Nimish Goel- Truefan: విరాట్‌ కోహ్లీని కలిసి షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు! ఆ తర్వాత..

1 Jul, 2022 17:24 IST|Sakshi

మై డియర్‌ అభిమాని

అల్లావుద్దీన్‌ అద్భుత దీపం దొరికితే వేరే ఎవరైనా ఏం కోరిక కోరుతారో తెలియదుగానీ...అభిమాని మాత్రం ‘నా ఫెవరెట్‌ స్టార్‌ నాతో మాట్లాడాలని ఉంది. నెరవేర్చు ప్లీజ్‌’ అంటాడు. మన దేశంలో ఎన్నో రంగాల సెలిబ్రిటీలకు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ‘ట్రూఫ్యాన్‌’ అనేది ఇప్పుడు వారి పాలిట అద్బుతదీపం అయింది...

ఇంకా రెండురోజుల్లో తాను ఒక వివాహ వేడుకకు వెళ్లాలి. ఆరోజు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు నిమిష్‌ గోయెల్‌. నిజానికి అతని ఆసక్తి వివాహవేడుక గురించి కాదు. ఆ వివాహనికి హాజరుకాబోతున్న విరాట్‌ కోహ్లీ గురించి. కోహ్లీకి తాను వీరాభిమాని. ఆరోజు రానే వచ్చింది. అతి కష్టం మీద విరాట్‌ కోహ్లీని కలిసి షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. అది తనకు మరిచిపోలేని సమయం. పదేపదే గుర్తుతెచ్చుకుంటూ ఎప్పటికీ గుర్తుండిపోయే సమయం.

నిజానికి ఆ సమయమే తన టైమ్‌ను మార్చింది. తనకంటూ ఒక మంచి టైమ్‌ను తీసుకువచ్చింది. ఏదో మామూలు ఉద్యోగం చేసుకునే తనను స్టార్టప్‌ స్టార్ట్‌ చేయడానికి ప్రేరణ ఇచ్చింది. ‘ట్రూఫ్యాన్‌’కు కో–ఫౌండర్, సీయివోను చేసింది. కోహ్లీని కలుసుకున్న శుభసందర్భంలో తనలాంటి అభిమానుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు నిమిష్‌.

అభిమానికి, ఫెవరెట్‌స్టార్‌కు మధ్య ఇంటరాక్షన్‌కు వీలయ్యే ఒక వేదిక గురించి ఆలోచించాడు. ఎన్‌.అగర్వాల్, దేవేందర్‌ బిందల్‌తో కలిసి ‘ట్రూఫ్యాన్‌’ అనే సెలిబ్రిటీ ఫ్యాన్‌ ఎంగేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టాడు. ఫండ్‌రైజింగ్‌లో భాగంగా  ఎర్లీ–స్టేజ్‌ ఇన్వెస్టర్లను సంప్రదించారు. వారు ఓకే అనడంతో బండి పట్టాలకెక్కింది. ‘ట్రూఫ్యాన్‌’ ద్వారా తమ ఫెవరెట్‌ స్టార్‌తో ఇంటరాక్ట్‌ కావడానికి చిన్నపాటి క్విజ్‌లో విజేత కావాల్సి ఉంటుంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు...మొదలైన సందర్భాల్లో మాత్రమే కాదు వ్యక్తిగత సలహాలు తీసుకోవడం నుంచి మొదలు తమ ఫెవరెట్‌స్టార్‌కు విన్నపాలు వినిపించుకునే అవకాశం వరకు ఉంటుంది.

‘ట్రూఫ్యాన్‌’కు 1.5 మిలియన్‌కు పైగా యూజర్స్‌ ఉన్నారు. రణ్‌వీర్‌సింగ్‌లాంటి స్టార్‌తో ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. ఇదే మార్కెట్‌లో ఇతర  ప్లాట్‌ఫామ్‌ల ఏటీపి(అవరేజ్‌ టికెట్‌ ప్రైస్‌) వెయ్యి నుంచి అయిదువేల వరకు ఉంటే ‘ట్రూఫ్యాన్‌’లో మాత్రం మూడువందల నుంచి అయిదు వందల రూపాయల వరకు ఉంది. ఐఐటీ–ఖరగ్‌పూర్‌ విద్యార్థి అయిన నిమిష్‌ ‘మన దేశంలో ఫ్యాన్స్‌–సెలబ్రిటీలకు సంబంధించి శక్తివంతమైన మార్కెట్‌ను సృష్టించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు. 

చదవండి: Porgai Art: ట్రైబల్‌ హార్ట్‌.. ‘పోర్గై’ కళ.. ఎంబ్రాయిడరీతో మంచి ఆదాయం!
  

మరిన్ని వార్తలు