మండోదరి రావణాసురుడికి ఏం చెప్పిందో తెలుసా​?

29 Mar, 2021 06:34 IST|Sakshi

పంచకన్యలు 

పంచకన్యలలో నాల్గవ ఆమె మండోదరి. చిత్రం ఏమిటంటే రామాయణ కథానాయికగా సీత పంచకన్యలలో ఒకరిగా ఏ విధంగా స్థానం సంపాదించుకుందో, ప్రతినాయకుడైన రావణాసురుడి ఇల్లాలైన మండోదరి కూడా పంచకన్యలలో ఒకరిగా ప్రఖ్యాతి పొందడం. ఇంతకీ మండోదరికి ఎందుకని అంత ప్రాముఖ్యత కలిగిందో చూద్దాం. మయాసురుడనే రాక్షసుడు మహాశిల్పి. మహా మహా నగరాలను సైతం ఎంతో గొప్ప నిర్మాణ చాతుర్యంతో అద్భుతంగా నిర్మించగలడు. అందుకే అతడికి మయబ్రహ్మ అని పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి. సుగుణవతి. సౌశీల్యవతి. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రావణుడు అక్కడ మండోదరిని చూసి మొదటి చూపులోనే మనసు పడతాడు. ఆమెను తనకు ఇచ్చి పెళ్లి చేయమని మయుణ్ణి అడుగుతాడు. మయుడు ఒప్పుకోకపోవడంతో నయానా భయానా ఆ దంపతులను ఒప్పించి, నొప్పించి మరీ ఆమెను వివాహం చేసుకుంటాడు రావణుడు.

సహృదయం, ఔన్నత్యం, నేర్పు గల ఉత్తమ ఇల్లాలు మండోదరి. ఉత్తమ సౌశీల్య సంపద గలది. అయితే దురదృష్టవశాత్తూ ఏరి కోరి చేసుకున్న ఆమెను పెళ్లాడిన రావణుడు ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోకపోగా, కొద్దికాలానికే తిరిగి పరకాంతల పొందుకోసం వెంపర్లాడుతుంటాడు. భర్తలోని బుద్ధిలోపాలన్నీ ఒకటొకటిగా తెలిసి కుమిలి కుమిలి ఏడ్చింది మండోదరి. ఇంద్రజిత్తు వంటి వీరునకు తల్లియై కొంత ఊరట చెందుతుంది. కన్నతల్లిగా తన బిడ్డకు సుశిక్షణనిచ్చి ప్రథమోపాధ్యాయిని అయింది. ఎంత గొప్ప శివభక్తుడయినా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడయినా, పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం వల్ల తన పతికి ఎప్పటికయినా ముప్పేనని గ్రహిస్తుంది. అయినా చేసేదేం లేక అతని చేష్టలన్నింటినీ మౌనంగా సహిస్తుంది, సహనంతో భరిస్తుంది. ఎన్ని పనులున్నప్పటికీ, శివపూజను ఎంతో శ్రద్ధగా, భక్తిగా చేసే భర్తకు అన్ని విధాలా సహకరిస్తుంటుంది. తాను కూడా శివుణ్ణి ఆరాధించడం ఆరంభిస్తుంది. ఈ క్రమంలోనే తానూ శివపార్వతులకు ప్రియభక్తురాలిగా మారిపోతుంది. 

