National Epilepsy Day: చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా.. ఉన్నట్టుండి కిందపడిపోయి

17 Nov, 2022 20:07 IST|Sakshi

చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తూ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్లుండి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉండటం మనలో చాలా మంది గమనించి ఉంటాం. ఇలా కింద పడి ఉన్న వ్యక్తుల చేతిలో తాళం చెవులు పెడితే కాసేపటికి తేరుకుని మళ్లీ ఏమీ జరగనట్లు వెళ్లిపోతూ ఉంటారు. దీనినే వాడుకభాషలో వాయి అని పిలుస్తారు. వ్యవహారికభాషలో మాత్రం మూర్చగా పేర్కొంటారు. వైద్యపరిభాషలో ఫిట్స్‌ లేదా ఎపిలెప్సీగా చెబుతారు. నవంబర్‌ 17న జాతీయ మూర్ఛ వ్యాధి అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.  

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజీ విభాగానికి ప్రతి వారంలో సోమ, గురువారాల్లో రెండు రోజులు ఓపీ నిర్వహిస్తారు. ఇక్కడికి ప్రతి ఓపీ రోజున 250 మంది దాకా చికిత్స కోసం వస్తారు. ఈ లెక్కన నెలకు సగటున 2వేల మంది, ఏడాదికి 24వేల మంది ఓపీలో వైద్యం తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒక ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి. శ్రీనివాసులు, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ. శ్రీనివాసులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సౌజన్య, డాక్టర్‌ శ్యామసుందర్‌ సేవలందిస్తున్నారు. వచ్చిన రోగుల్లో 20 శాతానికి పైగా మూర్ఛవ్యాధిగ్రస్తులే ఉంటున్నారు.

జనాభాలో ఒక శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల అంచనా. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 45 వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు అంచనా. ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో ప్రస్తుతం ఐపీ సేవలతో పాటు ఈఈజీ మిషన్‌ సేవలు కూడా లభిస్తున్నాయి. ఏడాదికి 15 వేల మందికి ఈఈజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటుగా ఈ పరీక్ష చేయించుకోవాలంటే ఒక్కొక్కరికి రూ.2వేలు ఖర్చవుతుంది.

అవసరమైన వారికి ఎంఆర్‌ఐ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇంకా ఈఎంజీ, ఐసీయూ ఏర్పాటైతే ఈ విభాగానికి అవసరమైన పీజీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోని న్యూరాలజిస్టులు మరో 15 మంది దాకా ఉన్నారు. వీరి వద్ద కూడా నెలకు మరో 900 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. ఇక నాటు మందులను ఆశ్రయించే వారు వీరికి రెట్టింపు సంఖ్యలో ఉంటారు.    

మూర్ఛల్లో రకాలు–లక్షణాలు 
సాధారణ మూర్చలో మొత్తం మెదడు చాలా వరకు దెబ్బతింటుంది. టానిక్‌ క్లోనిక్‌లో ఆకస్మికంగా స్పృహ కోల్పోవచ్చు. రోగిపడిపోవడం, దీంతో పాటు చేతులు, కాళ్లు కొట్టుకోవడం చేస్తారు. అబ్సెన్స్‌ లేక సెటిల్‌ మాలో మూర్ఛలో స్పృహ స్వల్పకాలంపాటు కోల్పోతారు. ఈ దశలో రోగి కొంత కాలం పాటు శూన్యంలోకి చూస్తూ ఉంటారు. మయోక్లోనిక్‌ మూర్ఛలో ఆకస్మిక, సంక్లిప్త కండరాలు సంకోచాలు సంభవిస్తాయి.

