వాణిజ్య వారధి.. బైడెన్‌ మెచ్చిన లీడర్‌

7 Feb, 2021 01:39 IST|Sakshi
ఒకాంజో అవేలా, ఆర్థికవేత్త, ప్రపంచ వాణిజ్య సంస్థకు కానున్న కొత్త డైరెక్టర్‌ జనరల్‌

ప్రపంచ వాణిజ్య సంస్థకు ఎవరు డైరెక్టర్‌ జనరల్‌ కాబోతున్నారు? పోటీలో ఉన్న ఇద్దరూ మహిళలే. పోటీ ఉన్నదీ ఆ ఇద్దరి మధ్యనే. నైజీరియా మాజీ ఆర్థిక మంత్రి ఒకాంజో అవేలా ఒకరు. దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూ మింగ్‌హ్యీ ఇంకొకరు. ఒకాంజో బైడెన్‌ చెప్పిన పేరు. మింగ్‌హ్యీ ట్రంప్‌ చెప్పిన పేరు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరికి డబ్లు్య.టి.ఓ. డైరెక్టర్‌ జనరల్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో! వచ్చే నాలుగేళ్లలో ప్రపంచ దేశాల వాణిజ్య ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాలను ఎవరు రూపొందించబోతున్నారో?!

బైడెన్‌తో పాటు డబ్లు్య.టి.వో.లో సభ్యత్వం ఉన్న మొత్తం 164 దేశాలు మొగ్గు చూపుతున్నది ఒకాంజో వైపే. ట్రంప్‌ దాదాపుగా ప్రతి ప్రపంచ సంస్థతో, ప్రపంచంలోని ప్రతి దేశంతో ఏదో ఒక పంచాయితీ పెట్టుకుని వెళ్లినవారే. ట్రంప్‌ ఎంపిక చేసిన వ్యక్తుల సామర్థ్యాలు ఎంత శిఖరాగ్ర స్థాయిలో ఉన్నా, ట్రంప్‌ ఎంపిక చేశారు కాబట్టి బైడెన్‌ పాలనలో ఆ వ్యక్తులకు ప్రాముఖ్యం లేకపోవడమో, లేక ప్రాధాన్యం తగ్గిపోవడమో సహజమే. ఏమైనా ఒకాంజో డబ్లు్య.డి.వో. కొత్త డైరెక్టర్‌ జనరల్‌ కానున్నారన్నది స్పష్టం అయింది. మార్చి 1–2 తేదీల్లో సర్వసభ్య సమాజం ఉంది కనుక ఆ లోపే ఒకాంజో కొత్త సీట్లో కూర్చోవాలి.

66 ఏళ్ల ఒకాంజో ప్రస్తుతం ట్విట్టర్, స్టాండర్డ్‌–చార్టర్డ్‌ బ్యాంక్, గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్, ఆఫ్రికన్‌ రిస్కీ కెపాసిటీ సంస్థల డైరెక్టర్ల బోర్డులలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఎంపిక ఖరారు అయితే కనుక ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ అయిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్‌ అవుతారు. ఆ సంస్థకు ఇప్పుడు అమెరికా అవసరం ఉంది కనుక, అమెరికా ఆమెను నామినేట్‌ చేసింది కనుక మరొకరు ఆ స్థానంలోకి వచ్చే అవకాశమే లేదు. అలాగని ఒకాంజో అవేనా ఎవరో వేసిన సోపానం పైకి ఎక్కడం లేదు. ఆమె ప్రతిభ ఆమెకు ఉంది. ఆమె అనుభవం ఆమెకు ఉంది. అవన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థకు పూర్తి స్థాయి లో అవసరమైనవీ, అక్కరకు వచ్చేవే.
∙∙
ఇటీవలే 2019లో అమెరికన్‌ పౌరసత్వం తీసుకున్న ఒకాంజో వరల్డ్‌ బ్యాంకులో 25 ఏళ్లు పని చేశారు. అందులోనే మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయి వరకు ఎదిగారు. ఇక తన స్వదేశం నైజీరియాకు రెండుసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు ఆమె డైరెక్టర్‌ జనరల్‌ కాబోతున్నారనే స్పష్టమైన సంకేతాలు రావడంతోనే.. ‘‘ఆర్థికవేత్తగా అమె నాలెడ్జ్‌ సాటి లేనిది’’ అని యు.ఎస్‌.టి.ఆర్‌. (యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రెజెంటేటివ్‌) సంస్థ కొనియాడింది. ‘‘అమెరికా ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు’’ అని ఒకాంజో కూడా స్పందించారు. ఆమె చదివిందంతా ఎకనమిక్సే. అందులోనే డిగ్రీలు, అందులోనే డాక్టరేట్‌ లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు. ఒకాంజో భర్త న్యూరో సర్జన్‌. నలుగురు పిల్లలు. వారిలో ఒకరు కూతురు. వాళ్లవీ పెద్ద చదువులే. కుటుంబ అనుబంధాలకు, మానవ సంబంధాలకు, దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలకు క్రమశిక్షణ గల ‘ఎకానమీ’ ఇరుసు వంటిది అని అంటారామె. ఒకాంజో.

మరిన్ని వార్తలు