కొత్త సంవత్సరం సంకల్పాలు..

1 Jan, 2022 08:04 IST|Sakshi

365 విలువైన కాలపు సంచులతో కొత్త సంవత్సరం అతిథిగా వచ్చేసింది. ఆ సంచులలో ఏముంది? ఏ సంచిలో ఏ అనుభవం మనకై రిజర్వ్‌ అయి ఉంది. అంతుచిక్కనివ్వకపోవడమే కాల మహిమ. అదే జీవితానికి మధురిమ. చిన్నపిల్లలు కింద పడితే వారే లేచేంత వరకు పెద్దలు గమనిస్తూ ఉండిపోయినట్టు కాలం కూడా మనల్ని అనుభవాలతో చెక్కి రాటుదేలేలా చేస్తుంది. పరిణతి తెచ్చిపెడుతుంది. స్థితప్రజ్ఞతతో జీవితాన్ని ఎదుర్కొనడం నేర్పిస్తుంది. కొత్తకాలం ఎప్పుడూ ఆశతో ఉండు అని చెప్పడానికే వస్తుంది. కొత్త సంవత్సరం ఊపిరినిండా ఆకాంక్షలు నింపుకోవడానికే వచ్చింది. ఈ సంవత్సరం హ్యాపీగా గడిచేందుకు సంకల్పాలు సరిచేతలు కొన్ని.... 

తొలి వందనం కుటుంబానికి
గేట్‌ తీస్తూ ఇంటి లోపలికి తండ్రి అడుగు పెడుతూ ఉండటం బాగుంటుంది. పిల్లల్ని హెచ్చరిస్తూ తల్లి ఇంటిని నిభాయించుకుంటూ రావడం బాగుంటుంది. ‘ఒరే అన్నయ్యా’... అని పిలిచే చెల్లి పిలుపు బాగుంటుంది. ‘తమ్ముడూ’... అని క్రికెట్‌ బ్యాట్‌ కొనిచ్చే అన్నయ్య ఉండటం బాగుంటుంది. ‘న్యూస్‌పేపర్‌ ఎక్కడా’ అని మనమడిని కేకేసే తాత ఉండటం బాగుంటుంది. పూలసజ్జ పట్టుకుని మొక్కల దగ్గర తిరుగాడే జేజి కనిపించడం బాగుంటుంది. సంఘంలో అందమైన కుటుంబం బాగుంటుంది. కుటుంబం కోసం అక్కర కలిగిన సంఘమూ బాగుంటుంది. కుటుంబానికి విలువివ్వని మనిషి సంఘానికి ఇవ్వడు. కుటుంబం పట్ల బాధ్యత లేని మనిషి సంఘం పట్ల బాధ్యత వహించడు.

నీ కుటుంబాన్ని చూసి నువ్వు ఎలాంటివాడివో చెప్పొచ్చు. నీ కుటుంబ అనుబంధాలను బట్టి సంఘంతో నీ అనుబంధం బేరీజు వేయవచ్చు. తోడబుట్టిన వాళ్లతో తెగదెంపులు నేటి ఫ్యాషన్‌. మాట పట్టింపులతో రక్త సంబంధాల కోత నేటి ట్రెండ్‌. కొత్త సంవత్సరంలో కుటుంబమే ముఖ్యం అనుకుందాం.  జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించిన గత కాలాన్ని బిలంలో పడేద్దాము. వారితో ఆప్యాయంగా ఉందాం. పిల్లల పలకరింపు కోసం అలమటించే పెద్దల చెంప దెబ్బ తిందాము. కన్నీళ్లతో అభిషేకిద్దాము. వారి క్షమాపణ పొంది వారి సంతోషం కోసం ఇంటి వాకిలి తెరుద్దాము. కొత్త సంవత్సరంలో కుటుంబమే ముఖ్యం అనుకుందాం.  జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించిన గత కాలాన్ని బిలంలో పడేద్దాము. 

