అసలైన టీచరమ్మ! సేవకు రిటైర్మెంట్‌తో పనిలేదని నిరూపించింది!

14 Sep, 2023 15:54 IST|Sakshi

టీచర్‌ అనే పదమే ఎంతో గౌరవనీయమైంది. ఇక ఆ వృత్తి చేసేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా ఆ వృత్తే వారిని తెలియకుండా సేవ వైపుకి మళ్లీస్తుందో లేక వారి ఆలోచన స్థాయిలు అలా ఉంటాయో!. అచ్చం అలానే పదవివిరమణ చేసిన ఓ టీచరమ్మ విశ్రాంతి తీసుకోకుండా ఎందరో అభాగ్యులకు పెద్దమ్మగా, యువతకు ఓ గైడ్‌గా ఎన్నో సేవలు చేస్తూ అందరిచే మన్నలను అందుకుంటోంది. ఆమే గుర్రాల సరోజనమ్మ. ఇవరామె? ఏం చేసిందంటే..

గుర్రాల సరోజనమ్మది నిజామాబాద్‌ జిల్లా బోధన్‌. ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే.. ఆమె భర్త వెంకట్రావు నిజాం షుగర్స్‌లో ఉద్యోగి. ఆర్థికంగా ఏ ఇబ్బందీ లేకున్నా మాకు పిల్లలు లేని లోటు ఉండేది. దత్తత ప్రయత్నాలు చేసినా అవేమీ సాధ్యపడలేదు. పాతికేళ్ల క్రితమే రిటైర్‌ అయ్యింది. ఆ వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. పింఛన్‌ వస్తోంది కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటుగా విధికి కన్నుకుట్టి భర్తను తీసుకుపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన సరోజనమ్మ తోబుట్టువుల పిల్లలే తన పిల్లలు అన్యమనస్కంగా జీవిస్తోంది.

వాళ్లొచ్చినప్పుడు తెగ సంబరపడేది. వాళ్లూ కూడా ప్రేమగానే ఉండేవారు ఆమెతో. కానీ ఆ ప్రేమలన్నీ.. నా ఆస్తి చుట్టూ తిరగడం నచ్చలేదు. ఇవన్నీ చూసి విసిగిపోయి.. ఇంటిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నా. ఇలా ఆలోచిస్తుండగా మా ఉపాధ్యాయులు పడుతున్న బాధలే ఆమెను కదిలించాయి. విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకి సొంత భవనం లేదని తెలుసుకుంది. అందుకోసం.. ఆ సంఘానికి ఇంటిని రాసిస్తే మున్ముందు ఎందరికో సేవలు అందుతాయని విశ్వసించి మరీ ఆ ఇల్లు తన తర్వాత ఆ ఇల్లు సంఘానికి చెందేలా ఏడాదిన్నర కిందటే రిజిస్ట్రేషన్‌ చేయించింది. ఇప్పుడూ ఆ ఇంటి విలువ ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలు. ఇది తెలిశాక బంధువులు ఆమె దగ్గరకి రావడమే మానేశారు.

ఆ రెండు ఘటనలకు పరిష్కారమే ధర్మస్థల్‌
ఓసారి దగ్గరి బంధువొకరు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లింది. ఇంటికి కాస్త దూరంగా శవాన్ని ఉంచారు. ఏంటని ఆరా తీయగా.. ఆ ఇంటి యజమాని అనుమతించలేదని తెలిసింది. ఇంకోసారి పరిచయస్థులొకరు చనిపోతే.. వారుండే ఇంటికి దూరంలో అంత్యక్రియలకు కావాల్సిన పనులు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఈ బాధలు తప్పడం లేదని అర్థమైంది సరోజనమ్మకు. ఈ పరిస్థితి అయినవాళ్లని బాధపెడుతుంది కదా! ఈ రెండు ఘటనలూ సరోజనమ్మను ఆలోచింప చేశాయి. ఇందుకు పరిష్కారంగా వెలిసిందే.. ‘ధర్మస్థల్‌’. ఇందులో చనిపోయినవారి మృతదేహాన్ని అంత్యక్రియలు జరిగేవరకు భద్రపర్చుకోవచ్చు. ఫ్రీజర్‌ సహా అన్ని సదుపాయాలనూ ఇక్కడ ఉచితంగా అందిస్తారు.

ఈ నిర్మాణం ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇందుకోసం రూ.20 లక్షలు వెచ్చించింది. చనిపోయాక మాట అటుంచితే... బతికున్న వాళ్ల ఆరోగ్యానికి భరోసా ఎవరు? అందుకే జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం ట్రస్టు సభ్యులు ప్రారంభించిన జెనరిక్‌ మందుల దుకాణానికి ఆమె వంతుగా రూ. 2 లక్షలు విరాళమందించింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. అసలు ధరకే మందుల్ని అందివ్వడం ఈ ట్రస్టు ఉద్దేశం. దీనివల్ల మధ్యతరగతి, పేదవారికి ఎంతో ప్రయోజనం. రెంజల్‌లోని కందకుర్తి గోదావరి ఒడ్డున గోశాల నిర్మాణానికీ కూడా విరాళం ఇచ్చింది

యువతకోసం నా వంతుగా..
ఒక టీచర్‌గా యువతని మంచి బాట పట్టించాలనే సదుద్దేశంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం ప్రభుత్వ గ్రంథాలయంలో రూ.20 వేల విలువైన పుస్తకాలను అందించింది. ఏడాదికోసారి చింతకుంట వృద్ధాశ్రమానికి వెళ్తుంంది. అక్కడున్న వృద్థులకు నిత్యావసరాల్ని, దుస్తుల్ని అందిస్తుంది. వీలుదొరికినప్పుడల్లా అవయవదానంపై ప్రచారం చేస్తుంది. తన మరణానంతరం దేహాన్ని ప్రయోగాలకు వినియోగించాలని ఆమోదపత్రం కూడా రాసిచ్చింది. మొదట్లో తనకెవరూ లేరునుకుని బాధపడేది. ఇప్పుడు ఈసేవ కార్యక్రమాలు  ఎంతోమంది ఆప్తులను ఆమెకు దొరికేలా చేసింది. పైగా వారిచేత ‘పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలిపించుకుంటుంది. నిజంగా ఆమె చాలా గ్రేట్‌. భర్త పోయి విశ్రాంతిగా ఉండాల్సినీ ఈ వయసులో ఎంతో చలాకీగా ఇలా సేవాకార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సరోజనమ్మ!.

(చదవండి: బీర్‌ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..)

మరిన్ని వార్తలు