురాలిగా గుర్తింపు పొందిన నీరాను బైడెన్‌ తన బడ్జెట్‌ చీఫ్‌గా నామినేట్‌ చేశారు. ఆ పదవిని చేపట్టడానికి అవసరమైన సామర్థ్యాలు ఆమెకు ఉన్నప్పటికీ కేవలం ఆమె ‘ప్రవర్తన’ కారణంగా ఆ నామినేషన్‌కు ఆమోదం లభించడం కష్టమవుతోంది. అభ్యంతరం చెబుతున్నది సొంత పార్టీలోని ఒకరిద్దరే కనుక బైడెన్‌ మాట మీద సర్దుకుని పోతే సమస్యే లేదు. అటు, ఇటు సమానంగా పోలయినా.. ఉపాధ్యక్షురాలి ‘టై బ్రేక్‌’ ఓటు ఉంటుంది కనుక పరిస్థితి నీరాకు అనుకూలంగా మారవచ్చు. రిపబ్లికన్‌లు, డెమోక్రాటిక్‌లు నీరా నియామకాన్ని వ్యతిరేకించడానికి కారణంగా ప్రచారంలోకి తెస్తున్న ఆమె సోషల్‌ మీడియా వ్యాఖ్యలు, ట్వీట్‌లు కేవలం రాజకీయ పరమైనవే. అలాగే పక్షపాతమైనవిగా చెబుతున్న ఆమె ట్వీట్‌లు నిజానికి పక్షపాతరహితమైనవనీ, తన మన పర భేదం లేకండా సొంత పార్టీ విధానాలను కూడా ఖండిస్తూ ఆమె ట్వీట్‌లు పెడతారనీ పేరు ఉంది. కొంతమంది సెనెట్‌ సభ్యులనైతే ‘వరెస్ట్‌’ అని, ‘ఫ్రాడ్‌’ అని తిట్టిపోసిన ట్వీట్‌లూ ఉన్నాయి. వాటి సంగతి వదిలేస్తే.. ‘‘ప్రస్తుతం అమెరికా ఉన్న ఆర్థిక పరిస్థితిలో నీరా వంటి ప్రతిభగల ఆర్థిక నిపుణురాలు’’ అని అమెరికన్‌లలో అధికశాతం మంది విశ్వసిస్తున్నారు. ఆ కారణంగా బైడెన్‌ ఆమెను నామినేట్‌ చేశారు.
∙∙
యాభై ఏళ్ల నీరా భారత సంతతి మహిళ. బైడెన్‌ నియామకం కనుక ఆమోదం పొందితే బడ్జెట్‌ చీఫ్‌ అయిన తొలి నాన్‌–అమెరికన్‌ అవుతారు. నీరా మాసచుసెట్స్‌లో జన్మించారు. ఆమె ఐదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. తను తల్లి దగ్గరే పెరిగారు. రాజ్‌ అని ఒక సోదరుడు ఉన్నారు. భర్త, ఇద్దరు పిల్లలు. భర్త విజువల్‌ ఆర్టిస్టు. ఇంతవరకే ఆమె కుటుంబ వివరాలు. నీరా ‘లా’ చదివారు. డెమోక్రాటì క్‌ గవర్నర్, అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి పని చేశారు. క్లింటన్‌ విధేయులలో ఒకరు. హిల్లరీ క్లింటన్‌కి మంచి స్నేహితురాలు కూడా. ఒబామా తరఫున కూడా అధ్యక్ష ఎన్నికలకు ప్రచార బృంద సభ్యురాలిగా వ్యూహ రచన చేశారు. ‘సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌’ వ్యవస్థాపనలో కూడా కీలక పాత్రే వహించారు. నీరా తమను విమర్శించారని సెనెటర్‌లు బాధపడుతున్నారు కానీ ఆమె దేశాధ్యక్షులను కూడా వదల్లేదు. ఇజ్రాయెల్, లిబియా, సిరియా ప్రభుత్వ విధానాలను సైతం ఆమె ఘాటుగా విమర్శించారు. ఎవర్నీ లెక్క చేయని ఈ ముక్కుసూటి మనిషికి బడ్జెట్‌ బాధ్యతలనిచ్చి బైడెన్‌ మంచి నిర్ణయమే తీసుకున్నారని అంటున్నవారూ ఉన్నారు.

మరిన్ని వార్తలు