శతక నీతి – సుమతి: వాడు దుందుభిలా ఉన్నాడే!

6 Jun, 2022 04:26 IST|Sakshi

‘ఏం తినాలనుకుంటున్నావో అవి తినేసెయ్‌.. ఏది నీకిష్టమో అది ఇప్పుడే చేసేస్కో... ఎవరెవరితో ఏవేం మాట్లాడాలనుకుంటున్నావో అది ఇవ్వాళే మాట్లాడేసుకో... ఈ రాత్రికి హాయిగా నిద్రపో... రేప్పొద్దున యుద్ధానికి రా.. ఎందుకంటే మళ్ళీ ఇంటికెళ్ళవు..’ ...పొగరు మాటలు ఇవి.. రామాయణంలో కనబడతారు.. వాలి, రావణాసురుడు.

వాళ్ళిద్దరి ప్రవృత్తి ఒక్కలాగే ఉంటుంది. ప్రతిరోజూ ఎవరో ఒకరి దగ్గరకి పోవడం, నువ్వు యుద్ధానికి రావాలని రెచ్చగొడుతూ ఇలా మాట్లాడుతుంటారు. వాలి దగ్గరకు వెళ్ళి దుందుభి మాట్లాడిన మాటలివి. వాలి ‘ఎవడ్రా అది’ అని బయటకు వచ్చాడు. ఫలితం– దుందుభి చచ్చిపోయాడు. ఇలాటి వాళ్ళు ఇప్పుడూ మనకు కనిపిస్తూంటారు. వీళ్ళను లోకులు దుందుభితో పోలుస్తుంటారు.

వదరి మాట్లాడడం..ఎందుకలా ? అందుకే బద్దెనగారు సుమతీ శతకంలో..‘బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ !’ అంటారు. రామాయణం అదే చెబుతుంది. మన పురాణాలు, నీతి శాస్త్రాలూ అవే చెబుతాయి. అలా ప్రవర్తించకు. జీవితంలో అటువంటి అలవాట్లు చేసుకోకు. రావణాసురుడు కూడా ఇలాగే .. సముద్రుడి దగ్గరకు వెళ్ళి బెదిరించాడు.

యమధర్మరాజును కూడా వదిలిపెట్టలేదు. కొందరు వీరి దాష్టీకానికి భయపడి పారిపోతే మరికొందరు వీరిని ఓడిస్తుంటారు..ఒకప్పుడు కార్తవీర్యార్జునుడి చేతిలో ఇలాగే ఓడిపోయాడు. అయినా బుద్ధిరాదు. సిగ్గుండదు, మారరు. అలా అతిశయంతో ప్రవర్తించినందుకు చిట్టచివరకు ఏమయింది ... రావణుడు ఒక్కడే పోలేదు, బంధుమిత్రకళత్రాదులందరూ పోయారు, లంకాపట్టణంలో ఉన్న రాక్షసులందరూ పోయారు. .ధర్మం వైపునిలబడ్డ విభీషణుడు తప్ప.

ఒకప్పుడు ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ సభకు వెళ్ళినా ఒక మాట అంటుండేవాడు...నాకు తెలిసినన్ని అంకెలు, సంఖ్యలు ఎవరికీ తెలియవు. ఎంతవరకయినా లెక్కపెట్టగలను... అని. ఒకసారి సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు.. ఒడ్డున ఇసుక బాగా ఉంటుంది కదా... అక్కడ కూర్చుని చేత్తో గుప్పెడు ఇసుక తీసుకొన్నాడు. ఉన్నట్లుండి.. తత్త్వం బోధపడింది.

నేను నిజంగా ఇక్కడ ఉన్న ఇసుక రేణువులన్నింటినీ లెక్కపెట్టి చెప్పగలిగే అంకెలు, సంఖ్యలు నాకు తెలుసా.... ఎదురుగా ఉండే అలలు ఎగిసిపడుతుంటే నీటిబిందువులను చూసాడు... వీటిని లెక్కపెట్టి చెప్పగలిగే సంఖ్య నాకు తెలుసా.. ఇలా ఆలోచిస్తుంటే.. నేను ఎంత పెద్ద సంఖ్యయినా లెక్కపెట్టగలను అనుకున్నాను. కానీ కాదు. నాకు తెలిసినదేపాటి? వాటిని సృష్టించినవాడు గొప్ప... అని చేతులెత్తి నమస్కరించుకున్నాడు. ఇక ఆ పై ఎప్పడూ ఇటువంటి అతిశయోక్తి మాటలు మాట్లాడలేదు.

ఇతరులకంటే మనకు ఏవయినా కొన్ని విషయాలు కానీ వాటిలో నైపుణ్యాలు కానీ ఎక్కువ తెలిసి ఉండడం తప్పుకాదు. కించిత్‌ గర్వ కారణం కూడా. కానీ  నాకే అన్నీ తెలుసు, నేనే సర్వజ్ఞుణ్ణి అని వదరడం మాత్ర తప్పు. మనం ఎంతటి గొప్పవారమయినా మనకంటే గొప్పవారు కూడా ఉంటారనే ఎరుక ఉండాలి. అప్పుడు వినయం దానంతటే అదే వస్తుంది. శంకర భగవత్పాదులవంటి మహాపురుషుడు ఒక చోట...‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథిత్‌ కృపయా పాలయ విభో’’ అంటారు. శంకరా, నేను పశువుతో సమానం– అల్పజ్ఞుణ్ణి. నీవు పశుపతివి.. అంటాడు.  అంతటివాడు అంత వినయం ప్రదర్శిస్తే అరాకొరా తెలిసిన మనం ఎలా ప్రవర్తించాలి?

మరిన్ని వార్తలు