యాచకురాలు అయింది చట్టభద్రురాలు

4 Dec, 2020 08:09 IST|Sakshi

ఒక వయసు వచ్చాక శరీరంలో వచ్చిన మార్పులు అర్థం కాలేదు..ఇంటి నుంచి, సమాజం నుంచి వచ్చే ఛీత్కారాలు ఎందుకో అర్థం కాలేదు..తనలా ఉండేవారితో కలిసిపోవడానికి వచ్చినవారి ప్రవర్తన అర్థం కాలేదు..అర్థమైంది ఒక్కటే... చదువు మాత్రమే తనకు మనుగడ ఇస్తుందని. తను నమ్ముకున్న చదువే యాచన నుంచి న్యాయవాదిగా మార్చింది. పాకిస్థాన్‌ మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ లాయర్‌గా స్థానం పొందింది. మన దేశంలో మూడేళ్ల క్రితం జోయితా మొండల్‌ మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ ‘మొదటి’ స్థానాన్ని పాకిస్థాన్‌లో నిషారావు సొంతం చేసుకుంది. సమాజంలో థర్డ్‌ జెండర్‌ తన సత్తా చాటుతోంది అని నిరూపిస్తోంది.

రెండు రొట్టెల కోసం పాట్లు
తన కృషికి ఫలితం లభించినందుకు ఈ రోజు నిషా సంతోషంగా ఉంది. కానీ, ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు సామాన్యమైనవి కావు. 28 ఏళ్ల నిషా మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తనలో వచ్చిన మార్పులకు ఇంటి నుంచి నిరాదరణ, సమాజం నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంది. భరించలేక మరో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లతో కలిసి ఇంటి నుంచి  బయలుదేరింది. తనలా ఉండే ట్రాన్స్‌జెండర్లతో కలిసి కరాచీకి వెళ్లింది. కానీ, తినడానికి తిండి లేక చాలా కష్టాలు పడింది. ‘రోజుకు రెండుసార్లు రొట్టెలు కావాలంటే సెక్స్‌ వర్కర్‌ కావాలని సలహా ఇచ్చారు తోటి వాళ్లు. కానీ, ఆ పని నాకు నచ్చలేదు. అదే విషయాన్ని చెప్పి యాచనవైపు వెళ్లాను’ అని చెప్పింది నిషా. 

ట్రాఫిక్‌ లైట్ల నుంచి లా కాలేజీ వరకు
జీవనోపాధి కోసం ట్రాఫిక్‌ లైట్ల వద్ద యాచించడం ప్రారంభించింది. ఛీత్కారాలూ భరించింది. ‘కానీ కొన్ని రోజులకు ఈ పని కూడా నచ్చలేదు. అప్పుడే చదువుకోవాలనుకున్నాను. గౌరవమైన జీవనం కావాలనుకున్నాను. ఈ ఆలోచన రాగానే స్కూల్‌ చదువుతో ఆపేసిన చదువును తిరిగి కొనసాగించాను’ అని తెలిపింది నిషా. పగటిపూట యాచించడం, రాత్రిళ్లు చదువుకోవడం.. ఇదే ఆమె దినచర్యగా మారింది. 2018లో నిషా సింధ్‌ ముస్లిం లా కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. రావు ఇప్పటివరకు 50 కేసులను వాదించింది. ఆమె క్లయింట్‌లలో చాలామంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. లింగమార్పిడి ప్రజలకు వారి హక్కులను పొందడానికి ప్రయత్నిస్తున్న ఒక ఎన్జీఓ కోసం కూడా ఆమె పనిచేస్తోంది.


ట్రాన్స్‌జెండర్స్‌ ఓల్డేజీ హోమ్‌
యాచన చేసే ట్రాన్స్‌జెండర్‌ నయాబ్‌ మాట్లాడుతూ.. ‘నిషా మాతో యాచించడం ద్వారా జీవించేది. కానీ ఈ రోజు తన వల్ల మేమూ ఉత్తమ స్థితిలో ఉన్నాం. ఆమె మాకు అన్ని సమయాలలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అర్ధరాత్రి కూడా ఆమె నుండి సహాయం కోరినా ఎప్పుడూ నిరాకరించదు. ట్రాన్స్‌జండర్లు ముసలివాళ్లు అయ్యాక వారిని పట్టించుకునేవారే ఉండరు. ఆ వయసు వారు ఎంతో దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్నారు. అందుకే వారి కోసం ఓ ఓల్డేజీ హోమ్‌ను నిర్మించాలనుకుంటుంది’ అని వివరించింది. చదువు జీవనగతిని మార్చుతుంది. చదువు ఉన్నతస్థితికి చేర్చుతుంది. చదువు జాతి, మత, కులాలకు అతీతంగా ఎదిగేందుకు ఊతం ఇస్తుంది. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు నిషారావు వంటివారు.  

మరిన్ని వార్తలు