శభాష్‌ షంషేర్‌.. నీ సేవలు అద్భుతం..

23 Dec, 2020 08:40 IST|Sakshi

శోకం నుంచి శ్లోకం పుట్టిందట. షంషేర్‌ ఆవేదన, ఆలోచనల్లో నుంచి  పుట్టిందే...  ఎర్లీ రిస్క్‌ వోరల్‌ క్యాన్సర్‌ డిటెక్టర్‌ క్విట్‌పఫ్‌. పదమూడు సంవత్సరాల వయసు నుంచే  అద్భుతాలు చేస్తున్న  నిఖియ షంషేర్‌ పరిచయం...

స్కూల్‌ప్రాజెక్ట్‌లో భాగంగా క్యాన్సర్‌ హాస్పిటల్‌కు వెళ్లింది పద్నాలుగు సంవత్సరాల నిఖియ షంషేర్‌. అక్కడ ఒక వార్డ్‌లో నోటిక్యాన్సర్‌ పేషెంట్‌ను చూసింది. అతడి దవడ సగం తీసేశారు. మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను బతకడం కష్టమట...ఈ దృశ్యం షంషేర్‌ను కదిలించింది, చాలాకాలం వెంటాడింది. నోటి క్యాన్సర్‌ గురించి అధ్యయనం మొదలుపెట్టింది. కొత్త కొత్త విషయాలు తెలిశాయి. పేద,మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లో నోటి క్యాన్సర్‌ ఎక్కువగా ఉంది.

మన దేశంలో నోటి క్యాన్సర్‌ బారిన పడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పొగాకు వినియోగం, మద్యం సేవించడం, వక్క నమలడం....మొదలైనవి ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి మాత్రమే కాదు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి వారిని సమస్యల వలయంలో నెడుతున్నాయి. వ్యాధిని ముందుగా గుర్తించడం కోసం రొటిన్‌ చెకప్‌లకు వెళ్లే అలవాటు మనలో చాలామందికి లేదు. ప్రారంభదశలో గుర్తించగలిగితే వ్యాధిని సమర్థవంతంగా నయం చేయవచ్చు అంటున్నాయి పరిశోధనలు.

ప్రమాదఘంటికలు మోగుతున్న దశలోనే జాగ్రత్తపడే సాధనాన్ని కనిపెడితే? అలా షంషేర్‌ పరిశోధనల్లో నుంచి పుట్టుకు వచ్చిన సాధనమే ‘క్విట్‌పఫ్‌’ అనే ఎర్లీ రిస్క్‌ వోరల్‌ క్యాన్సర్‌ డిటెక్టర్‌. రిస్క్‌లో ఉన్నామా? ఉంటే ఈ ఏ దశలో ఉన్నాం? అనేది ఈ ‘క్విట్‌పఫ్‌’ కనిపెడుతుంది. దీనివల్ల మిడిల్‌ నుంచి హైరిస్క్‌ ఉన్నవాళ్లు వెంటనే వైద్యుడిని సంప్రదించడానికి వీలవుతుంది. ‘క్విట్‌పఫ్‌ లక్ష్యం పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించడం మాత్రమే కాదు అలవాట్లలో మార్పు తీసుకురావడం కూడా’ అని చెబుతోంది బెంగళూరులోని ‘గ్రీన్‌వుడ్‌ హై ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ విద్యార్థి అయిన షంషేర్‌.

అయితే ఈ ‘క్విట్‌పఫ్‌’ ప్రయాణం నల్లేరు మీద నడక కాలేదు. ఎన్నోసార్లు ప్రయోగం విఫలం అయింది. ఒక దశలో నిరాశ కమ్మేసేది. మళ్లీ ఉత్సాహం కొని తెచ్చుకొని ప్రయోగాల్లో మునిగిపోయేది షంషేర్‌. మొత్తానికైతే సాధించింది! ప్రయోగదశలో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. షంషేర్‌ మాటలు విని తేలిగ్గా తీసుకునేవాళ్లే. అనుమతి ఇచ్చే వాళ్లు కాదు. ఆమె చిన్నవయసులో ఉండడం దీనికి కారణం. ఎట్టకేలకు బెంగళూరులోని ‘విక్టోరియా హాస్పిటల్‌’లో అనుమతి దొరికింది.

