Padmini Govind: అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి బెంగుళూరుకు వచ్చి..

20 Oct, 2021 10:15 IST|Sakshi

వారసత్వ బంధం... కళానుబంధం

పద్మిని గోవింద్, ఒక అందమైన బంధాన్ని ముందు తరాలకు తీసుకువెళ్తున్న చక్కటి అనుబంధానికి ప్రతీక. నలభై ఐదేళ్ల కిందట అమ్మ నాటిన మొక్క మహావృక్షంగా విస్తరించింది. అమ్మకు వయసైపోయింది. ఆ మహావృక్షానికి నీరు పోసేదెవ్వరు? ఆ మహావృక్షం నీడన చల్లగా బతుకుతున్న వాళ్లు ఏమవుతారు?

వాళ్లంతా కలిసి ప్రాణం పోసిన తరతరాల కళను ముందు తరాలకు తీసుకు వెళ్లేదెవ్వరు? ఇవన్నీ ఆలోచించిన పద్మిని అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి బెంగుళూరుకు వచ్చేసింది. అమ్మ నెలకొల్పిన పరిశ్రమను వారసత్వంగా అందిపుచ్చుకుంది. భారతీయ వారసత్వ కళకు కొండంత ఆసరాగా నిలుస్తోంది. అమ్మకు కళతో అల్లుకుపోయిన బంధానికి పందిరి వేస్తోంది.

నాటి ముందడుగు
అది 1960, లక్ష్మీ శ్రీవత్స తనకు ఇష్టమైన కళలను శాస్త్రబద్ధంగా అధ్యయనం చేయాలనుకుంది. ఢిల్లీలోని త్రివేణి కళాసంగమ్‌లో చేరి ఆర్ట్స్‌లో కోర్సు చేసింది. అక్కడ ఆమెకు కమలాదేవి చటోపాధ్యాయ ఆధ్వర్యంలో పని చేసే అవకాశం వచ్చింది. చదువు పూర్తయి తిరిగి బెంగళూరుకు వచ్చిన తర్వాత ఆమె తన కెరీర్‌ గురించి సుదీర్ఘంగా ఆలోచించింది. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కూడా మెండుగానే ఉండేవి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్న ఎన్నో ఉద్యోగాలు ఆమె ముందున్నాయి.

కానీ కమలాదేవి చటోపాధ్యాయ ప్రభావంపై చేయి సాధించింది. కళను పరిరక్షించడమే వృత్తిగా స్వీకరించాలని నిర్ణయించుకుంది. అద్భుతమైన నిర్మాణశైలిలో ఒదిగిపోయే డిజైన్‌లను బ్లాక్‌ ప్రింటింగ్‌ రూపంలో దుస్తుల మీదకు తీసుకురావడానికి సిద్ధమైంది. మొత్తానికి 1977లో బెంగుళూరులో తరంగిణి స్టూడియోని ప్రారంభించింది. అప్పటికి మహిళలకు కనిపించని పరిధులు పతాకస్థాయిలోనే రాజ్యమేలుతున్నాయి.

కాలేజీల్లో ఓ పదిమంది, ఉద్యోగాల్లో ఒకరిద్దరు తప్ప... సమస్త మహిళాలోకానికి ఇంటి నాలుగ్గోడలే ప్రపంచం. అలాంటప్పుడు వస్త్రప్రపంచంలో ఒక మహిళ పరిశ్రమ స్థాపించాలనుకోవడమే పెద్ద సాహసం. ఆ సాహసాన్ని చేసింది లక్ష్మీ శ్రీవత్స. ఆమె ఏ చిత్రలేఖనాన్ని చూసినా అందులో నుంచి బ్లాక్‌ ప్రింటింగ్‌కు అనుకూలించే ఒక కొత్త డిజైన్‌ను గుర్తించేది. ఏ నిర్మాణాన్ని చూసినా అంగుళం అంగుళం నిశితంగా పరిశీలించేది. ఒక్కొక్క డిజైన్‌కు తన సృజనాత్మకత జోడించి బ్లాక్స్‌ తయారు చేయించింది. అలా రూపొందించిన బ్లాక్‌లు వేలల్లో పద్మినికి వారసత్వపు మూలధనంగా అందించింది లక్ష్మీ శ్రీవత్స.

అమ్మ కళ్లలో వెలుగు
పద్మిని కంప్యూటర్‌ సైన్స్‌ చదివి యూఎస్‌ వెళ్లింది. ఉద్యోగం, వివాహం, పిల్లలు... యూఎస్‌లో కొనసాగుతున్న సమయంలో తల్లి ఆరోగ్యం క్షీణించడంతో పద్మిని  2007లో ఇండియాకి వచ్చేసింది. మరో నాలుగేళ్లకు లక్ష్మీ శ్రీవత్స కాలం చేసింది. ఆ సంగతులను గుర్తు చేసుకుంటూ ‘‘అమ్మ తాను ప్రారంభించిన స్టూడియో మీద ప్రాణాలు పెట్టుకుంది. బెంగళూరులో తొలి బ్లాక్‌ ప్రింటింగ్‌ స్టూడియో ఇది. ఆమె కళ్ల ముందే ఇలాంటి యూనిట్‌లు లెక్కకు మించి వచ్చాయి. ఆమె చూస్తుండగానే మిగిలిన యూనిట్‌లు ఒక్కటొక్కటిగా మూతపడ్డాయి.

ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఆమె తన స్టూడియోను వదల్లేదు. ఆ స్టూడియో మీద ఆధారపడిన జీవితాలకు మరో ఆసరా కావాలి కదా అనేది. అలాంటి అమ్మ... తన ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ‘ఈ బరువును మీరు మొయ్యలేరు. మెల్లగా వదిలేయండి’ అని చెప్పింది. అయితే... ఆ మాట ఆమె మనస్ఫూర్తిగా అనడం లేదని ఆమె గొంతు చెప్పింది. నేను ఈ బాధ్యతను కొనసాగిస్తాను’’ అని మాటిచ్చాను. అప్పుడు ఆమె కళ్లలో మెరుపులాంటి సంతోషాన్ని చూశాను’’ అని చెప్పింది పద్మిని.

కష్టకాలాన్ని గట్టెక్కాం
‘‘తరంగిణి స్టూడియోలో పని చేసే ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్లే వారాంతపు సెలవులుంటాయి. స్టూడియోలో పని చేసే వాళ్లను మా అమ్మ ఎప్పుడూ తన కింద ఉద్యోగులుగా చూడలేదు. అందరూ కలిసి చేసే పనికి తానొక ఫెసిలిటేటర్‌ని అనేది. మెడికల్‌ ఇన్సూరెన్స్, ఇంక్రిమెంట్‌తోపాటు సంవత్సరం చివరిలో లెక్క చూసుకుని మిగులును బోనస్‌గా అందరికీ పంచేది. భగవంతుడి దయ వల్ల కరోనా క్లిష్టపరిస్థితుల్లో కూడా మా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించగలిగాం’’ అని వివరించింది 45 ఏళ్ల తరంగిణి స్టూడియోకి ఈ తరం నిర్వహకురాలు పద్మినీ గోవింద్‌. 

చదవండి: Nalini Jameela: అందుకే ‘పడుపు వృత్తి’లోకి.. కానీ ఇప్పుడు ఆమె..                                         
 

మరిన్ని వార్తలు