చింతలకుంట సైంటిస్ట్‌

18 Aug, 2020 05:53 IST|Sakshi
‘జీవ శైథిల్య కుండీ’తో శ్రీజ, ‘కోవిడ్‌ స్మార్ట్‌ అలారం వాచ్‌’

శ్రీజ : నైంత్‌ క్లాస్‌ 

కరోనా ముప్పుతో పొలానికి వెళ్లాలంటేనే భయంగా ఉందన్న తన తండ్రి మాటను తేలికగా తీసుకోలేదు శ్రీజ. రేయింబవళ్లు కష్టపడి ‘కోవిడ్‌ స్మార్ట్‌ అలారం వాచ్‌’ తయారు చేసింది. దానిని తన తండ్రి చేతికి కట్టి ధైర్యంగా పొలానికి వెళ్లిరమ్మని చెప్పింది. ప్లాస్టిక్‌ కవర్‌ కుండీలో కనిపించిన చనిపోయిన మొక్కను పక్కకు పెట్టి మరో మొక్కను నాటలేదు శ్రీజ. మొక్క చనిపోవడానికి కారణమైన ‘ప్లాస్టిక్‌’కు చెక్‌ పెట్టేందుకు వేరుశనగ పొట్టుతో ‘జీవ శైథిల్య కుండీలు’ తయారు చేసింది. పద్నాలుగేళ్ల శ్రీజ రైతు బిడ్డ. 

జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంట ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీజకు పైరెండు ఆవిష్కరణల వల్ల బాల శాస్త్రవేత్తగా గుర్తింపు లభించింది. చేతుల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని తెలుసుకున్న శ్రీజ.. ఏమరుపాటుగానైనా ముఖం మీదకు చేయి వెళ్లకుండా అప్రమత్తం చేసేందుకు పాఠశాల హెచ్‌.ఎం. ఆగస్టీన్‌ సహకారం తీసుకుని కోవిడ్‌ స్మార్ట్‌ అలారం (అలర్ట్‌ బజర్‌) ను తయారు చేసింది! ఇది ధరించి.. కరచాలనం చేయబోతున్నా, నోరు, ముక్కు, చెవుల దగ్గరకు చేతిని తీసుకెళ్లినా అలారం మోగుతుంది. ఇందుకు రు. 50 మాత్రమే ఖర్చు అయిందనీ, దీనిలో 9 వాట్స్‌ బ్యాటరీ, బజర్, చిన్న లైట్, ఒక సెన్సర్‌ ఉంటాయని శ్రీజ చెప్పింది.

కోవిడ్‌ స్మార్ట్‌ వాచ్‌ని కనిపెట్టిన క్రమంలోనే.. ఓసారి గద్వాలకు వెళ్తుండగా దారి మధ్యలో నర్సరీ మొక్కల ప్లాస్టిక్‌ కుండీలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించింది శ్రీజ. స్కూలు తరఫున మొక్కలు నాటుతున్నప్పుడైతే ప్లాస్టిక్‌ కుండీలలోని కొన్ని మొక్కలు చనిపోవడం చూసింది. అప్పట్నుంచే ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా ఏదైనా తయారు చేయాలని అనుకుంది. హెచ్‌.ఎం. సూచనలు తీసుకుని వేరుశనగ పొట్టుతో మొక్కల కుండీలు తయారు చేసింది. వాటిని అలాగే భూమిలో నాటితే వాటంతట అవే భూమిలో కలిసిపోతాయి. అంతేకాదు.. వేరుశనగ పొట్టులో నైట్రోజన్, ఫాస్పరస్‌ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అవి మొక్కకు సహజ ఎరువుగా మారి పెరుగుదలకు దోహదపడతాయి. ఈ ఆలోచనతో శ్రీజ చేసిన ఆవిష్కరణ సౌత్‌ ఇండియా సైన్స్‌ఫేర్‌లో బహుమతి దక్కించుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘ఇంటింటా ఇన్నోవేషన్‌’ కార్యక్రమానికి జిల్లా నుంచి శ్రీజ తయారు చేసిన ‘జీవశైథిల్య మొక్కల కుండీలు’ కాన్సెప్ట్‌ ఎంపికైంది. – బొల్లెదుల కురుమన్న, సాక్షి, గద్వాల అర్బన్‌

కుటుంబ నేపథ్యం
శ్రీజ తల్లిదండ్రులు మీనాక్షి, సాయన్న. సొంత పొలంలో పత్తి, వేరుశనగ, మిరప, కంది పంటలు సాగు చేస్తారు. నలుగురు పిల్లల్లో శ్రీజ రెండో అమ్మాయి. అక్క మౌనిక ఇంటర్‌ పూర్తి చేసింది. చెల్లెలు అశ్విని కూడా తొమ్మిదో తరగతి, తమ్ముడు శివ నాలుగో తరగతి చదువుతున్నాడు.

మరిన్ని వార్తలు