నిన్ను నువ్వు తెలుసుకో 
ఎంత ఎగిరినా భుజాలకు రెక్కలు మొలవవు. ఎంత రుద్దినా కాళ్లకు చక్రాలు పుట్టవు. ఏమి చేసినా అందరూ ఎనిమిది అడుగుల ఎత్తుకు ఎదగరు. ఊయలలో ఊగి మొదలెట్టే ప్రయాణంలో దొరికే సమయానికి ప్రపంచంలో ప్రతి అంగుళం చుట్టి రాలేము. మన మొదలు మన తుది మనకు తెలియాలి. పక్కన వాడి మొదలూ తుదితో పోటీ పడటమే నేటి సమస్య. మనకు బైక్‌ ఉండటం సంతోషం కావడం లేదు. పక్కవాడి కారును చూసి ఏడుపు ఎగదన్నుకొని వస్తోంది. మూస చదువులు నేటి యువతకు సమస్య. మూస ఉపాధి నేటి కుర్రకారుకు ఫ్రస్ట్రేషన్‌. మూస పోటీ వారికి అశాంతి.

దేనిలో ఇష్టం ఉంది, ఏ పనిలో అభిరుచి ఉంది, కౌశలం ప్రావీణ్యం ఎందులో ప్రదర్శించవచ్చు ఇవి పట్టించుకోవడం లేదు. తెలుసుకున్నా పోటీ కొద్దీ వాటిని వదిలేసి తెలియని బావిలో దూకాల్సి వస్తోంది. ఉనికి, గుర్తింపు, అస్తిత్వం, గౌరవం..  చిన్న పనిలో అయినా పెద్ద పనిలో అయినా... ఇవీ సాధించవలసింది. అదే సంపద. యువత తానేమిటో తాను తెలుసుకోవాలి. అందుకు తల్లిదండ్రులు సహకరించాలి. ఆ మేరకు ఈ కొత్త సంవత్సరంలో కన్ను తెరవాలి. ఉనికి, గుర్తింపు, అస్తిత్వం, గౌరవం..  చిన్న పనిలో అయినా పెద్ద పనిలో అయినా... ఇవీ సాధించవలసింది.


స్వస్థత ప్రధానం 
గతంలో కట్టివేయడానికి సంకెళ్లు, తాళ్లు బజారులో దొరికేవి. ఇప్పుడు చేతిలోనే వాటిని తలదన్నే వస్తువు ఉంది. సెల్‌ఫోన్‌. కదలికలు నిరోధించబడటం శిథిలానికి దగ్గర కావడం. వ్యాయామ సమయాలు తగ్గిపోతున్నాయా చూసుకోవాలి. నడవడం, ప్రతి ఉదయం లేదా సాయంత్రం కేవలం మనతో మనమే ఉండేలా నడవడం, మనం నడుస్తున్నట్టుగా శరీరానికి తెలిసేలా నడవడం అవసరం. సెల్‌ఫోన్‌ దీనిని నిరోధిస్తోంది. వ్యాపకాలు నిరోధిస్తున్నాయి. వినోద ఆకర్షణలు నిరోధిస్తున్నాయి. ఇంట్లో మోటివేషన్‌ లేకపోవడం నిరోధిస్తున్నది. కుటుంబ ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం. ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌. ఆరోగ్యానికి మనం ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నామో ఇకపై జాగ్రత్తగా గమనించుకోవాలి.

సెల్‌ఫోన్‌ చూడటం వల్ల, విపరీతంగా వాడటం వల్ల, మెడ వంచి దానిలో నిమగ్నం కావడం వల్ల మున్ముందు కంటి సమస్యలు, చెవి సమస్యలు, మెడ సమస్యలు తప్పవు. వ్యాయామం చేయకపోతే స్థూలకాయం, అజీర్తి సమస్యలు తప్పవు. జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరగదు. హెల్దీ ఫుడ్‌ ఇంట్లో వండుకోవడం బద్దకం వేసి స్విగ్గీలకు జొమాటోలకు అలవాటు పడితే లోపలకు వెళ్లేది ప్రిస్క్రిప్షిన్‌ రూపంలో చేతికి వస్తుంది. మహమ్మారి ఇంకా ఇంకా భయపెడుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యమే ప్రధానం. అదే మన నినాదం. అందుకు నిపుణుల, వైద్యుల సలహా తో కచ్చితమైన అలవాట్లను పాటించాలనే నిర్ణయం ఈ సంవత్సరంలో తీసుకోక తప్పదు.


