Komera Ankarao: అతడు అడవిని రక్షించాడు! 

11 Dec, 2022 19:15 IST|Sakshi

ఉషోదయం వేళ ఊరు దాటి భుజాన బాధ్యతతో సాగే గమనంలో.. చెట్టూ చేమను పలకరిస్తూ.. పలచటి దారుల్లో.. దట్టమైన దూరాల్లో.. కొండల్లో.. కోనల్లో.. నల్లమలను నలుదిక్కులా చుట్టేస్తూ.. అడవి నుంచి ప్లాస్టిక్‌ను ఊడ్చేస్తూ.. మూగ జీవాల ప్రాణాలను రక్షిస్తూ.. పాతికేళ్లుగా విశ్రమించని దినచర్యతో.. అతడు అడవిని రక్షించాడు.. రక్షిస్తూనే ఉన్నాడు! 

ఆంధ్రప్రదేశ్‌.. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన కొమెర అంకారావు ఉరఫ్‌ జాజి నల్లమలలో అపరిశుభ్రతపై వేట సాగిస్తున్నారు. పార్టీల పేరుతో అటవీ ప్రాంతంలో యువత ఎంజాయ్‌ చేసి పడేసిన మందు సీసాలు, ప్లాస్టిక్‌ గ్లాసులు, పాలిథిన్‌ కవర్లను శుభ్రం చేయడమే దిన చర్యగా మార్చుకున్నారు.

రోజూ తెల్లవారగానే  మోపెడ్‌పై ఊరికి ఐదు కిలో మీటర్ల దూరంలోని రిజర్వ్‌ ఫారెస్టుకు వెళ్లి ఆయన చేసే పని ఇదే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పాతికేళ్లుగా భుజాన గోనె సంచితో అడవి బాటపట్టి.. వేల కిలోల చెత్తను తొలగించారు. వారంలో ఆరు రోజులు అటవీ రక్షణకే కేటాయిస్తూ.. ఒక్కరోజు మాత్రమే తన కోసం పని చేసుకుంటూ పర్యావరణ శ్రామికుడిగా.. పరిరక్షకుడిగా గుర్తింపు పొందారు.

తాను సేకరించిన వ్యర్థాలను.. బయట చెత్త ఏరుకుంటూ జీవనం గడిపేవారికి అందిస్తూ సహాయం చేస్తున్నారు. జాజికి ఇప్పుడు 40 ఏళ్లు. ఆయన పదో తరగతి చదువుతున్నప్పుడే (14 ఏళ్లకే) పర్యావరణంపై అమితమైన మక్కువ పెంచుకున్నారు. ఊరికి సమీపంలోనే అడవి ఉండటంతో చిన్న వయసులో సరదాగా రకరకాల మొక్కల విత్తనాలు తీసుకెళ్లి చల్లేవారు.

ఇదే ఆయన జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఒక్కోసారి దట్టమైన అడవిలో 10 కిలో మీటర్లకుపైగా జాజి ప్రయాణం సాగుతుంది. ఆ క్రమంలో ఎన్నో కొత్తకొత్త ప్రాంతాలు, మొక్కలను కొనుగొనడం ఆయనకు పరిపాటిగా మారింది. వీటన్నింటితో ‘ప్రకృతి పాఠశాల’ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని కూడా రచించారు.

అడవిని పెంచుతూ..
తొలకరి వస్తే చాలు జాజి అడవిలో ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లి రకరకాల విత్తనాలు చల్లుతారు. అవి వర్షాలకు మొలకెత్తుతాయి. అలా ఆయన అటవీ వృక్ష సంపద పెరుగుదలకు కృషి చేస్తున్నారు. ఆగస్టు–డిసెంబర్‌లో సొంత డబ్బులతో అనేక రకాల పండ్ల మొక్కలు తీసుకొచ్చి అడవిలో నాటుతున్నారు. అంతటితో వదిలేయకుండా కుంటల నుంచి నీటిని తెచ్చి మొక్కలకు పోసి వాటిని బతికిస్తున్నారు.

ఇందు కోసం ఆయన స్కూటీ డిక్కీలో తెల్లగోతం, వాటర్‌ క్యాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ‘అటవీ జంతువులు, పక్షులకు ఆహార కొరత ఏర్పడింది. ఎన్నోరకాల పండ్ల మొక్కలు అడవి నుంచి అదృశ్యమయ్యాయి. ఫలితంగా వాటి ద్వారా జీవం పోసుకునే ఇతర మొక్కల ఆవిర్భావం తగ్గిపోయింది. అడవి పందులు, ఎలుగుబంట్లు పండ్లను ఆహారంగా తీసుకున్న తర్వాత వాటి మల విసర్జన ద్వారా అందులోని విత్తనాలు మొలకెత్తి సహజసిద్ధంగా అడవి పెరిగేది.

నేడు ఆ పరిస్థితి లేదు. ప్లాస్టిక్‌ను తినడంతో వన్యప్రాణులు మృత్యు వాత పడుతున్నాయి. ఒక్క అడవి పంది పదివేలకు పైగా మొక్కలు పెరగడానికి కారణం అవుతుంది. అటువంటి జంతుజాతులను మనం రక్షించు కోవాలి. పక్షులైతే అడవిలో పగిలిపోయిన మందు సీసాల్లోని లిక్కర్‌ కలసిన నీటిని తాగి చనిపోతు వడటం నన్ను తీవ్రంగా కలిచివేసింద’ని బాధ పడుతున్నారు జాజి. 

పక్షుల కోసం పంట సాగు..
పక్షుల మీద ప్రేమతో వాటి ఆహారం కోసం చిరుధాన్యాలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు జాజి. తనకున్న 80 సెంట్ల పొలంలో పక్షుల మేతకోసం సజ్జ, జొన్న పంటలు వేసి స్వయంగా సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. తన పొలాన్ని పక్షుల స్థావరంగా మార్చేశారు.

ఔషధమూలికలపై పట్టు
జాజికి అడవిలోని ప్రతి మొక్క, ప్రతి ఆకు.. వాటి ఔషధ గుణాలు గురించి బాగా తెలుసు. ఆయుర్వేద పరిశోధకులు సైతం తమకు కావాల్సిన మొక్కలను జాజికి చెప్పి తెప్పించుకుంటున్నారు. మానవాళికి  ఉపయోగపడే అరుదైన మూలికలు.. ఉదాహరణకు మగలింగ చెక్క చెట్టు, కొండరేగు, పాలబెర్రంగి వంటివి కనుమరుగవుతున్నాయి.

ఇవి అంతరించిపోతే ఎన్నో వ్యాధులను నయం చేసే ఔషధాలను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అలాంటి అరుదైన మొక్కలను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు.  

ఎందరికో స్ఫూర్తి
జాజిది మధ్య తరగతి కుటుంబం. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. డిగ్రీ చదువుకున్న తర్వాత డిస్టెన్స్‌ ద్వారా రెండు పీజీలు చేశారు. అడవిలో ఆయన చేస్తున్న పనిని చూసి మొదట్లో చాలా మంది ప్లాస్టిక్‌ ఏరుకునే వ్యక్తిగా భ్రమించి.. తాగి పడేసిన సీసాలు పలానా చోట ఉన్నాయని చెప్పి ఏరుకోమని సలహాలిచ్చేవారు. చివరికి జాజి ప్రయత్నం తెలుసుకుని ఆ ప్రాంతంలోని ఎందరో తమ పద్ధతిని మార్చుకున్నారు.

జాజి స్థానిక పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు బోధిస్తూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి సేవలకుగాను మద్రాసు ప్రైవేటు వర్సిటీ జాజికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. సుచిరిండియా సంకల్పతార అవార్డు వరించింది. అలాగే ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన టాల్‌ రేడియో సంస్థ తాళ్‌ హీరో అవార్డుకు జాజిని ఎంపిక చేయడం విశేషం.

అడవి తల్లి చల్లగా ఉంటే సమస్త జీవజాలానికి మనుగడ ఉంటుందని బలంగా విశ్వసిస్తున్న జాజి.. తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వచ్చే కొద్ది పాటి ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తుండటం గమనార్హం. అయితే ఇటీవల అటవీ శాఖ అధికారులు ఫారెస్టు గైడ్‌గా అవకాశం ఇస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరు జిల్లాల్లో విస్తరించిన నల్లమల అభయారణ్యాన్ని పరిరక్షించడమే తన లక్ష్యమని జాజి చెబుతున్నారు.
-∙వరదా కృష్ణకిరణ్‌, ఫొటోలు: దేవిశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి 

చదవండి: Sai Bharadwaja Reddy: మార్కాపురం కుర్రాడు.. ఈ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మిస్టర్‌ ఇండియా విజేత.. ఇప్పుడేమో ఏకంగా
Woolen Art: ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు

మరిన్ని వార్తలు