కోట్లలో ఒకరు... ఈ కోర్ట్ని!

20 May, 2021 01:18 IST|Sakshi
కోర్ట్ని లలోత్రా

భారతదేశాన్ని సందర్శించడానికి ఎంతోమంది విదేశీయులు వస్తుంటారు. వీరిలో ఎక్కువమంది వచ్చిన పని చూసుకుని వెళ్లేవారే. కానీ న్యూజెర్సీకి చెందిన 34 ఏళ్ల కోర్ట్ని లలోత్రా మాత్రం అలాకాదు. ఓ ప్రాజెక్టు పనిలో భాగంగా ఇండియా వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులు చూసి చలించిపోయి.. స్వదేశంలో ఉన్న ఆస్తులను విక్రయించి..ఇండియా తిరిగొచ్చి ఏకంగా11 మంది పిల్లలను దత్తత తీసుకుని అమ్మలా లాలిస్తోంది.

అది 2010 మన్‌హట్టన్‌లోని ఫ్యాషన్‌ ఇ¯Œ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో డిగ్రీ చదువుతోన్న కోర్ట్ని ఫ్యాబ్రిక్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులో భాగంగా ఇండియా వచ్చింది. విమానం దిగగానే.. ‘‘రోడ్లమీద సరిగ్గా బట్టలు లేకుండా యాచించే చిన్నచిన్న పిల్లలు! చంకలో పసిబిడ్డల్ని పెట్టుకుని యాచించే తల్లులు! ఒకపక్క చేతిలో ఉన్న పిల్లలు ఏడుస్తున్నా.. డబ్బుల కోసం ఆగి ఉన్న వాహనాల చుట్టూ తిరుగుతున్న తల్లులు..! వంటి హృదయ విదారక çఘటనలు కోర్ట్నికి కనిపించాయి. అంతేగాకుండా ఈశాన్య ఢిల్లీలోని మురికివాడల్లో వలంటీర్‌గా పర్యటించినప్పుడు తల్లిదండ్రులు లేక, ఆదరించే వారు లేక వీధిపాలైన అనేకమంది అనాథ పిల్లలు తారసపడ్డారు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు అని అడిగి వారి వివరాలు తెలుసుకుని ‘ఇండియాలో ఇంత పేదరికం ఉందా...’ అనుకుంది. ఇక్కడ సాయం కోసం ఎదురు చూస్తోన్న చిన్నారులు ఎందరో ఉన్నారు అనుకుంటుండగానే.. కొద్దిరోజుల్లో తన విసా కాలపరిమితి ముగియడంతో.. అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ‘తిరిగి ఇండియా వచ్చి ఈ పిల్లలను ఆదుకోవాలి’ అని నిర్ణయించుకుని స్వదేశానికి తిరిగి వెళ్లింది.

దత్తత తీసుకున్న అనాథ పిల్లతో...

ఆస్తులు అమ్మి..
అమెరికా వెళ్లిన కోర్ట్ని .. తనకున్న ఆస్తులు విక్రయించి 15000 డాలర్లు కూడబెట్టింది. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, ఇంటికి కావాల్సిన సామాన్లు, పిల్లలకు ఆహారం పెట్టడానికి ఇవి సరిపోతాయనుకుని 2011 మార్చిలో ఇండియా వచ్చింది. రాగానే ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. తల్లిదండ్రులు సాయం చేయడంతో.. 2012లో ఒక సొంత ఇంటిని నిర్మించుకుంది. మొదట్లో కోర్ట్నిని తల్లిదండ్రులు వారించినప్పటికీ తరువాత ఆమె మనసెరిగి ఆమెను సేవాకార్యక్రమాల దిశగా ప్రోత్సహించారు.

పెళ్లి... పిల్లలు..
కోర్ట్ని 2014లో యోగేష్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదికల్లా వీరికి ‘ఎడి’ పుట్టాడు. తరువాత కోర్ట్ని యోగేష్‌లు కలిసి..ఆలనా పాలన చూసేవారు లేని అనాథ పిల్లలైన.. దీపు, శివ, జై, రోషిత్, పియూష్, రాజు, సైలేష్, శివమ్‌లను దత్తత తీసుకుంది. అలా మొత్తం పదకొండు మందిని అక్కున చేర్చుకున్నారు. తన కొడుకు ఎడితో కలిపి పన్నెండు మంది పిల్లలను అమ్మలా సాకుతోంది కోర్ట్ని. గతేడాది నుంచి ఇప్పటిదాకా కరోనా మహమ్మారి పంజా విసురుతుండడంతో.. కోర్ట్ని రెండు వేలకు పైగా కుటుంబాలకు రేషన్‌ అందించడమేగాక, ఆకలితో ఉన్నవారికి అన్నంపెట్టి ఆదుకుంది.


భర్త యోగేష్‌ కొడుకు ‘ఎడి’తో కోర్ట్ని లలోత్రా

నీలాంటి వాళ్లు వస్తుంటారు..వెళ్తుంటారు..
‘‘నేను ఇండియా వచ్చినప్పుడు చూసిన కొన్ని సంఘటనలు నన్ను ఎంతో బాధించాయి. అందుకే ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకు సాయం చేయాలనుకున్నాను. అయితే వీసా గడువు ముగియడంతో ‘‘తిరిగి ఇండియా వచ్చి ఇక్కడ కొంతమందికి సాయం చేస్తానని చెప్పాను కానీ అప్పుడు నా మాట ఎవరూ నమ్మలేదు. నీలాంటి వాళ్లు వస్తుంటారు వెళుతుంటారు అని అన్నారు. అవేవీ పట్టించుకోకుండా కొంత నగదును సమకూర్చుకుని వచ్చి పదకొండు మందిని దత్తత తీసుకుని పెంచుతున్నాను. కోవిడ్‌ విజృంభించక ముందు ఇండియాలో కొంతమంది అనాథలను చూశాను. కోవిడ్‌ వచ్చాక  రోజూ వేలమంది పిల్లలు తమవారిని కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు. ఇది చాలా బాధాకరం’’‡అని కోర్ట్ని చెప్పింది. ఈ ఏడాది అమెరికా వెళ్లి అమ్మా నాన్నలను కలుద్దాం అనుకున్నాను. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పిల్లలను వదిలి వెళ్లడం ఇష్టంలేక ట్రిప్పును రద్దు చేసుకున్నాను’’ అని కోర్ట్ని తెలిపింది.

మరిన్ని వార్తలు