ప్రధాని పెళ్లి డేట్‌ కొద్ది గంటల క్రితమే ఫిక్స్‌ అయింది!

6 May, 2021 06:43 IST|Sakshi
కూతురు నీవ్‌తో న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌

న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ పెళ్లి డేట్‌ కొద్ది గంటల క్రితమే ఫిక్స్‌ అయింది! అయితే పెళ్లికి పిలవకపోయినా నొచ్చుకోని వారి జాబితా ఖరారు అయ్యాక మాత్రమే ఆ తేదీని జసిండా వెల్లడిస్తారట!! అందుకు కరోనా ఒక కారణం కావచ్చు. అంతేకాదు, ‘‘ఈ వయసులో పెళ్లి గౌనులో కనిపించడం ఎబ్బెట్టుగా ఉంటుంది అని అనుకుంటున్నాను కనుక పెళ్లి ముస్తాబులు ఏమీ ఉండవు’ అని కూడా ఆమె ప్రకటించారు. జసిండాకు రెండేళ్ల కూతురు ఉంది. ప్రధానిగా ఉండగా తల్లి అయిన  రెండో మహిళ బెనజీర్‌ భుట్టో తర్వాత జసిండానే! ఇప్పుడామె తన బాయ్‌ ఫ్రెండ్, బిడ్డ తండ్రి అయిన వ్యక్తినే  వివాహమాడబోతున్నారు.

వచ్చే జూన్‌ 21 న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ కూతురు నీవ్‌ తియారహ మూడో పుట్టిన రోజు. మూడు నిండి నాలుగు వస్తుంది. ఈ తల్లికూతుళ్లతో కలిసి వెల్లింగ్టన్‌లోని అధికార నివాసం ‘ప్రీమియర్‌ హౌస్‌’లో క్లార్క్‌ గేఫోర్డ్‌ అనే వ్యక్తి కూడా ఉంటారు. జసిండా కూతురు నీవ్‌కి అతడే తండ్రి. అయితే జసిండాకు అతడు భర్త కాడు. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండే ఆ చిన్న కుటుంబంలో అతడి స్థానం ప్రస్తుతానికైతే.. ‘డొమెస్టిక్‌ పార్ట్‌నర్‌’. జసిండా, క్లార్క్‌ ఇంతవరకు పెళ్లి చేసుకోక పోవడం వల్ల ‘ఇంటి సభ్యుడు’గా మాత్రమే అతడు ఆమె జీవితంలో ఉన్నారు.

తాజా ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ని బట్టి తెలుస్తున్నది ఏమిటంటే వచ్చే సమ్మర్‌లో జసిండా, క్లార్‌ పెళ్లి చేసుకోబోతున్నారు! మన సమ్మర్‌ కాదు. వాళ్ల సమ్మర్‌. న్యూజీలాండ్‌లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వేసవి నెలలు. ఆ మూడు నెలల్లో ఏదో ఒక రోజు క్లార్క్‌.. ‘ఇంటి సభ్యుడు’ అనే హోదా నుంచి జెసిండా భర్త హోదా పొందబోతున్నారు. పెళ్లి తేదీ ఫిక్స్‌ అయింది. అయితే పెళ్లికి పిలకవక పోయినా నొచ్చుకోని ఆత్మీయులు ఎవరైతే ఉంటారో ఆ జాబితాను తయారు చేశాక మాత్రమే పెళ్లి తేదీని బహిర్గతం చేస్తామని ‘కోస్ట్‌ రేడియో’ ప్రతినిధితో జసిండా అన్నట్లు ‘న్యూజీలాండ్‌ హెరాల్డ్‌’ పత్రిక మంగళవారం నాడు వార్త మోసుకొచ్చి ఇంటింటికీ పెళ్లి పత్రికలా పంచి వెళ్లింది.

రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెళ్లి ఇది! 2019 ఈస్టర్‌ సెలవుల్లోనే జసిండా, క్లార్క్‌ల నిశ్చితార్థం జరిగింది. నిజానికి నిశ్చితార్థం కూడా వాయిదా పడుతూ వస్తోంది! 2017 అంతా జసిండా బిజీ. ఆ ఏడాదే, జసిండా తన ముప్పై ఆరేళ్ల వయసులో న్యూజీలాండ్‌ ప్రధాని అయ్యారు. ఆ దేశానికి అతి చిన్న వయసులో ప్రధాని అయిన తొలి మహిళ జసిండా. తర్వాత 2018 అంతా బిజీ. తల్లి కావడం, ప్రధాని బాధ్యతలతో పాటు తల్లి బాధ్యతల్నీ నెరవేర్చడం!  బిడ్డ పుట్టాక నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వరకు రావడానికి మళ్లీ ఒక ఆటంకం! కరోనా కట్టడిలో జసిండా బిజీ అయిపోయారు.

దేశంలోని యాభై లక్షల మంది జనాభాను కరోనా నుంచి కాపాడేందుకు క్షణం తీరిక లేకుండా పనిచేశారు. ప్రజలకు ఆమె ఒకటే మాట చెప్పారు. ‘‘యాక్ట్‌ లైక్‌ యు హ్యావ్‌ కరోనా వైరస్‌’’.  మీకొస్తుందని తలుపు వేసుకోకండి. వచ్చిందని వేసుకోండి. అప్పుడు కరోనా ఎవరి తలుపూ కొట్టదు అని! బాధ్యతను నెత్తి మీద పెట్టకుండా బాధ్యులను చేయడం అది. కరోనా కంట్రోల్‌ అయింది! అదయ్యాక మళ్లీ ఎన్నికలు. న్యూజిలాండ్‌లో మూడేళ్లకొకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. 2020 ఎన్నికల్లో జసిండా మళ్లీ ప్రధాని అయ్యారు. ఈ మధ్యలో ఎక్కడా పెళ్లికి గ్యాప్‌ దొరకలేదు. ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి ఆలోచన చేసే సమయం.. అదీ ఆలోచన వరకే.. దొరికినట్లుంది.

ప్రధానిగా జసిండా మాత్రమే కాదు, క్లార్క్‌ గేఫోర్డ్‌ కూడా పెళ్లికి ఒక డేట్‌ని ఫిక్స్‌ చేసుకోడానికి ప్లాన్‌ చేస్తూనే ఉన్నారు. ఎన్నాళ్లని ‘ప్రధానికి కాబోయే భర్త’గా ఉండటం. కానీ అతడికీ కుదరడం లేదు. క్లార్క్‌ రేడియో బ్రాడ్‌కాస్టర్, టెలివిజన్‌ ప్రెజెంటర్‌. ‘ఫిష్‌ ఆఫ్‌ ది డే’ డాక్యుమెంటరీ షోతో బాగా పాపులర్‌. మీడియాలో పెద్ద స్థాయిలో ఉన్నవారికి సహజంగానే పని ఎక్కువగా ఉంటుంది. ఆయన ‘ఫిష్‌’ సీరీస్‌ కొన్నిటిని నేషనల్‌ జియోగ్రఫిక్‌ చానెల్‌ కూడా అడిగి తీసుకుని ప్రపంచమంతటా ప్రసారం చేస్తుంటుంది.

పార్లమెంటులో జసిండా, చేపల కార్యక్రమాల షూటింగులతో క్లార్క్‌ ఎవరికి వారు బిజీగా ఉంటుంటే పెళ్లి చేసుకోవడం తర్వాతి సంగతి. అసలు కలుసుకునేదెప్పుడు? మాట్లాడుకోవడం ఎప్పుడు? చివరికి వాళ్లిద్దర్నీ కలిపి ఒకచోట ఉంచేందుకే పాప పుట్టినట్లుంది. పగలంతా ఎక్కడున్నా సాయంత్రానికి ఇద్దరూ ఇంటికి చేరుతున్నారు. ఇక ఈ పెళ్లి తొందర కూడా పాప కోసమే కావచ్చు. ఆ చిన్నారిని ప్లే స్కూల్‌లోనో, ప్రీ స్కూల్లోనో చేర్చే సమయం దగ్గర పడుతోంది మరి. అడ్మిషన్‌ ఫారమ్‌లో తండ్రి పేరు ఉండాలంటే.. తండ్రిగా అతడు ఉండాలి. తండ్రిగా ఉండాలంటే ముందు భర్తగా ఉండాలి.

