Neha Narkhede: టెక్నోస్టార్‌

8 Jun, 2023 04:36 IST|Sakshi

విజయపథం

పుణెలోని ఆ ఇంట్లో మరాఠీ, హిందీ పాటలతో పాటు పాఠాలు కూడా వినిపించేవి. అయితే అవి క్లాస్‌రూమ్‌ పాఠాలు కాదు. ఎన్నో రంగాలలో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన మహిళల గురించిన గెలుపు పాఠాలు. ఆ పాఠాలు వింటూ వింటూ ‘నేను కూడా సాధిస్తాను’ అన్నది చిన్నారి నేహ. అవును ఆమె సాధించింది!

ఫోర్బ్స్‌ అమెరికా ‘రిచ్చెస్ట్‌ సెల్ఫ్‌–మేడ్‌ ఉమెన్‌–2023’ జాబితాలో వివిధ రంగాలకు చెందిన వందమంది మహిళలకు చోటు దక్కింది. వీరిలో పదకొండు మంది నలభై ఏళ్ల వయసులోపు ఉన్నవారు. వారిలో ఒకరు 38 సంవత్సరాల టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌ నేహ నర్ఖాడే....

మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగింది నేహ. ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తనకు కంప్యూటర్‌ కొనిచ్చారు. అప్పుడు టెక్నాలజీపై మొదలైన ప్రేమ అలా కొనసాగుతూనే ఉంది. టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త కొత్త విజయాలు సాధించేలా చేస్తూనే ఉంది.

తన బలం ‘తల్లిదండ్రులు’ అని చెప్పుకుంటుంది నేహ. ‘మొదట చదువు విలువ గురించి చెప్పారు. చదువుపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఎంతోమంది మహిళా రోల్‌మోడల్స్‌ గురించి చెప్పేవారు. నువ్వు కూడా ఏదైనా సాధించాలి అంటూనే... యస్‌. నువ్వు సాధించగలవు అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించారు’ అంటుంది నేహ.
పుణె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీలో చదువుకున్న నేహ ... జార్జియా (యూఎస్‌)లో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసింది.

జార్జియాలో చదువుకునే రోజుల్లో ఎలాంటి కెరీర్‌ ఎంచుకోవాలి అనే విషయంలో ఎంతోమంది స్నేహితులతో చర్చిస్తూ ఉండేది. ‘ఒరాకిల్‌’లో ప్రిన్సిపల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా తొలి ఉద్యోగం చేసిన నేహ ఆ తరువాత ‘లింక్ట్‌ ఇన్‌’లో చేరింది. ఆ సమయంలో రకరకాల స్టార్టప్‌లు, వాటి విజయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది.
 సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘అపాచీ కాఫ్కా’ అనే ఓపెన్‌ సోర్స్‌ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. కంపెనీలు తమ డాటాతో వేగంగా యాక్సెస్‌ అయ్యే అవకాశాన్ని ఈ ప్లాట్‌ఫామ్‌ కల్పిస్తుంది.

‘ఎలాంటి జటిలమైన సమస్యను అయినా  పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి’ అనేది లక్ష్యంగా నిర్ణయించుకుంది.  రెండు సంవత్సరాల తరువాత ‘కన్‌ఫ్లూయెంట్‌’ అనే ఫుల్‌–స్కేల్‌ డాటా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది నేహ. ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు ‘కన్‌ఫ్లూయెంట్‌’ నుంచి సేవలు పొందుతున్నాయి.

కంపెనీకి సంబంధించి భాగస్వాములు, ఉద్యోగులను ఎంచుకోవడంలో నేహ అనుసరించే పద్ధతి ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘తెలివితేటలతో పాటు కష్టపడే స్వభావం ముఖ్యం. వీరితో ఐడియాలు షేర్‌ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది అనిపించాలి. సమస్య తలెత్తినప్పుడు  మెరుపు వేగంతో పరిష్కరించే సామర్థ్యం ఉండాలి’ నేహ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు స్టార్టప్‌ కల్చర్‌పై ఇప్పుడు ఉన్నంత అవగాహన లేదు. ప్రతి అడుగు ఆచితూచి వేసినా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుండేది. వెంటనే ఆ తప్పును దిద్దుకొని ముందుకు సాగేది.

నేహా నర్ఖాడే విజయరహస్యం ఏమిటి?
‘వ్యూహాలు, ప్రతివ్యూహల సంగతి తరువాత. ఎంటర్‌ప్రెన్యూర్‌లకు తప్పనిసరిగా కావాల్సింది మానసిక బలం. ఆ బలం ఉంటే యుద్ధరంగంలో అడుగు ముందుకు వేయగలం. విజయాలు సాధించగలం. ఇది నా దారి... అంటూ పరుగెత్తడం కాదు. చుట్టూ ఏం జరుగుతుందో అనేదానిపై పరిశీలన దృష్టి ఉండాలి. మన తప్పుల నుంచీ కాదు ఇతరుల తప్పుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. టైమ్‌మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి’ అంటుంది నేహ.

నేహ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు రోల్‌మోడల్, తన రోల్‌మోడల్‌ మాత్రం ఎలక్ట్రిక్‌ కార్‌ స్టార్టప్‌ ‘నియో’ ఫౌండర్, సీయివో పద్మశ్రీ వారియర్‌.
‘రోల్‌మోడల్‌ స్థానంలో మనల్ని మనం చూసుకుంటే వారిలా విజయం సాధించడం కష్టం కాదు’ అంటుంది నేహ నర్ఖాడే.
 
టైమ్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి.
– నేహ

మరిన్ని వార్తలు