మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’

1 Sep, 2021 00:20 IST|Sakshi

దిక్కు లేని వారికి దేవుడే ఏదో ఒక దిక్కు చూపిస్తాడు. తమిళనాడులో అయితే ఆ దిక్కును ‘మనీషా’ పేరుతో పిలుస్తారు. 24 ఏళ్ల మనీషా ఈరోడ్‌లో నర్సింగ్‌ కాలేజీలో పాఠాలు చెబుతుంది. కాని ఆ కాసేపు మినహాయిస్తే తక్కిన సమయమంతా దీనులకు ఆమె అమ్మగా మారుతుంది. మతిస్తిమితం తప్పి వీధుల్లో ఉన్నవారిని మామూలు మనిషిని చేసే వరకూ ఆమె విశ్రమించదు. దూరం నుంచి దానం అందరూ చేస్తారు. దగ్గరి నుంచి సేవ చేసే మనీషి మనీషా.

మనీషా చిన్నప్పుడు చెన్నైలో తన తండ్రితో పాటు కలిసి తండ్రి నడిపే మటన్‌షాప్‌కు వెళ్లేది. నాలుగు రోజులు వెళ్లాక తండ్రి ఎంత కష్టంగా సంపాదన చేస్తున్నాడో, ఎంత కష్టంగా పేదరికంలో తాము బతకాల్సి వస్తోందో ఆమెకు అర్థమైంది. మూడు పూట్ల అంతో ఇంతో తినడానికి ఉన్న తమ పరిస్థితి ఇలా ఉంటే రోడ్డు మీద ఏ దిక్కూ లేకుండా తిరిగే దౌర్భాగ్యుల పరిస్థితి ఏమిటి అని ఆ వయసులో ఆమెకు అనిపించేది. ఎందుకంటే షాపులో ఉన్నంత సేపు పిచ్చివాళ్లో, దిక్కులేని వాళ్లో కనిపిస్తూనే ఉండేవారు. పెద్దయ్యాక అయినా వారి కోసం ఏమైనా చేయగలనా అనుకునేది మనీషా.


డాక్టర్‌ అవ్వాలని

బాగా చదివి డాక్టర్‌ అవ్వాలని అనుకునేది మనీషా. కాని అంత డబ్బు లేదు. అందుకు ప్రిపేర్‌ అయ్యేందుకు కూడా డబ్బు లేదు. సైన్యంలో చేరి దేశం కోసం పని చేయాలనుకుంది. కాని ఆడపిల్లను పంపడానికి తల్లిదండ్రులు, బంధువులు ఎన్నో విధాలుగా సంశయించారు. అందుకని నర్సింగ్‌ కోర్స్‌ చదివి ఈరోడ్‌లో లెక్చరర్‌ అయ్యింది మనీషా. డాక్టర్‌గా చేయాల్సిన సమాజ సేవ, సైనికురాలిగా చేయాల్సిన దేశ సేవ రెండూ ఒక సామాజిక కార్యకర్తగా చేయాలని నిశ్చయించుకుంది. 2018లో ఒక న్యూస్‌పేపర్‌లో ఆమె తంజావూరులో ఒక దీనుడి ఫొటో చూసింది. ఎవరూ పట్టించుకోక ఆ దీనుడు ఆకలితో అలమటిస్తున్నాడని ఆ ఫొటో సారాంశం. వెంటనే మనీషా ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టి అందరి సాయం కోరింది. తంజావూరు వెళ్లి మరీ ఆ దీనుడి షెల్టర్‌కు చేర్చడంలో సాయపడింది. అలా ఆమె పని మొదలయ్యింది.

ఇలాంటి వారు కావాలి
డబ్బు సాయం చేయమంటే చేసేవారు చాలామంది ఉంటారు. కాని ప్రత్యక్షంగా సేవ చేయమంటే వెనుకాడుతారు. కాని మనీష తానే స్వయంగా సేవ చేస్తుంది. పిల్లలు బాగా మురికి పడితే కన్న తల్లే విసుక్కుంటుంది. కాని సంవత్సరాల తరబడి స్నానపానాలు లేకుండా శుభ్రత లేకుండా తిరిగే పిచ్చివాళ్లకు, డ్రగ్‌ అడిక్ట్స్‌కు, అనాథలకు, ఇళ్ల నుంచి పారిపోయిన వారికి తానే స్వయంగా సేవ చేస్తుంది మనీషా. వారికి క్షవరం చేస్తుంది. స్నానం చేసేలా చూస్తుంది. బట్టలు ఇస్తుంది. వారి షెల్టర్‌ కోసం ప్రయత్నిస్తుంది. ఈరోడ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ ఆదుకుంటోంది. వీరిలో ఎవరైనా పనిచేసి సంపాదించే సత్తా ఉన్నవారికి వివిధ నైపుణ్యాలలో శిక్షణ  ఇప్పించి ఉపాధి మార్గాలను చూపుతోంది.

జీవితం ఫౌండేషన్‌
తాను సంపాదించే దాంట్లో తన ఖర్చులకు పోగా మిగిలిందంతా ఊరి దిమ్మరుల కోసం ఖర్చు చేస్తుంది మనీష. కాని అది చాలదు. సమాజం ఆసరాతో ఈ పని చేయాలని ‘జీవితం ఫౌండేషన్‌’ పేరుతో ఒక సంస్థను ప్రారంభించింది. దాదాపు 500 మంది దిమ్మరులకు స్వస్థత, భద్రత, భరోసా కలిగించడంలో కృషి చేసింది. ఆమెతో పాటు అలాంటి స్ఫూర్తి ఉన్న యువతరం కూడా తోడయ్యింది. వీరంతా ఒక టీమ్‌గా పని చేస్తూ దీన బాంధవులుగా మారారు. ముఖ్యంగా కరోనా సమయంలో మనీష ఒక గొప్ప మానవిగా మారింది. ఆ సమయంలో అన్నీ మూతపడగా ఈరోడ్‌ చుట్టుపక్కల కొత్తగా వచ్చే లేదా ముందు నుంచి ఉన్న దిమ్మరులకు అన్నమే లేకుండా పోయింది.

వారికి నిలువ నీడ లేదన్న సంగతి కూడా కనిపెట్టింది. వెంటనే ఆమె ఈరోడ్‌ కమిషనర్‌ని కలిసి ఒక స్కూల్‌ను టెంపరరీ షెల్టర్‌గా అడిగింది. వెంటనే కమిషనర్‌ అందుకు అంగీకరించాడు. మనీష ఆ ఇరుగు పొరుగు వారికి వంట చేయమని దినుసులు సరఫరా చేసింది. ఊళ్లో ఉన్న దాదాపు 80 మంది అభాగ్యులను ఆ స్కూల్‌లో ఉండేలా చూసింది. వారికి మాస్కులు, శానిటైజర్లు, రేషన్, మూడుపూటల భోజనాన్ని అందించింది.   వ్యాయామం చేయించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమేగాక, కొంతమందికి వొకేషనల్‌ ట్రైనింగ్‌ ఇప్పించి 54 మందికి ఉపాధి కల్పించింది. మరికొంత మందిని వృద్ధాశ్రమాలకు, కుటుంబాల ఆచూకి తెలిసిన వారిని, కుటుంబ సభ్యులకు అప్పచెప్పింది. మైనర్లకు అరిక ప్లేట్లు, గ్లాసులు తయారు చేసే మెషిన్లను అందించి వారికి ఉపాధి కల్పించింది.

మనిషి బాధ్యత
‘ఎదుటివారి కష్టానికి స్పందించడం మనిషి కనీస బాధ్యత. మన దేశంలో ఎందరో ఎన్నో కారణాల రీత్యా రోడ్డు మీదే బతుకుతుంటారు. వారి గోడు ఎవరూ పట్టించుకోరు. వారి వేదన ప్రభుత్వాలకు అర్థం కాదు. కాని వారిని అక్కున జేర్చుకుని మనుషులుగా చేసే ప్రయత్నం చేసినప్పుడు వారి ముఖాల్లో కూడా చిరునవ్వు వెలుగుతుంది. అలాంటి చిరునవ్వు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను నా జీవితం అంతా ఆ పనికి వెచ్చిస్తాను. పిల్లలు గెంటేసిన వృద్ధులు, డ్రగ్స్‌ బానిసలైన యువకులు, వీధి బాలలు... వీరందరి కోసం ఒక సొంత షెల్టర్‌ కట్టాలని నా కోరిక. ఏదో ఒకరోజు దానిని సాధిస్తాను. ఈలోపు సమాజంలోని మంచి మనసున్న వారితో ఈ సహాయాన్ని కొనసాగిస్తాను’ అంటోంది మనీషా. భవిష్యత్తులో ఆమెను జనం తమిళనాడు థెరిస్సా అని పిలిచినా ఆశ్చర్యం లేదు.

మరిన్ని వార్తలు