తర్వాతి స్థానం ప్రేమది
ప్రేమ అడుగంటిపోయిన నివాసం మహలు అయినా పాక అయినా ఒకటే. స్త్రీ, పురుషులు భార్యాభర్తలయ్యాక ఆ కాపురానికి తలం ప్రేమ కావాలి. ఛాయ ప్రేమ కావాలి. పంచుకున్న బతుకు ప్రేమ కావాలి. తమ మధ్య ప్రేమ నశించిపోయింది అని గుర్తించలేని స్థితిలో నేటి భార్యాభర్తలు ఉన్నారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ ప్రదర్శించుకోవాలి అని గ్రహింపు లేని భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరూ ఆఫీసులకు వెళ్లినా, అతను వెళ్లి ఆమె ఉన్నా, సాయంత్రాలు కలిసి టీవీ చూసినా, పిల్లల గురించి నాలుగు మాటలు మాట్లాడుకున్నా అదంతా మొక్కుబడి  అని ఇరువురూ అనుకుంటే అంతకు మించిన దురదృష్టం మరొకటి లేదు.

భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే పిల్లలకు సక్రమంగా ప్రేమ ప్రవహించదు. పిల్లలకు ప్రేమ అందకపోతే భవిష్యత్తు సౌకర్యంగా ఉండదు. ప్రేమ పొందడం ఊరికే జరిగిపోదు. అందుకు శ్రద్ధ పెట్టాలి. జీవిత భాగస్వామి పట్ల గౌరవం ఉండాలి. జీవితాన్ని నిర్మించుకోవడానికి కలిశారు మీరిద్దరు. పైచేయి సాధించాలని కింద పడవద్దు. అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా అశాంతి తెచ్చుకోవద్దు. పాలలో చక్కెర కూడా కలబెడితేనే కరుగుతుంది. ప్రేమ ప్రదర్శిస్తేనే తెలుస్తుంది. ఈ సంవత్సరం ‘నువ్వంటే నాకు ఇష్టం’ అని చెప్పగలిగే సందర్భాలు ఒక వేయి రావాలని భావించండి. దాంపత్య జీవితాన్ని సంతోషమయం చేసుకోండి.

పౌరులం మనం
పౌరులం మనం. నియమ నిబంధనలు పాటించే పౌరులే మెరుగైన పౌర సమాజం నిర్మిస్తారు. ప్రభుత్వం పౌర జీవనం కోసం ఎన్నో పనులు చేస్తుంటుంది. పౌరులుగా వాటిని గౌరవించాలి. మాస్క్‌ ధరించమంటే ధరించకుండా, హెల్మెట్‌ పెట్టుకోమంటే పెట్టుకోకుండా, తాగి డ్రైవ్‌ చేయవద్దంటే చేస్తూ, టీకా వేయించుకోమంటే వేయించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే సరైన పౌరులం అనిపించుకోము. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, హాళ్లు, మాళ్లు... వీటి నిర్మాణంలో ప్రమాణాలు పాటించడం కనీస పౌర ధర్మం. ఆక్రమణలు చేయకపోవడం, చెత్తను సరిగ్గా పారబోయడం, వాహనాలను ఇష్టం వచ్చినట్టుగా పార్క్‌ చేయకపోవడం... చేయాల్సింది.

ఎంగిలి ఊయడం అసహ్యకరమైన పని అని తెలిసినా రోడ్డు మీద ఎంగిలి ఊస్తూ కనిపించే వారిని ఏమనాలి? ఓట్ల కాలం వస్తే డబ్బులు డిమాండ్‌ చేసే వారిని గెలిచిన అభ్యర్థి పౌరులుగా చూస్తాడా? గౌరవిస్తాడా? సమాజంలో ప్రతి పౌరుడు పౌర బాధ్యతలు నిర్వర్తిస్తూ గౌరవం పొందాలని ఈ సంవత్సరం అందుకు నాంది కావాలని కోరుకుందాం.


ఏమిటి మన సంస్కారాలు?
సంస్కారాల పరిణతి సమాజ పరిణతి ఒక్కటే. సంకుచితాల నుంచి బయట పడటమే సంస్కారం. ఛాందసాలు, మూఢ విశ్వాసాల నుంచి చెడు మాటలు, చేష్టలు, ఆలోచనల నుంచి బయట పడటమే సంస్కారం. ఎదుటి మనిషి కళ్లబడిన వెంటనే కులం, మతం, ప్రాంతం జ్ఞప్తికి రావడం నీచ సంస్కారం. ‘మనవాడికే’ మన మద్దతు రోత సంస్కారం. ఫలానా తిండి చెడ్డది, జీవన విధానం చెడ్డది, సమూహం చెడ్డది అని భావించి, నమ్మి, దానికి తోడు ప్రచారం చేసి, విద్వేషం నింపుకోవడం కుసంస్కారం.