పెళ్లికి తను మాత్రం వధువుగా అలంకరించుకోనని జసిండా చెప్పేశారు! ‘‘ఈ వయసులో పెళ్లి గౌనులో కనిపించడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా’’ అంటారామె. క్లార్క్‌దేముందీ, కోటు వేసుకుంటే చాలు.. పెళ్లి కళ వచ్చేసినట్లే. ఆమె వయసు 40. అతడి వయసు 44. ఆమె పలుచగా ఉంటే, అతడు దృఢంగా ఉంటాడు. చక్కటి జోడీ అని ఆక్లాండ్‌ సిటీ హాస్పిటల్‌ నర్సింగ్‌ హోమ్‌ నుంచి డిశ్చార్జి అయి పాపతో బయటికి వస్తున్నప్పుడు తొలిసారి వీళ్లిద్దర్నీ చూసినప్పుడే ఆ దేశ ప్రజలు అనుకున్నారు. చక్కటి సాంగత్యమే కాదు, చక్కటి సంస్కారం కూడా ఈ జంటది.

ఆ మధ్య గేఫోర్డ్‌తో కలసి రెస్టారెంట్‌కి వెళితే టేబుల్స్‌ ఖాళీ లేక బయటే కాసేపు నిలబడ్డారు జసిండా. వేరే రెస్టారెంట్‌కి వెళ్లబోతుంటే అప్పుడు టేబుల్‌ ఒకటి ఖాళీ అయిందని చెబితే లోపలికి వెళ్లారు. నేను ప్రధానిని కదా అని ఆమె అనుకోలేదు. నేను ప్రముఖ ప్రెజెంటర్‌ని కదా అని అతడూ అనుకోలేదు. ఒకరికొకరం అనుకున్నారంతే. హోదాల్ని పక్కన పెట్టి, కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడిపేందుకు కాస్త సమయమే వాళ్లకు కావలసింది. ఆ సమయం ఎప్పుడొస్తే మాత్రం ఏముంది? రావడమే అపురూపం.  

లవ్‌ ఉంది.. స్టోరీనే లేదు!
కాలిన్‌ జెఫ్రీ అని న్యూజీలాండ్‌ మోడల్, యాక్టర్, టెలివిజన్‌ హోస్ట్‌ ఒకాయన ఉన్నారు. ఆయన ద్వారా 2012లో తొలిసారి జసిండా, క్లార్క్‌ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అప్పుడామె లేబర్‌ పార్టీ తరఫున పార్లమెంట్‌ సభ్యురాలిగా ఉన్నారు. పరిచయం తర్వాత కొన్నాళ్లకు క్లార్క్‌ జసిండాను కలిశారు. వివాదాస్పద ‘గవర్నమెంట్‌ కమ్యూనికేషన్స్‌ సెక్యూరిటీ బ్యూరో బిల్‌’ గురించి వివరాల కోసం వచ్చారు ఆయన. మీడియా కనుక ఏదో స్టోరీ పని మీద అయుండొచ్చు. అలా వాళ్ల స్నేహం మొదలైంది. ఆమె ఫెమినిస్టు. ఆయన హ్యూమనిస్టు. స్థూలంగా ఇద్దరూ ఒకటే. ఏడేళ్ల స్నేహం తర్వాత 2019లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన నేటికీ నెరవేరలేదు!
 
జసిండా, కాబోయే భర్త క్లార్క్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు