బంగారు బామ్మలు..

14 May, 2022 13:55 IST|Sakshi

నైపుణ్యం 

వయసు అనేది భారం అనుకోవడం లేదు ఈ బామ్మలు. సిక్స్‌టీ ప్లస్‌లో ఫుడ్‌ బిజినెస్‌లు స్టార్ట్‌ చేసి ‘స్టార్‌’లుగా వెలిగిపోతున్నారు.

ఐడియాలు యాపిల్‌ చెట్టుకింద మాత్రమే రావాలని లేదు. వంటగదిలో కూడా వస్తాయి. ముంబైకి చెందిన హర్షకు అలాగే వచ్చింది. లాక్‌డౌన్‌ సమయం అది. బామ్మ ఊర్మిళ అషేర్‌ రకరకాల ఊరగాయలు, టిఫిన్‌ల రుచి చూపించింది. జన్మకు మరిచిపోలేని రుచులవి. ఈ రుచులనే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం ప్రారంభించాలని ఆలోచించాడు హర్ష. బామ్మతో చెప్పాడు. ‘నీదే ఆలస్యం. నేను రెడీ’ అని ఉత్సాహం చూపించింది బామ్మ. దోక్లా, ఖాండ్లీ, గాతిచ, తెస్లా...మొదలైన గుజరాతి వంటకాల రుచులతో ‘గుజ్జు బెన్‌ నాష్తా’ పేరుతో ‘క్లౌడ్‌ కిచెన్‌’ మొదలుపెట్టింది ఊర్మిళమ్మ. బ్రహ్మాండమైన హిట్టు. ఆ తరువాత యూట్యూబ్‌ చానల్‌ మొదలుపెట్టింది. ఎంత మంది సబ్‌స్క్రయిబర్స్‌! ఊర్మిలమ్మ వయసు 77 సంవత్సరాలు.

ఇప్పుడు మనం పంజాబ్‌లోని చండీగఢ్‌కు వెళదాం. ఈ బామ్మ పేరు హర్బజన్‌ కౌర్‌. వయసు 95 సంవత్సరాలు. ‘ఒక మూలకు అదేపనిగా కూర్చోవడం అంటే రోగాలను సాదరంగా ఆహ్వానించడమే’ అని తరచుగా చెప్పే కౌర్‌ కొన్ని సంవత్సరాల క్రితం తీపివంటకాల వ్యాపారం మొదలుపెట్టి విజయం సాధించింది. రకరకాల వంటకాల రుచులను ఇంట్లోవాళ్లకు, చుట్టాలు పక్కాలకు చూపించే కౌర్‌ తన కూతురు కోరిక మేరకు ‘హర్భజన్స్‌’ పేరుతో మొదలు పెట్టిన తీపివంటల వ్యాపారం సూపర్‌హిట్‌ అయింది. ‘బెసన్‌ కీ బర్ఫీ’ అనేది తన తయారీలలో బెస్ట్‌ సెల్లర్‌గా పేరు తెచ్చుకుంది. తండ్రి దగ్గర నేర్చుకున్న వంద సంత్సరాల చరిత్ర ఉన్న ఒక వంటకం స్ఫూర్తితో ‘బెసన్‌ కీ బర్ఫీ’కి రూపకల్పన చేసింది కౌర్‌.

కోల్‌కతాకు చెందిన ఇతి మిశ్రా వయసు 81 సంవత్సరాలు. ఆమె దృష్టిలో ‘వంట’ అనేది ‘ఈరోజు చేయాల్సిన తప్పనిసరి పని’ కాదు. ఉత్సాహంతో చేసే ఒక సృజనాత్మక ప్రయాణం. మిశ్రాకు బోలెడు బంధుగణం ఉంది. వారి నుంచి అపురూపమైన వంటకాలను నేర్చుకుంది. ఆమె వంటకాల రుచికి మైమరిచిన అతిథులు ‘నువ్వు తప్పనిసరిగా వ్యాపారం మొదలుపెట్టాల్సిందే’ అని బతిమిలాడేవాళ్లు. మిశ్రా వంటకాల రుచి విశేషాలు సోషల్‌ మీడియా ద్వారా అక్కడెక్కడో అమెరికా వరకు వెళ్లాయి. అలా  కాలిఫోర్నియాకు చెందిన ‘ట్రావెలింగ్‌ స్పూన్‌’ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. తన ఇల్లే కేంద్రంగా స్వదేశీ, విదేశీ టూరిస్ట్‌లకు బెంగాలీ సంప్రదాయ వంటకాల రుచి చూపిస్తూ ‘భేష్‌’ అనిపించుకుంటుంది మిశ్రా.

అరవై ప్లస్‌ వయసులో తమిళనాడులోని చెట్టినాడ్‌లో ‘ది బంగ్లా’ పేరుతో  హెరిటేజ్‌ హోటల్‌ ప్రారంభించి విజయం సాధించింది మీనాక్షి మెయప్పన్‌. చిల్లి గార్లిక్‌ ఫిష్‌ నుంచి చికెన్‌ విత్‌ బ్లాక్‌ పెప్పర్‌ వరకు ఎన్నో వంటకాలు ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మీనాక్షి వయసు 88 సంత్సరాలు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తుంది. ‘నా వయసును వెనక్కి తీసుకెళుతుంది ఆ ఉత్సాహమే’ అని చమత్కరిస్తుంది మీనాక్షమ్మ.

వీరు మాత్రమే కాకుండా ముంబైకి చెందిన కోకిలా పరేఖ్‌ (80 సంవత్సరాలు) ‘కేటీ–మసాల’, 80 సంవత్సరాల రాధా దాగా ‘త్రిగుణి ఈజీ ఈట్స్‌’... మొదలైనవి విజయపథంలో దూసుకువెళుతున్నాయి. వంటరుచులలోనే కాదు వ్యాపారనైపుణ్యాలలోనూ తమ సత్తా చాటుతున్నారు బంగారు బామ్మలు. 
 

మరిన్ని వార్తలు