పరువు పేరుతో పిల్లలను కోల్పోయేంత పంతం పెంచుకోవడం దారుణ సంస్కారం. స్నేహం, సహనం, సహ జీవనం, ఆదరణ, సహాయం, సమాన దృష్టి... ఇవీ సంస్కార గుణాలంటే. మనిషిగా ఉండటం సంస్కారం. మనతో పాటు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలో హక్కులు ఉన్నాయి, ఉంటాయి అనుకోవడం సంస్కారం. బతుకు.. బతికించు విధానం పాటించడం సంస్కారం. ఏ ఒక్క మనిషి కంటే, మతం కంటే, కులం కంటే, ప్రాంతం కంటే, భాష కంటే, జెండర్‌ కంటే మరొకరు ఎక్కువ అని ఎవరైతే భావిస్తారో వారి సంస్కారం అథమంగా ఉన్నట్టు లెక్క. సంస్కార ప్రమాణాలు పెరిగేలా చేయమని ఈ సంవత్సరానికి విన్నవిద్దాం.
సంఘటితం కావాలి

సందర్భాలకు తగినట్టుగా సంఘటితం కాని ప్రజలు ఉన్న దేశం తిరోగమనంలో పడుతుంది. దేశం అంటే హితం. దేశం అంటే ప్రజాహితం. దేశం అంటే మట్టి. దేశం అంటే మొలక. దేశం అంటే అడవి. దేశం అంటే ఇంకా న్యాయం అందవలసిన ప్రజ. దేశం అంటే స్త్రీలు. దేశం అంటే ప్రజాస్వామిక విధానాలు అవలంబించాల్సిన పాలన. అటువంటి విధానాలకు విఘాతం కలిగినప్పుడు స్థానికం గా కాని, రాష్ట్రీయంగా కాని, జాతీయంగా కాని ప్రజలు సంఘటితం కాగలగాలి. శాంతియుత నిరసన తెలపాలి. సరి చేయించాలి. ‘మనకెందుకులే’ అనే ధోరణి చాలు. ‘నష్టం మనకు కాదు కదా’ అనుకోవడానికి వీల్లేదు. ఆమ్ల వర్షం ఫలానా వారిని ఎంచుకొని కురవదు. కార్చిచ్చు ఏ ఒక్కరినో దహించదు. ప్రజలే దేశ నిర్మాణకర్తలు. సంఘటితం కావడమే వారి అజేయమైన శక్తి. ప్రతి ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ప్రతి ఒక్కరూ తల ఎత్తేలా ఈ దేశం మేలుకోవాలి. అందుకు ఈ సంవత్సరం మార్గం చూపాలి.


ప్రకృతితో బతకాలి
ప్రకృతితో మనం బతుకుతున్నాం. మనతో ప్రకృతి బతకడం లేదు. నీలి రంగు, ఆకుపచ్చ రంగు ఎక్కువగా కనిపించాల్సిన ఈ భూగోళంలో ఆ రంగులు ఏ మేరకు పలచబడుతున్నాయో గమనించుకోవాలి. సిమెంటు రంగు భూగోళం ఏర్పడకుండా చూడాలి. పక్షుల్ని వాలనివ్వాలి. మొక్కల్ని ఎదగనివ్వాలి. తీగలు కిటికీల వరకూ పాకి గదుల్లో తొంగి చూడగలగాలి. నదులు, కాలవలు తమ స్థలాలను తిరిగి ఆక్రమించుకునే హక్కును ఇవ్వగలగాలి.

మట్టి, ఇసుక, కొండ, అడవి సురక్షితంగా ఉండాలి. మట్టి మీద నడిచే మనం కృతజ్ఞతగా దానికి మొక్కను ఇవ్వగలగాలి. ప్రతి సంవత్సరం పది మొక్కలు నాటాలి అనుకుంటే అంతకు మించిన సాయం లేదు భూమికి. నా వంతు కాలుష్యాన్ని నివారిస్తాను అనుకుంటే ప్రకృతి బతికి బట్టకడుతుంది. ఈ సంవత్సరం ప్రకృతి స్నేహితులుగా మారడానికి సంకల్పించుకుందాం. 

మరిన్ని వార్తలు