Lotus: నీటి తొట్లలో తామరల పెంపకం.. ధర 300 నుంచి 4 వేల వరకు! నెలకు 50 వేల దాకా

21 Nov, 2022 12:30 IST|Sakshi
అంజలి (Photo Credit: Mathrubhumi)

కొలనుల్లో తామరలు సూర్య నమస్కారాలు చేస్తాయి. దొరువుల్లో కలువలు చంద్రునికి మోహలేఖలు రాస్తాయి. కాని అవి పాత రోజులు. ఇప్పుడు ఇళ్లల్లో అలంకరణ కోసం తామరలు కొని  నీటి తొట్లలో వదులుతున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి?

కేరళలో అంజలి లాంటి స్త్రీలు కుండీల్లో, ప్లాస్టిక్‌ తొట్లలో తామరలను పెంచి అమ్ముతున్నారు. దాదాపు 40 రకాల తామరలు ఉన్నాయి. 300 నుంచి ఒక్కో పువ్వు 4000 రూపాయల వరకూ పలుకుతాయి. నెలకు 30 నుంచి 50 వేలు సంపాదిస్తూ ఉంది అంజలి.

కోవిడ్‌ వల్ల ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా అది అంజలికి తామరలు కూడా పూయించింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 28 ఏళ్ల అంజలిని చూడండి. కోవిడ్‌ కాలంలో భర్తకు సంపాదన పోవడంతో తామరలను నమ్ముకుంది. ముందు మిద్దె మీద పెంచింది.

ఆదాయం బాగుండటంతో ఇప్పుడు 20 సెంట్ల భూమి సంపాదించి అక్కడ తామరలు పెంచుతోంది. అన్నీ కుండీల్లోనే. లేకుంటే ప్లాస్టిక్‌ టబ్బుల్లో. దీనిని ‘నీటి తోట’ అనొచ్చు. నీటి మొక్క తామర. దీనితో పాటు కలువ. అంజలి జీవితం ఇప్పుడు మూడు కలువలు ఆరు తామరలుగా సాగిపోతోంది.

వేసిన 15 రోజులకే పూస్తుంది
‘ముందు నాటు రకం తామరలు పెంచాను. అవి ఏడాదికి కాని పూలు పూయవు. ఇలా కాదని హైబ్రిడ్‌ తామరలను పెంచడం నేర్చాను. కొన్ని హైబ్రిడ్‌ తామర మొక్కలు నెలకే పూస్తాయి. వీటిని థాయ్‌లాండ్‌ వాళ్లు డెవలప్‌ చేశారు. అమిరి కెమిలియా అనే తామర రకం ఉంది. అదైతే వేసిన 15 రోజులకే పూస్తుంది. ఇప్పుడు నా తామర సాగులో దాదాపు 40 రకాలు ఉన్నాయి’ అంటుంది అంజలి.

ఆమెకు పూలు పూయించడంతో పాటు ప్రచారం చేయడం కూడా వచ్చు. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో ఆ తామర మొక్కలు, పూలు ఫోటోలు పెడుతుంది. మొదట కేరళ నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇప్పుడు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి.

‘తామరలు దుంపవేరు నుంచి వస్తాయి. దుంపవేర్లు కొనేవాళ్లు ఉంటారు. కాని వాటిని పెంచడం తెలియాలి. కొందరు నేరుగా మొక్కలు కొంటారు. అవి కొన్న తర్వాత పది రోజులకు మించి బతకవు. అందుకని వెంటనే వాడుకోవాల్సి ఉంటుంది. కొందరు ఒట్టి పూలే కొంటారు’ అంటుంది అంజలి.

రూ. 4000 పెడతారు కూడా!
నాటు తామరలకు రెక్కలు తక్కువ ఉంటాయి. హైబ్రిడ్‌ తామరలకు రెక్కలు ఎక్కువ. ‘మిరకిల్‌’ అనే వెరైటీలో పువ్వుకు 700 రెక్కలు ఉంటాయి. ఇక సహస్రదళపద్మానికి డిమాండ్‌ జాస్తి. దీనిలో వేయి రెక్కలు ఉంటాయి. ‘బుద్ధ పద్మం’, ‘దుర్గపద్మం’ అని చాలా రకాలే ఉన్నాయి. ‘పసుపు రంగు తామరలకు బాగా గిరాకీ ఉంది. ఒక్కో మొక్కకు రూ. 4000 పెట్టడానికి కూడా సిద్ధమవుతారు’ అంటుంది అంజలి.

నెలకు యాభైవేల వరకు సంపాదన
ఆమె దగ్గర పూలు, దుంపవేర్లు, మొక్కలు రకాన్ని బట్టి 300 నుంచి మొదలవుతాయి. నెలకు అన్ని రకాలూ 100 పూల వరకూ అమ్ముతుంది. అన్నీ కుదిరితే 50 వేలు కూడా సంపాదిస్తుంది. వీటితోపాటు కలువలు కూడా సాగు చేస్తుంది. వాటి మీద ఆదాయం కూడా బాగుంది.

‘మొక్కలను జాగ్రత్తగా చూడాలి. తామరకు బాగా ఎండ తగలాలి. నీటి కుండీల్లో దోమలు చేరకుండా గుప్పీ చేపలను వదిలితే మంచిది’ అంటుంది అంజలి. తన దగ్గర మొక్కలు కొన్నవారికి వాటిని ఎలా సంరక్షించాలో చెబుతుంది. 

ఇప్పుడు శ్రీమంతులే కాదు మధ్యతరగతి వారు కూడా ఇంటి ముంగిలిలో ఒక తామరతావును లేదా పూలను అలంకరించడానికి ఇష్టపడుతున్నారు. ఈ సాగు నేర్చితే మహిళలు ఇంటి దగ్గరి నుంచే ఆదాయం గడించవచ్చు.

చదవండి: Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే
Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా..

మరిన్ని వార్తలు