కొండకోనల్లో ప్రవాసిని వైద్యం

13 Jun, 2021 05:36 IST|Sakshi

పోషకాహార లేమి, ప్రసూతి మరణాలు ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంటాయి. ఒరిస్సాలోని కంధమాల్‌ జిల్లాలో గిరిజన తండాలు ఎక్కువ. అరకొరగా కూడా అందని వైద్యసేవలు. రోడ్లు, రవాణా, ఫోన్‌ సదుపాయాలు లేక అటవీ ప్రజానీకం నిత్యం అవస్థలను ఎదుర్కొంటూనే ఉంది. 33 ఏళ్ల ప్రవాసినీ భట్నాగర్‌ ఈ పరిస్థితిని గుర్తించి, అవసరమైన మెడిసిన్స్‌ పట్టుకొని కొండకోనల్లో ఉన్న గిరిజనులకు అందజేస్తోంది. ప్రసూతి మరణాల నివారణకు కృషి చేస్తోంది. ఆరోగ్య అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లుగా ఆత్మశక్తి ట్రస్ట్‌ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసిని మారుమూల గ్రామాల్లోని దాదాపు 21 వేల మంది గిరిజనుల్లో ఆరోగ్య స్పృహ కల్పిస్తోంది.

గిరిజన గ్రామాలు కొండకోనల్లో ఉంటాయి. వాటికి చేరుకోవాలంటే కాలువలు, కొండగట్లు, రాళ్లూ రప్పలు, ముళ్ల పొదలు.. దాటుకుంటూ ప్రయాణించాలి. అలా ప్రవాసిని రోజూ కొన్ని మైళ్ల దూరం నడుస్తూనే గిరిజనులను కలుసుకుంటుంది. ఎలాంటి రవాణా సదుపాయాలు లేని ఈ ప్రాంతాల్లో పనిచేయడం తనకు కష్టమని ప్రవాసినికి తెలుసు. కానీ, వీటి గురించి పట్టించుకోలేదు ప్రవాసిని. గిరిజనులు నేటికీ మొరటైన సాంప్రదాయ వైద్యపద్ధతులనే అనుసరిస్తున్నారు. ఆరోగ్య వృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన సేవలను విస్తరించింది. గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు కరోనా మహమ్మారి మరిన్ని సమస్యలను సృష్టించింది. దీంతో ప్రవాసిని పాత్ర గతంలో కంటే మరింత ముఖ్యమైంది.

ఆరోగ్య పథకాల పట్ల అవగాహన
గిరిజన ప్రాంతాల పరిస్థితి గురించి ప్రవాసిని వివరిస్తూ –‘పోషకాహార లోపం వారికి అన్నిరకాల ఆరోగ్యసమస్యలకు మూలమైంది. ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం వల్ల తల్లీ పిల్లల మరణాల రేటు పెంచుతోంద’ని వివరిస్తుంది. 2018 లో లాభాపేక్షలేని ఆత్మశక్తి ట్రస్టు ద్వారా తన సేవలను అందించడానికి సిద్ధపడింది ప్రవాసిని. మూడునెలలు ఆ సంస్థలో పనిచేసిన తర్వాత పోషకాహారం లేని మారుమూల గ్రామాల ప్రజలకు చేరువకావడానికి ఆసక్తి చూపించింది. అప్పటి నుండి ‘హెల్త్‌ యానిమేటర్‌గా’గా పనిచేస్తోంది. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తగా గిరిజనులకు కావల్సిన ఔషధాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో గిరిజనులు భాగం పంచుకునే లా చేస్తోంది. కష్టపడలేక మధ్యలోనే సేవలను ఆపేసే కొందరిలా కాకుండా ఇష్టంతో తన పనిని కొనసాగిస్తోంది. ప్రతి రోజూ 2–3 గ్రామాలను సందర్శించి ఇల్లిల్లూ తిరిగి ఆరోగ్య సంరక్షణ చేపడుతోంది. తుడిబంధ బ్లాకులో 76 మంది పురుషులు, 37 మంది మహిళలను గ్రామ కార్యకర్తలు గా ఆరోగ్య పరిరక్షకులుగా తయారు చేసింది.

కష్టం తీరింది..
‘ఈ గిరిజన ప్రాంతాల మహిళలు, బాలికలు తమ ఆరోగ్య సమస్యలను పంచుకోవడానికి వెనకాడతారు. కానీ, నాతో ఎలాంటి జంకు లేకుండా పంచుకుంటారు. దీని వల్ల వారి అవసరాలను తెలుసుకోవడానికి, సరైన మార్గం చూపడానికి నాకు వీలవుతుంది’ అని చెబుతుంది ప్రవాసిని. ‘గతంలో జ్వరం వచ్చి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లాలంటే పదేసి కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. దీనికి 200 నుంచి 500 రూపాయలు ఖర్చు కూడా అయ్యేది. ఎంతో కష్టపడి ఆసుపత్రి కి వెళ్లినా అక్కడ సిబ్బంది ఉండేవాళ్లు కాదు. ఇప్పుడు ప్రవాసిని ద్వారా మాకు ఆ కష్టం తీరింది. చిన్న చిన్న జబ్బులకు మందులు అందుబాటులో ఉండటంతో త్వరగా కోలుకోగలుగుతున్నాం’ అని గుమా గ్రామ పంచాయితీ సర్పంచ్‌ సుస్మిత వివరిస్తారు.

ఈ ప్రాంతాల్లో 102, 108 అంబులెన్స్‌ సర్వీసులు అందుబాటులో లేవు. అందుకే జబ్బులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా వారిలో అవగాహన కల్పించడంతోపాటు బాల్య వివాహాలు, రుతు శుభ్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. పోషకాహారం ఆవశ్యకత గురించి చెబుతూ పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రవాసిని లాంటి మహిళలు ఈ సమాజానికి ఎంతో మంది అవసరం. ఇలాంటి వారి వల్లే గ్రామాల అభివృద్ధి మెరుగుపడుతుంది.

ఆదివాసీలతో ప్రవాసినీ భట్నాగర్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు