Priyanka Nanda: బాలీవుడ్‌లో అడుగుపెట్టాలనుకుంది.. కానీ గ్లామర్‌ ప్రపంచాన్ని వదిలి గ్రామానికి.. సర్పంచ్‌గా పోటీ!

3 Feb, 2022 10:40 IST|Sakshi

మార్చుకున్నఅడుగు... గ్లామర్‌ టు గ్రామం

Priyanka Nanda Contest In Panchayat Polls: మనలో మొలకెత్తిన ఒక ఆలోచన కొత్త మార్గాన్ని తెలుసుకునేదై ఉండాలి. ఆ ఆలోచనను ఆచరణలో పెడితే అది ఉత్తమమైన మార్గం వైపు సాగేలా ఉండాలి. ప్రియంకానంద ఆలోచన, ఆచరణ ఉన్నతి వైపుగా అడుగులు వేయించింది. గ్లామర్‌ ప్రపంచాన్ని వదిలి, తన గ్రామంలోని ఇరుకు రోడ్ల గతుకుల బతుకులను మార్చడానికి ప్రయాణమైంది. 

ఒరిస్సాలోని బలంగిర్‌ జిల్లాలోని ధులుసర్‌ గ్రామానికి చెందిన ప్రియంకానంద తన ఊళ్లో స్కూల్‌ చదువు పూర్తవగానే భోపాల్‌కి వెళ్లిపోయింది. అక్కడే పై చదువులు చదువుకుంది. కాలేజీ చదువులు పూర్తి చేసుకునే క్రమంలోనే గ్లామర్‌ ప్రపంచంవైపుగా అడుగులు వేసింది. ర్యాంప్‌ షోలలో పాల్గొంది. అందాల పోటీలలో టైటిల్స్‌ ఎన్నో గెలుచుకుంది.

2015 నుంచి మోడల్‌గా పనిచేస్తోంది. ఫస్ట్‌ ఇండియా రన్‌వే దివా బ్యూటీ పోటీలో పాల్గొని ఐదవస్థానంలో నిలిచింది. 2020లో ఇండియా స్టైల్‌ ఐకాన్‌ పోటీలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నం చేసింది.

లాక్‌డౌన్‌ సమయంలో తన ఊరు ధులుసర్‌ గ్రామానికి వచ్చిన ప్రియాంకానంద దృష్టి అక్కడ ప్రజల మీద పడింది. తన చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఏ మాత్రం మార్పు లేని ఊరి పరిస్థితులు ఆమెను ఆలోచనల్లో పడేలా చేశాయి. మోడలింగ్‌లో తనకు ఎన్నో అవకాశాలు రావచ్చు. సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు. డబ్బు సంపాదించడంలో అన్ని రకాల అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లచ్చు.

‘కానీ, ఎంతవరకు..? నా ఊరు లాంటి ఎన్నో ఊళ్ల పరిస్థితులు మార్చాలంటే ఇక్కడే ఉండాలి. గ్రామాభ్యుదయానికి పాటుపడే పని చేయాలి’ అనుకుంది. ఆ అనుకోవడానికి ఇటీవల వచ్చిన అవకాశం గ్రామ సర్పంచ్‌ ఎన్నికలు. సర్పంచ్‌ పోటీలో బరిలో దిగి, వీధి వీధి తిరుగుతూ ‘మీ కోసం వచ్చాను. బాగు చేసే అవకాశం ఇవ్వండి’ అంటూ ఓట్లను అడుగుతోంది. 

గ్లామర్‌ ప్రపంచంలో బ్యూటీ గర్ల్‌ అని పిలిపించుకునే ప్రియంకానంద ఒక మంచి పని కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. యువత ఆలోచనలు దేశాభ్యున్నతి వైపుగా కదలాలి అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ప్రియాంకానంద గెలిచి తన ఆలోచనలు అమలులో పెట్టే అవకాశం రావాలని అంతా కోరుకుంటున్నారు.  

చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? 

మరిన్ని వార్తలు