Kanksshi Agarwal: డర్టీప్లేస్‌ అంటారు కానీ.. పూలదారైతే కాదు!

8 Oct, 2021 09:17 IST|Sakshi

రాజకీయ నేత్రి 

ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని..ప్రభుత్వాలు తీసుకొచ్చే పాలసీలు, చట్టాలు... సామాన్యులకు నష్టం కలిగించేవిగా ఉంటే వాటిని రద్దు చేయమని ప్రతిపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటారు. మరోపక్క, తమ నెత్తిన బలవంతంగా మోపిన భారాన్ని సామాన్యులు మౌనంగా భరిస్తుంటారు. భోపాల్‌కు చెందిన కనక్షి అగర్వాల్‌ మాత్రం అలా మౌనంగా ఉండలేదు. ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బందులకు గురయ్యే విధానాలను అలా ఎలా తీసుకొస్తారు..? విధాన నిర్ణయాల్లో తమలాంటి వాళ్లు కూడా పాల్గొంటే విధానాలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని, ఏకంగా పొలిటికల్‌ టీచర్‌గా మారింది. దేశ రాజకీయాల్లో మహిళల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో రాజకీయ పాఠాలను బోధిస్తోంది. 

నేత్రి ఫౌండేషన్‌.. 
అది 2017... జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది. నాలుగు స్లాబుల్లో వివిధ రకాల వస్తుసేవలపై పన్ను విధించారు. ఈ క్రమంలోనే మహిళలు ఎక్కువగా వినియోగించే శానిటరీ న్యాప్‌కిన్స్‌ మీద కూడా 18 శాతం పన్ను భారం పడింది. దాదాపు దేశంలో ఉన్న మహిళలంతా మౌనంగా 18 శాతం అదనపు ట్యాక్స్‌ను చెల్లిస్తూ ఎప్పటిలాగే శానిటరీ న్యాప్‌కిన్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. కనక్షి మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో మహిళలు లేకపోవడం వల్లే శానిటరీ ప్యాడ్స్‌పై ఇంత పన్ను విధించగలిగారు. అదే కౌన్సిల్‌లో ఎవరైనా మహిళలు ఉంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు కదా... అనుకుంది. 2019 ఎన్నికల్లో సైతం మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దేశరాజకీయాల్లో ఎలాగైనా మహిళల సంఖ్యను పెంచాలనుకుని ‘నేత్రి ఫౌండేషన్‌’ను స్థాపించింది. 

పొలిటికల్‌ టీచర్‌గా... 
టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ‘అర్బన్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌’ చదివిన కనక్షికి ‘లెజిస్లేటివ్‌ ఎయిడ్‌ టు మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ (ఎల్‌ఎఎంపీ)’ ఫెలోషిప్‌ చేసే అవకాశం వచ్చింది. దీంతో చాలామంది ఎమ్‌పీ, ఎంఎల్‌ఏలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఈ సమయంలో.. పాలన లో ఎక్కువగా పురుషులే ఉండడం, పురుషులతోపాటు స్త్రీలకు సమానత్వం లేకపోవడాన్ని గమనించింది. అంతేగాక మగవాళ్లు ఆడవాళ్లలా డ్రెసులు ధరించరు. నెలనెలా వచ్చే పిరియడ్స్‌పై వారికి అంత అవగాహన ఉండదు. అందువల్ల వాళ్లు ఇటువంటి పాలసీలు తీసుకు రాగలిగారు. అని కనక్షి ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూసి, మహిళలు ఉంటే ఇలా జరగదని పొలిటికల్‌ టీచర్‌గా మారింది.

నేత్రి ద్వారా గ్రామస్థాయి నుంచి మహిళలకు రాజకీయ పాఠాలు నేర్పిస్తుంది గ్రామపంచాయితీ స్థాయి నుంచి రాజకీయాల్లోకి ఎలా రావాలి? బూత్, నియోజక వర్గాల నిర్వహణ, ఆర్గనైజింగ్‌ స్కిల్స్, కెపాసిటీ బిల్డింగ్, సోషల్‌ మీడియాను ఎలా వాడుకోవాలి, కమ్యూనిటీ ఎలా ఏర్పర్చుకోవాలి వంటి వాటి గురించి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటిదాకా 400 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు.. ఇవేగాక న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక, శాసనసభలు ఎలా పనిచేస్తాయి? వాటినుంచి సాయం ఎలా తీసుకోవాలి వంటి అంశాలను కూడా నేరి్పస్తున్నారు.  

డర్టీప్లేస్‌ అంటారు కానీ.. 
‘‘చాలామంది అభిప్రాయం ప్రకారం రాజకీయాలు అనేవి మహిళలకు నప్పవు, అది ఒక డర్టీప్లేస్‌. అందుకే సమాజంలోని చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లను టీచర్, ఇంజినీర్, ఐఏఎస్‌ వంటి కెరియర్‌లవైపు మాత్రమే ప్రోత్సహిస్తుంటారు. ఎవ్వరూ కూడా రాజకీయాల్లోకి రమ్మని, వెళ్లమని అస్సలు చెప్పరు. వాటిని కేవలం మగవాళ్ల కెరియర్‌గా పరిగణిస్తారు. గత కొన్నేళ్లుగా ఉన్న ఈ మూస ఆలోచనకు స్వస్తి పలకాలని ‘నేత్రి’ ద్వారా మహిళలను ఎడ్యుకేట్‌ చేస్తున్నాను.

పొలిటికల్‌ కెరియర్‌లో మహిళలకు పూలదారి ఏమీ ఉండదు. అనేక సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అందుకే ముందుగా వివిధ జిల్లాల్లోని సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల మహిళలతో ప్రారంభించి, బరేలీ, రాయ్‌బరేలీ, అమేథి, హరుదా జిల్లాలకు విస్తరించాము. నేత్రి ద్వారా మహిళలు తమదైన నిర్ణయాలతో సమాజాన్ని సరికొత్తగా అభివృద్ధి పరచడమేగాక, దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారు’’ అని కనక్షి చెప్పింది.

చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం!

మరిన్ని వార్తలు