Ola Future Factory: రెండు చక్రాలు.. 20 వేల చేతులు

14 Sep, 2021 04:55 IST|Sakshi
మహిళా కార్మికులతో ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ సెల్ఫీ

అందరూ స్త్రీలే పని చేసే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫ్యాక్టరీని ఓలా కార్యాచరణలో పెట్టింది. 10 వేల మంది మహిళా కార్మికులను భర్తీ చేయనుంది. ప్రపంచంలో ఇంతమంది స్త్రీలు పని చేసేæఫ్యాక్టరీ, ఆటోమొబైల్‌ ఫ్యాక్టరీ ఇది ఒక్కటే. ‘పురుషులు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఓలా అంటోంది. ఇన్నాళ్లు ఫ్యాక్టరీలను పురుషులు నడిపారు. ఈ పర్యావరణ హిత స్కూటర్‌ ఫ్యాక్టరీని స్త్రీలు నడపనున్నారు.

తమిళనాడు కృష్ణగిరిలో ఒక ఘనమైన మహిళా ఘట్టం మొదలైంది. అక్కడ స్థాపితమైన ‘ఓలా ఈ–స్కూటర్‌ ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ’ పూర్తిగా మహిళా కార్మికులతో, సిబ్బందితో పని చేయనుంది. మొత్తం 10 వేల మంది స్త్రీలు ఈ ఓలా ఫ్యాక్టరీలో పని చేయనున్నారు. ఇప్పటికే మొదటి బ్యాచ్‌ ఫ్యాక్టరీలో చేరింది. ఇంకో ఐదారు నెలల్లో మొత్తం మహిళా కార్మికులు చేరితే ఇదొక అద్భుతమైన స్త్రీ కార్మిక వికాస పరిణామం అవుతుంది. దీనికి అంకురార్పణ చేసిన ఓలా చరిత్ర లిఖించినట్టవుతుంది.

‘స్త్రీ బలపడితే సమాజం బలపడుతుంది’ ఓలా చైర్మన్‌– గ్రూప్‌ సి.ఇ.ఓ భవిష్‌ అగర్వాల్‌ సోమవారం ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు.

‘మా మొదటి బ్యాచ్‌ వచ్చింది. మిగిలిన వారు రావడమే తరువాయి’ అని ఆయన అన్నారు. ఈ–స్కూటర్‌ తయారు చేయనున్న ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలోని దాదాపు వందమంది తొలి మహిళా కార్మిక బ్యాచ్‌తో ఆయన సెల్ఫీ దిగారు. ‘స్త్రీలను ఆర్థికంగా బలపరిస్తే కుటుంబం బలపడుతుంది. దాంతో సమాజం బలపడుతుంది. మహిళా ఆర్థిక స్వావలంబనతో జి.డి.పి పెరుగుతుంది’ అని భవిష్‌ అన్నారు.

‘పారిశ్రామిక రంగంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉంది. ఈ శాతం పెంచాలంటే అందరం కలిసి స్త్రీలను అందుకు ప్రోత్సహించాలి. మా వంతుగా మేము ఓలా ఈ–స్కూటర్‌ ఫ్యాక్టరీని పూర్తిగా స్త్రీలతోనే నిర్వహించనున్నాం’ అని ఆయన అన్నారు.

పర్యావరణానికి హాని చేసే పెట్రోల్‌ టూవీలర్లకు ప్రత్యామ్నాయంగా ఈ–స్కూటర్‌ల తయారీ దేశంలో ఊపందుకుంటోంది. ఓలా ఈ రంగంలో ప్రధాన వాటా పొందేందుకు భారీ స్థాయిలో ఫ్యూచర్‌ ఫ్యాక్టరీని కృష్ణగిరిలో స్థాపించింది. ఇది పూర్తి కావడానికి సుమారు 2500 కోట్లు అవుతాయని అంచనా. 2022లో మార్కెట్‌లోకి వచ్చే లక్ష్యంగా ఇది పని చేయనుంది. ‘సంవత్సరానికి కోటి ఈ–స్కూటర్లు లేదా ప్రపంచ మార్కెట్లో 22 శాతం ఈ–స్కూటర్లు తయారు చేయడం ఈ ఫ్యాక్టరీ లక్ష్యం’ అని భవిష్‌ తెలియచేశారు. ప్రతి రెండు సెకండ్లకు ఒక స్కూటర్‌ తయారయ్యే స్థాయిలో వేల మంది మహిళా సిబ్బంది ఇక్కడ పని చేస్తారు. వీరికి 3000 రోబోలు సహకరించనున్నాయి.

‘మేము మహిళలతో ఈ ఫ్యాక్టరీని నడిపేందుకు పూర్తిస్థాయి శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నాం. అక్కడ శిక్షణ ముగించుకుని వచ్చి ఫ్యాక్టరీలో చేరుతారు’ అని భవిష్‌ చెప్పారు.
ఇంతవరకూ అందరూ సైరన్‌ మోగుతుంటే డ్యూటీకి వెళ్లే పురుషులను చూశారు. మరి కొన్నాళ్లలో వేల మహిళలు ఈ ఫ్యాక్టరీలోకి వెళ్లే దృశ్యం కచ్చితంగా కోట్ల మంది స్త్రీలకు స్ఫూర్తిదాయకం కానుంది.

మరిన్ని వార్తలు