ఒకప్పుడు రోజు కూలీ..నేడు యూట్యూబ్‌ స్టార్‌గా లక్షలు ఆర్జిస్తున్నాడు!

15 Feb, 2024 16:18 IST|Sakshi

నాడు ఆ వ్యక్తి రోజు కూలీగా కటిక దారిద్య్రం అనుభవించేవాడు. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అలాంటి స్థితోలో అనుకోని అతిథిలా వచ్చిపడినా కరోనా మహమ్మారితో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. కనీసం కుటుంబాన్ని పోషించలేని దారుణమైన స్థితిలోకి వచ్చేశాడు. అయిపోంది జీవితం అనుకునే టైంలో "యూట్యూబ్‌" ఓ ఆశా కిరణంలా అతడి లైఫ్‌లోకి వచ్చింది. అంతే అక్కడ నుంచి అతడి జీవితమే మారిపోయింది. ఈ రోజు ఏకంగా నెలకు రెండు లక్షల వరకు ఆర్జిస్తున్నాడు. ఇంతకీ అతడెవరు? అతని యూట్యూబ్‌​ ప్రస్థానం ఎలా సాగిందంటే..?

ఒడిశాకు చెందిన ఇశాక్‌ రోజు వారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ చాలీచాలని సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. రోజుకి అతికష్టం మీద 250 రూపాయలు సంపాదించేవాడు. ఇంతలో కరోనా మహమ్మారి కారణం ఆ సంపాదన కూడా లేకుండా పోయింది. పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా అయిపోయింది. ఏంచేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో యూట్యూబ్‌ ఓ వరంలా అతడి జీవితంలోకి వచ్చింది. యూట్యూబ్‌ ఛానెల్‌తో డబ్బులు సంపాదించొచ్చు అనే విషయం తెలుసుకుని వీడియోల చేయడంపై దృష్టి సారించాడు.

ఒడియా వంటకాలతో అలరించాలనుకున్నాడు. తమ సంప్రదాయ వంటకాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేసేవాడు. అయితే మొదట్లో అతడి వీడియోలు ఎవ్వరూ చూసేవారు కాదు. అయితే ఒకరోజు అనుకోకుండా ఒడిశాలో బాగా ఇష్టపడే పులియబెట్టిన అన్నం అయిన బాసి పఖాలా వీడియో బాగా ప్రేక్షకాధరణ పొంది వైరల్‌ అయ్యింది. అంతే అక్కడ నుంచి అతని వీడియోలు బాగా నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీంతో ఒక్కసారిగి అతని ఫాలోవర్ల సంఖ్య 20 వేలకు చేరింది. ఇక యూఎస్‌, బ్రెజిల్‌, మంగోలియా దేశాల వాళ్లు కూడా ఇతని వీడియోలను ఆదరించడంతో ఒక్కసారిగా ఓవర్‌ నైట్‌స్టార్‌ అయ్యిపోయాడు.

ది బెటర్‌ ఇండియా వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు మీడియా అతడి గురించి రాయడంతో మరింత ఫేమస్‌ అయ్యాడు. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్‌ కీ బాత్‌ రేడియో షోలో అతడి గురించి ప్రస్తావించడమే గాకుండా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆ యూట్యూబ్‌ స్టార్‌ ఇశాక్‌ మాట్లాడుతూ..ఈ రోజు నా వీడియోలు బాగా వెళ్తే గనుకు నెలకు దాదాపు రూ. 3 లక్షల దాక సంపాదించగలనని దీమాగా చెబుతున్నాడు. దీనివల్ల  వీడియో ఎడిట్‌ చేసేందుకు ల్యాప్‌టాప్‌ కొనుక్కున్నాను, ఉపయోగించడం తెలుసుకున్నానని చెబుతున్నాడు. అలాగే ఓ సెకండ్‌ హ్యాండ్‌ కారుని కూడా కొనుక్కోగలిగానని ఆనందంగా చెప్పాడు. అలాగే నా కుటుంబాన్ని ఈ రేంజ్‌లో చూసుకోగలుగుతానని కలలో కూడా అనుకోలేదంటూ బావోద్వేగంగా మాట్లాడాడు ఇసాక్‌.

(చదవండి: ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్‌ వాద్రా సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌!)

whatsapp channel

మరిన్ని వార్తలు