వర్క్‌ ఫ్రం హోమ్‌.. మరోపక్క ప్రకృతి వ్యవసాయం

22 Dec, 2021 20:00 IST|Sakshi
నిలువెత్తు పెరిగిన మాపిళ్లె సాంబ వరి పొలంలో పని చేస్తున్న రవి, సునంద

సీవీఆర్‌ మట్టి సేద్యానికి శ్రీకారం చుట్టిన యువ ఉద్యోగి దంపతులు

రసాయనాల్లేకుండా 8 ఎకరాల పొలంలో సోయా, దేశీ వరి, పప్పుధాన్యాలు, చిరుధాన్య పంటల సాగు

తొలి ఏడాదే ఎకరానికి 11 క్వింటాళ్ల సోయా చిక్కుళ్ల దిగుబడి

రవి కుమార్, సునంద యువ దంపతులు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూరు వెళ్లిపోయారు. రసాయన రహితంగా పండించిన ఆహారంతోనే ఆరోగ్యం చేకూరుతుందన్న స్పృహతో రసాయనాల్లేని వ్యవసాయం ప్రారంభించారు. రవి ఆన్‌లైన్‌లో ఉద్యోగం చేస్తూనే 8 ఎకరాల నల్లరేగడి భూమిలో భార్య తోడ్పాటుతో ఆఫ్‌లైన్‌లో వర్షాధార సేద్యం చేస్తున్నారు. పూర్తిగా సీవీఆర్‌ పద్ధతిలో మట్టి సేద్యంతో తొలి ఏడాదే మంచి దిగుబడులు తీసి భళా అనిపించుకుంటున్నారు ఈ ఆదర్శ యువ రైతులు. 

మాదాని రవి, సునంద ఎమ్మెస్సీ చదువుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటూ అతను ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంటే, ఆమె ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తుండే వాళ్లు. వారికి ఇద్దరు పిల్లలు. రవి స్వగ్రామం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలోని విజయనగరం. 

40 ఎకరాల భూమి కలిగిన అతని తల్లిదండ్రులు వరి, పత్తి తదితర పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. బాల్యం నుంచీ రవికి వ్యవసాయం అంటే మక్కువ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రవి, సునంద ప్రకృతి వ్యవసాయ విషయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. సుభాష్‌ పాలేకర్‌ ప్రసంగాలు విని, పుస్తకాలు, పత్రికలు చదివి, రైతుల విజయగాధల వీడియోలు చూసి స్ఫూర్తి పొందారు. వారాంతాల్లో వీలైనప్పుడల్లా స్వయంగా కొన్ని క్షేత్రాలకు వెళ్లి చూసి, వివరాలు తెలుసుకొని వచ్చేవారు. 

ఇంట్లో ఎవరో ఒకరికి నెలకోసారైనా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. మార్కెట్‌లో దొరికే వంటనూనెలు వాడటం ఆపేసి గానుగ నూనె వాడటం మొదలు పెట్టిన తర్వాత క్రమంగా ఆస్పత్తికి వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయిందని.. ఆ తర్వాత బియ్యం, పప్పులు కూడా మార్చుకున్నామని సునంద చెప్పారు. ఆ విధంగా రసాయనాల్లేని ఆహారంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని గుర్తించిన తర్వాత.. నగర పరిసరాల్లో భూమిని కౌలుకు తీసుకునైనా వారాంతాల్లో మనమే ఎందుకు పంటలు పండించుకోకూడని ఆలోచించారు. ఆ ప్రయత్నాలు సాగుతుండగా కరోనా వచ్చిపడింది. 

నవారతో ప్రారంభం
లాక్‌డౌన్‌ కారణంగా వర్క్‌ఫ్రం హోం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో వీరి కుటుంబం సొంత గ్రామానికి మకాం మార్చింది. తొలుత గత ఏడాది ఫిబ్రవరిలో 3–4 సెంట్ల భూమిలో నవార విత్తారు. ‘మా అత్త మామల ద్వారా దుక్కి చేయటం, గొర్రుతో విత్తనం వేయటం వంటి ప్రతి పనినీ కొత్తగా నేర్చుకున్నాం. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడటం అక్కడి రైతులందరికీ బాగా అలవాటు. అవి లేకుండా పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించేవారు. అయినా వెనక్కి తగ్గ లేదు’ అన్నారు సునంద. 

మొదట వ్యవసాయం చాలా కష్టంగా అనిపించినా పట్టు వదలకుండా ముందుకు సాగారు. మొదట ఆకు కూరలు, కూరగాయలు సాగు చేశారు. వేసవిలో పెరట్లో గోంగూర మొక్కలకు పిండి నల్లి సోకినప్పుడు మట్టి ద్రావణం ఆశ్చర్యకరమైన ఫలితాలనిచ్చింది. దాంతో వ్యవసాయం అంతా పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్‌ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్‌) చెప్పిన విధంగా కేవలం మట్టి ద్రావణం పద్ధతిలోనే సాగు చేసి మంచి దిగుబడులు తీయొచ్చన్న నమ్మకం కుదిరింది. అదే పద్ధతి అనుసరిస్తున్నాం అని సునంద వివరించారు. 

పంట ఏదైనా కేవలం మట్టి ద్రావణమే
ఈ ఏడాది వానాకాలంలో 8 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా వరి, సోయాబీన్, కంది, సజ్జ, కొర్రలు, రాగి తదితర పంటలు ఎడ్ల గొర్రుతో విత్తారు. పంటలు ఏవైనా మట్టి ద్రావణమే ప్రతి 10 రోజులకోసారి పిచికారీ చేస్తుండటం విశేషం. 