500 మందికి పైగా క్రానిక్‌ స్మోకర్లు, నాన్‌స్మోకర్లపై పరీక్షలు నిర్వహించింది. ‘క్విట్‌పఫ్‌’ అనుకున్న ఫలితాలను ఇస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మార్కెట్లో అందుబాటులో ఉండబోతుంది. ఈలోపు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది. ఒక వైపు చదువు, మరోవైపు ‘క్విట్‌పఫ్‌’ ప్రాజెక్ట్‌పై పనిచేయడానికి షంషేర్‌  చాలా కష్టపడాల్సి వచ్చింది. రిసెర్చ్‌గ్రాంట్, తనకు వచ్చిన అవార్డ్‌ సొమ్మును ప్రాజెక్ట్‌ కోసం ఉపయోగించింది.

ఒక క్లాసులో 50 మంది విద్యార్థులు ఒకే పాఠ్యపుస్తకాన్ని షేర్‌ చేసుకోవడం, చెప్పులు లేకుండా స్కూలుకు వచ్చే విద్యార్థులు, స్కూలు బ్యాగు కొనలేని పేద విద్యార్థులను చూసింది షంషేర్‌. ప్రయోగసహితంగా పాఠ్యబోధన జరిగితే వచ్చే ఫలితం బాగుంటుందనేది నమ్మకం కాదు శాస్త్రీయ నిజం. దురదృష్టవశాత్తు చాలా స్కూళ్లల్లో ‘పాఠ్యబోధన’ అనేది ఏకధాటి ఉపన్యాసం అవుతుంది. క్లాసుల్లో ఒక్క ప్రయోగం కూడా జరగలేదు. దీంతో చాలామంది విద్యార్థులు పరీక్ష తప్పారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. చివరికి చదువుకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. దీని నుంచి మార్పు తీసుకురావడానికి పదమూడు సంవత్సరాల వయసులోనే ఫిలోంత్రపిక్‌ ప్రాజెక్ట్‌ ‘యెర్న్‌ టు లెర్న్‌’ చేపట్టింది.

తల్లిదండ్రులు, స్నేహితులు, స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో స్కూళ్లలో సైన్స్, మ్యాథ్స్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు కృషి చేసింది. దీనివల్ల ఎంతోమంది విద్యార్థుల చదువు మెరుగుపడింది. తన ఇ–కామర్స్‌ వైబ్‌సైట్‌ ‘క్నిక్‌నాక్స్‌’ ద్వారా వచ్చిన ఆదాయంలో  వందశాతం సేవాకార్యక్రమాలకు ఉపయోగిస్తుంది.

టీనేజర్స్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే గ్లోబల్‌ సైన్స్‌ కాంపిటీషన్‌ ‘జూనియర్‌ ఛాలేంజ్‌’లో టాప్‌స్కోరర్‌గా నిలిచింది. తన ఫేస్‌బుక్‌ పేజీలో ‘స్పేస్‌టైమ్‌ అండ్‌ గ్రావిటీ’పై  చేసిన వీడియో పోస్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. తాను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ‘డయానా లెగసీ అవార్డ్‌’ ‘ఔట్‌స్టాండింగ్‌ యూత్‌ ఎకనామిక్‌ సిటిజన్‌షిప్‌’ (జర్మనీ) అవార్డ్‌...మొదలైన ప్రతిష్ఠాత్మకమైన అవార్డులతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకున్న షంషేర్‌కు అభినందనలు తెలియజేద్దాం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు