అధిక బరువు ఉన్నారా? ఈ బెలూన్‌ మింగారంటే చాలు.. 20 నిముషాల్లో..!

23 Oct, 2022 16:36 IST|Sakshi

బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. తమ ఊబకాయం అకస్మాత్తుగా ప్రాణాపాయం వంటి ప్రమాదం తెచ్చిపెట్టేంత ఎక్కువగా (మార్బిడ్‌ ఒబేసిటీ) ఉంటే... బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స వంటివీ అందుబాటులో ఉన్నాయి. అయితే స్వల్ప, ఓ మోస్తరు ఊబకాయం ఉన్నప్పుడు... పొట్టను కాస్తా... పేగు స్థాయికి కోసేయడం ఇష్టపడని వారికోసం ఇప్పుడు కేవలం ఓ క్యాప్సూల్‌ను మింగించి, అది పొట్టలోకి వెళ్లాక బెలూన్‌లా ఉబ్బేలా చేయడం ద్వారా ఆహారం తక్కువగా తీసుకునేలా చేస్తూ, బరువు తగ్గించే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. దీన్నే ‘‘స్వాలోవబుల్‌ గ్యాస్ట్రిక్‌ బెలూన్‌’’ అంటారు. దాని గురించి తెలిపే కథనమిది. 

ఎవరైనా సరే... కాస్త బొద్దుగా ఉంటే పర్వాలేదు. కానీ... అతిగా లావు పెరిగితే ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. అధిక ఊబకాయం కొన్నిసార్లు అకస్మాత్తుగా ప్రాణాపాయాన్నీ తెచ్చిపెట్టవచ్చు. ఓ వ్యక్తి బాడీ–మాస్‌ ఇండెక్స్‌ (బీఎమ్‌ఐ) ప్రమాదకరమైన స్థాయికి చేరినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. పట్టికలో ఉన్న బీఎమ్‌ఐని బట్టి... అది స్వల్ప, ఓ మోస్తరు స్థాయిలో ఉంటే ఆ ఊబకాయాన్ని తగ్గించడానికి ఈ ‘‘గ్యాస్ట్రిక్‌ బెలూన్‌’’ ప్రక్రియ ఉపయోగపడుతుంది. 

ఎలా అమర్చుతారంటే... 
తొలుత క్యాప్సూల్‌లా ఉండే ఉబ్బని బెలూన్‌ను ఊబకాయం ఉన్న వ్యక్తి చేత  మింగిస్తారు. అది కడుపులోపలికి వెళ్లాక సరైన స్థానంలో ఉందా అని నిర్ధారణ చేసుకుం టారు. ఆ తర్వాత, దానికి అతుక్కుని ఉన్న సన్నటి ట్యూబ్‌ ద్వారా నీటిని పంపి, బెలూన్‌ను ఉబ్బేలా చేస్తారు. ఉబ్బగానే... దానికి అతుక్కుని ఉన్న  ట్యూబ్‌ను మెల్లగా బయటకు లాగేస్తారు. ∙ఈ మొత్తం ప్రక్రియ 20 నిమిషాల్లో ముగుస్తుంది. ఈ బెలూన్‌ కడుపులో 4 – 6 నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత అది స్వాభావికంగానే జారిపోతుంది. 

ఎలా పని చేస్తుందంటే...? 
కడుపులోని ఖాళీ ప్రదేశంలో బెలూన్‌ ఉండటమూ, ఆహారం పట్టడానికి తక్కువ ఖాళీ ప్రదేశం ఉండటంతో కొద్దిగా తినగానే కడుపు నిండిపోయి ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. కానీ ఆహారం కొద్దిగానే వెళ్లడంతో, మళ్లీ కొద్దిసేపటికే ఆకలేస్తుంది. అయినప్పటికీ రోజుమొత్తం లో తినే అన్నం పరిమాణం కంటే ఇది తక్కువే ఉండటంతో... కేవలం దేహానికీ, దేహపు జీవ క్రియలకీ అవసరమైన మేరకే తింటారు. ఫలితంగా ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే శరీరపు అదనపు బరువు తగ్గిపోతుంది.

ప్రయోజనాలు
బాగా అభివృద్ధి చెందిన సాంతికతతో తయారైన ఈ పాలీయూరీథేన్‌ బెలూన్లు చాలా మృదువుగానూ, ఉపరితలం నునుపుగానూ ఉంటాయి. కాబట్టి కడుపులోని కండరాలు గాయపడటం వంటి అనర్థాలు ఉండవు. కడుపులో ప్రసరించే ఆమ్లాన్ని (యాసిడ్‌ను) ఇది బాగా తట్టుకుంటుంది. ∙దీని సహాయంతో మొత్తం దేహపు బరువులో 15 – 25 శాతం వరకు తగ్గుతుంది. దీన్ని ఉపయోగించిన దాదాపు 95 శాతం మంది, తొలగించాక కూడా దాదాపు ఏడాది పాటు అదే దేహపు బరువు తో కొనసాగుతారు. దేహపు బరువులో కనీసం 5 శాతం తగ్గినా డయాబెటిస్, గుండెజబ్బులు, ఇతరత్రా అనర్థాలు గణనీయంగా తగ్గుతున్నందున ఇది ఉపయోగకరమనే చెప్పవచ్చు. 

ప్రతికూలతలు 
అమర్చిన కొత్తలో కడుపులో ఏదో నిండుగా బెలూన్‌ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ త్వరలోనే దానికి అలవాటు పడిపోతారు. కేవలం దేహం బరువులో 15 – 25 శాతం మేరకు మాత్రమే తగ్గుతుంది. కాబట్టి మరీ ఆరోగ్యానికి అనర్థం కలిగించేంత బరువు, ప్రాణాపాయం కలిగించేంత బరువు ఉంటే బేరియాట్రిక్‌ చేయించాల్సి రావచ్చు. స్వల్పం నుంచి ఓ మోస్తరు బరువు వారికీ, ఆపరేషన్‌ చేయించుకోడానికి వెనకాడేవారికీ గ్యాస్ట్రిక్‌ బెలూన్‌ ఓ మార్గం.  

మరిన్ని వార్తలు