ఇవి మొత్తం శరీరమంతా లేదా కొన్ని భాగాలకు సంభవిస్తాయి. అటోనిక్‌ మూర్ఛలో ఆకస్మిక విచి్ఛన్నం సంభవిస్తుంది. ఆ తర్వాత తక్షణమే కోలుకుంటారు. సరళమైన ఫోకల్‌ మూర్ఛలో రోగికి చేతులలో, కాళ్లలో కండరాల లాగుట కనిపిస్తుంది. లేదా వినికిడి, దృశ్యం, వాసన, రుచిలో ఆటంకం కలగవచ్చు. సంక్లిష్ట ఫోకల్‌ మూర్ఛలో రోగి స్పృహ కోల్పోతాడు. రోగికి విచిత్రమైన ప్రవర్తన ఉన్నట్లుగా కనిపిస్తాడు. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు ప్రతిస్పందన లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. సూక్ష్మ ముడతలు, లేదా ముఖంలో, చేతుల్లో, కాళ్లలో తరచూ లాగుతుంది.  

మూర్ఛ వ్యాధికి కారణాలు  
వంశపారంపర్యం, మెనింజైటిస్, రక్తంలో షుగర్‌ శాతం పెరగడం, తగ్గడం, మెదడుకు గాయాలైనప్పుడు, గడ్డలు ఉన్నప్పుడు, రక్తంలోని కొన్ని ఆటో ఇమ్యూన్‌ కారణాల వల్ల మూర్ఛ వస్తుంది.     

మూర్చ(ఫిట్స్‌) అంటే.. 
మూర్చ అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ రుగ్మతల సమూహం. మెదడులోని ఎలక్ట్రిక్‌ యాక్టివిటీ అసాధారణ పగుళ్ల వల్ల సంభవిస్తుంది. మూర్చలు వాటి కారణం, కేంద్ర స్థానాన్ని బట్టి వర్గీకరించవచ్చు. మూర్చలు తరచుగా కన్వల్షన్స్‌ లేదా ఎపిలెప్టిక్‌ ఫిట్స్‌గా సూచిస్తారు. ఇది సున్నా నుంచి 10 ఏళ్లలోపు, 50 నుంచి 70 ఏళ్లలోపు వారికి కలుగుతుంది. ఒక్కోసారి ఏ వయస్సులో వారికైనా రావచ్చు.

మూర్ఛవ్యాధి నిర్ధారణ 
మూర్ఛకు గురైన వారు వైద్యుని వద్దకు వచ్చిన వెంటనే అతని పక్కన ఉన్న వ్యక్తితో జరిగిన సంఘటన గురించి వైద్యులు ఆరా తీసి అది మూర్ఛనా కాదా తెలుసుకుంటారు. నిర్ధారణ కోసం అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, ఈఈజీ పరీక్షలు చేయిస్తారు. కొన్నిసార్లు వీడియో ఈఈజీ పరీక్ష కూడా చేయాల్సి రావచ్చు. వీటి ద్వారా మెదడులోని ఏ భాగంలో దెబ్బతినడం వల్ల మూర్చ వస్తుందో గుర్తిస్తారు.  

మందులు వాడితే తగ్గిపోతుంది
మూర్ఛ వ్యాధిగ్రస్తులను దాదాపు 75 శాతం మందిని మందులతోనే పూర్తిగా నయం చేయవచ్చు. కేవలం 25 శాతం మందికి మాత్రమే ఆపరేషన్‌ అవసరమవుతుంది. ఇలాంటి ఆపరేషన్లకు ఎక్కువగా కేరళలోని శ్రీ చిత్ర ఆసుపత్రికి వెళతారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్, ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రులు ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం మూర్ఛ వ్యాధికి 25 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. మా విభాగానికి వచ్చిన మూర్ఛ రోగులకు ఉచితంగా మందులు, చికిత్స, వైద్యపరీక్షలు చేయిస్తున్నాం. అయితే వైద్యుల సూచన మేరకు ఇంటి వద్ద మందులు వాడితేనే చికిత్సకు వ్యాధి లొంగుతుంది.            
– డాక్టర్‌ సి.శ్రీనివాసులు, న్యూరాలజీ విభాగం హెచ్‌ఓడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల  

మరిన్ని వార్తలు