200 లీటర్ల నీటిలో 30 లోపలి మట్టి (భూమిలో 2 అడుగుల లోతు నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టి), అర లీటరు అముదంను కలిపి ఈ ద్రావణాన్ని అన్ని పంటలకు 10 రోజులకోసారి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.

పంట పూత/పిందె దశలో 3 పిచికారీలకు మాత్రం ఈ ద్రావణానికి రాక్‌ డస్ట్‌ 5 కిలోలు కలిపి పిచికారీలు చేయాలి.

దీనితో పాటు.. 30 కిలోల లోపలి మట్టికి అర లీటరు ఆముదం కలిపి.. ఆ మట్టి మిశ్రమాన్ని పంట మొక్కల కింద 20 రోజులకు ఒకసారి ఎరువుగా వేయాలి. ఈ మట్టి మిశ్రమం వేసిన తర్వాత వారం వరకు జీవామృతం వంటి ద్రావణాలు వేయకూడదు. ఇంతే. పంటలన్నిటికీ ఇవే ఇస్తున్నామని సునంద, రవి వివరించారు.


సోయా.. ఎకరానికి 11 క్విం.  

సునంద, రవి వానాకాలంలో 3 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా సోయా విత్తారు. సాళ్ల మధ్య 1.5 అడుగులు పెట్టారు. కలుపు మందు చల్లకుండా నాగళ్లతో 2 సాళ్లు పైపాటు చేయించారు, ఓసారి కూలీలతో కలుపు తీయించారు. సీవీఆర్‌ మట్టి ద్రావణం మాత్రం పిచికారీ చేశారు. పూత, పిందె దశలో మినుము, పెసర, నవార వడ్లు, బొబ్బర్లను ఒక్కో రకం ఒక్కోసారి మొలకల ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేశామని సునంద వివరించారు. ఇంకేమీ వెయ్యలేదు. అయినా, సగటున ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించటం విశేషం. వత్తుగా విత్తుకొని రసాయనిక సేద్యం చేసిన వారికన్నా ఎక్కువ దిగుబడి సాధించడం సాగులో పూర్వానుభవం లేని తమకు ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని సునంద, రవి ఆనందిస్తున్నారు. 2 ఎకరాల్లో కంది విత్తారు. అంతర పంటలు వేశారు. 5 క్వింటాళ్ల కొర్రలు, 2 క్లింటాళ్ల సజ్జలు (సగానికిపైగా చిలకలు తినగా మిగిలినవి), 5 క్వింటాళ్ల కొర్రల దిగుబడి వచ్చింది. ఇవి కోసిన తర్వాత కుసుమ విత్తారు. 3 ఎకరాల్లో అధిక పోషకాలతో కూడిన ఇంద్రాణి, కుజూపటాలియా, కాలాబట్టి, నవార, మాపిళ్ళె సాంబ వంటి దేశీ వరి రకాలను సాగు చేసి 30 క్వింటాళ్ల దిగుబడి పొందటం విశేషం. ధైర్యంగా మట్టి ద్రావణంతో సేద్యం చేపట్టి నలుగురూ ఇదేమి సేద్యం అని తప్పుపడుతున్నా ముందుకు సాగి.. చివరకు గ్రామస్తులతో ఔరా అనిపించుకున్నారు రవి, సునంద వ్యవసాయంలోకి రాదలచిన యువతకు మార్గదర్శకులు.  
– కమ్రె నరేష్, సాక్షి, కౌటాల, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా


ఎన్ని ఇబ్బందులున్నా ఆనందంగా ఉంది

నేను ఇంటి వద్ద నుంచి ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య సునంద ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంటి పనులతో పాటు వ్యవసాయం చూసుకుంటున్నది. నేను విధుల్లో ఉన్న సమయంలో నా భార్య సునంద పొలం పనులు చూసుకుంటుంది. ఇద్దరం కలిసి ఇష్టపూర్వకంగా సహజ వ్యవసాయం చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఫలితాలను చూసి మాకెంతో ఆనందంగా ఉంది. సహజ పద్ధతిలో పండించిన పంటతో మంచి ఆరోగ్యం చేకూరుతుంది. యువ రైతులందరూ సహజ పద్ధతిలో పంటల సాగు చేపట్టాలి. అప్పుడే భూమి సారవంతం కావడంతో పాటు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు.
– మాదాని రవి, యువ రైతు, విజయనగరం, కౌటాల  మండలం, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా


సీవీఆర్‌ మట్టి సేద్య పద్ధతి చాలు!

వ్యవసాయం చేయడానికి శ్రద్ధతో పాటు చాలా ఒపిక ఉండాలి. అటు ఉద్యోగం.. ఇటు పిల్లల్ని చూసుకుంటూ సహజ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నాం. ఏసీలో ఉండే మీరు ఎందుకు వ్యసాయం చేస్తున్నారు? మందులు (రసాయనిక ఎరువులు, పురుగుమందులు) వాడకుండా పంటలు ఎలా పండుతాయని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ, ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేస్తున్నాం. పంట దిగుబడిని చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది. సీవీఆర్‌ మట్టి సేద్య పద్ధతి ఒక్కటి అనుసరిస్తే చాలని మా అనుభవంలో శాస్త్రీయంగా నేర్చుకున్నాం. సంతృప్తిగా ఉంది.  NSU Nandanam natural farms యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం. 
– సునంద (77995 44705), యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా  

మరిన్ని వార్తలు