చల్లటి పంటలు

24 Feb, 2022 01:11 IST|Sakshi
తను పండించిన పంటలతో మాయా భట్టారాయ్‌

ఈశాన్య రాష్ట్రాలు అనగానే ముందుగా అక్కడి పచ్చటి తోటలు గుర్తుకు వస్తాయి. వీపున బుట్ట తగిలించుకున్న మహిళలు మనోఫలకం మీద మెదలుతారు. వేళ్లతో అలవోకగా తేయాకు చిగుళ్లను గిల్లుతూ బుట్టలో వేస్తున్న దృశ్యం కూడా. అదే ప్రాంతం నుంచి ఓ మహిళ సేంద్రియ పంటలను బుట్టలో వేయసాగింది. ఇప్పుడు... బెస్ట్‌ ప్రోగ్రెసివ్‌ ఫార్మర్‌ అవార్డును కూడా బుట్టలో వేసుకుంది.

ఈశాన్య రాష్ట్రాల్లో మనకు ఒక మోస్తరుగా తెలిసిన రాష్ట్రం సిక్కిమ్, ఆ రాష్ట్రానికి రాజధాని గాంగ్‌టక్, ఆ నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉంది రాణిపూల్‌ అనే చిన్న పట్టణం. అది పట్టణమో, గ్రామమో స్పష్టంగా చెప్పలేం. నివాస ప్రదేశాలకు ఒకవైపు కొండలు, మరోవైపు రాణిఖోలా నది, వాటి మధ్య పచ్చగా విస్తరించిన నేల. ఈ నేలనే తన ప్రయోగశాలగా మార్చుకున్నారు దిల్లీ మాయా భట్టారాయ్‌.

ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌
టెకీగా సిటీలైఫ్‌ చట్రంలో జీవితాన్ని కట్టిపడేయడం నచ్చలేదామెకు. ‘మనల్ని మనం పరిరక్షించుకుంటాం, అలాగే భూమాతను కూడా పరిరక్షించాలి’... అంటారు మాయా భట్టారాయ్‌. అందుకోసం గ్రామంలో సేంద్రియ సేద్యాన్ని, సేంద్రియ ఉత్పత్తుల దుకాణాన్ని కూడా ప్రారంభించారామె. ‘పర్యావరణాన్ని పరిరక్షించడంలో సేంద్రియ వ్యవసాయం ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకే ఈ రంగంలో అడుగుపెట్టాను’ అని చెప్తున్నారామె. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్గానిక్‌ మిషన్‌లో భాగస్వామి అయిన తర్వాత ఆమెకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

శాస్త్ర సాంకేతికతను జోడిస్తూ వ్యవసాయం చేయడంలోనూ, ఆర్థిక సంక్షేమాన్ని సాధించడంలో ఆమె కృతకృత్యులయ్యారు. మన నేలకు పరిచయం లేని పాశ్చాత్య దేశాల్లో పండే అనేక పంటలను ఇక్కడ పండించారామె. ఆ పంటలకు తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని, ఎక్కువ ఎండ తగలకుండా తెల్లని పై కప్పుతో సస్యాలను రక్షించారు. మన అల్లం, వంకాయలతోపాటు పశ్చిమాన పండే బ్రోకలి వంటి కొత్త పంటల సాగులోనూ పురోగతి సాధించారు. ఆమె ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌కు మంచి గుర్తింపు వచ్చింది. మాయా భట్టారాయ్‌ అనుసరించిన ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ మీద స్థానిక మీడియా చానెళ్లు ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి.

సోషల్‌ మీడియా కూడా అందుకుంది. ఆమె ఫార్మింగ్‌ ఫార్ములా విపరీతంగా ప్రజల్లోకి వెళ్లింది. వాతావరణాన్ని కలుషితం కానివ్వకుండా కాపాడడంలో ఆమె తనవంతుకంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని అందించింది. ఆమె స్ఫూర్తితో అనేక మంది మహిళలు పర్యావరణానికి హానికలిగించని విధంగా సాగు చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆమెను ‘బెస్ట్‌ ప్రోగ్రెసివ్‌ ఫార్మర్‌ అవార్డు 2021’తో గౌరవించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌కు చెందిన నార్త్‌ ఈస్టర్న్‌ హిల్‌ రీజియన్‌ 48వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇటీవల మేఘాలయలోని ఉమియమ్‌లో ఆమె ఈ అవార్డు అందుకున్నారు.

పంటకు పురస్కారం
రాణిపూల్‌లోని హాత్‌ బజార్‌లో మాయా భట్టారాయ్‌ దుకాణాన్ని, స్థానిక మహిళలు సేంద్రియసాగులో పండిస్తున్న కూరగాయలను చూపిస్తూ ‘ఇదంతా దిల్లీ మాయా భట్టారాయ్‌ బాటలో మన మహిళలు సాధించిన విజయం. బయటి నుంచి కూరగాయలు మాకక్కరలేదు... అని చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం’ అని కథనాలు ప్రసారం చేసింది స్థానిక ‘వాయిస్‌ ఆఫ్‌ సిక్కిమ్‌’ మీడియా. ‘నేలకు గౌరవం అందాలి. పంటకు పురస్కారాలు రావాలి. పంట పండించే రైతు శ్రమను గౌరవించే రోజులు రావాలి’ అంటారామె.

మరిన్ని వార్తలు