తన భర్త రావణుడు లంకానగరానికి అధిపతి అయినప్పటికీ, అనవసరంగా అందరి మీదా కయ్యానికి కాలు దువ్వడం, నచ్చిన కన్యను లేదా మెచ్చిన పరస్త్రీని అపహరించి తీసుకురావడం తప్పు కనుక, భార్యగా తాను భర్తకు హితం చెప్పడం ధర్మం కనుక, పరస్త్రీల జోలికి వెళ్లకూడదని మాత్రం పతికి చెవినిల్లు కట్టుకుని మరీ పదే పదే చెప్పేది. రావణుడు ఆమె మాటలను ఏమాత్రం లెక్కపెట్టక తాను చేసే పనులు తాను చేసేవాడు. భర్త అనేక తప్పిదాలు చేసేవాడు, చెడు ధోరణులను అనుసరించే వ్యక్తి అయినా, భార్యగా వాటన్నింటినీ ఖండించే వ్యక్తిత్వం ఉన్న ఉన్నత స్త్రీగా, ఉత్తమ ఇల్లాలిగా, పతివ్రతామతల్లిగా మండోదరి ప్రసిద్ధి పొందుతుంది. 

రావణుడు సీతను అపహరించుకుని తెచ్చి ఆమెను అశోకవనంలో బంధించినప్పుడు మండోదరి భర్తను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెను వెంటనే రాముడి దగ్గరకు పంపించమని ప్రాధేయపడింది. ‘రావణా! సీత నీ పాలిట కాళరాత్రి అని తెలుసుకో’ అని భర్తను హెచ్చరించినది. రాముడు ఏదో ఒకరోజు లంకను నాశనం చేస్తాడని ఆమెకు తెలుసు. రాముడికి సీతను శాంతియుతంగా తిరిగి ఒప్పగించాలని మండోదరి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 

మొట్టమొదటసారిగా మండోదరి మనకు సుందరకాండలో పరిచయం అవుతుంది. రామాజ్ఞావర్తనుడైన హనుమ సీతాన్వేషణ సాగించాడు. లంకను చేరిన హనుమ సీతకై అంతఃపురాన్ని పట్టణ మారుమూల ప్రాంతాలన్నీ గాలించడం ప్రారంభించాడు. ఆ సందర్భంలో అంతఃపురాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఓ  సుందరమూర్తిని చూసి సీతగా భావిస్తాడు. తర్వాత పునఃపరిశీలించుకుని నా తల్లి సీతమ్మగాదు ఈమె రావణుని యిల్లాలు మండోదరి అయి వుంటుందని, తన భావన తప్పని నిర్ధారించుకుంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, అచ్చు సీతమ్మ వంటి అందగత్తె అయిన రావణుని భార్య మండోదరి అని తెలియచెప్పడమే కావచ్చు. ఇద్దరికి అందంలో అంత అభేదకత్వం ఉన్నదన్నమాట. 

రాముడు రావణుడి లంకపై యుద్ధం ప్రకటించాడు. రాముడితో యుద్ధం జరగబోయే ముందురోజు, మండోదరి రావణాసురుడితో తన ఆలోచనను మానుకోమంటూ తన వంతుగా చివరిసారిగా హితబోధ చేసింది. కాని ఆ ప్రయత్నమూ విఫలమయ్యింది. రాముని పరాక్రమానికి చకితుడై, ఒకరొకరుగా దూరం అవుతున్న తన పుత్ర, మిత్ర, పరివారాన్ని చూసుకుని కుమిలిపోతూ సమరాంగణం నుంచి వచ్చిన పతిని చూసి ఊరడిస్తూ, అతని శౌర్య ప్రతాపాలన్నింటిని వివరించింది. అతడికి గల అపారమైన చతురంగ బలాన్ని గురించి గుర్తు చేసింది. పూర్వం యుద్ధరంగంలో తన భర్త ఆర్జించుకున్న విజయాలన్నింటి గురించీ ఏకరువు పెట్టింది. శత్రుభంజనం చేయవలసిన నీవు ఇప్పుడు బేలగా మారడం తప్పంటూ అతని కర్తవ్యాన్ని గుర్తుచేసింది. అయినప్పటికీ రాముడు నాటుకున్న బాణం హృదయంలో నాటుకోవడంతో తన భర్త కాటుక కొండలా కుప్పకూలాడని తెలిసిన

మండోదరి పరుగు పరుగున వెళ్లి యుద్ధ ప్రాంగణాన్ని సందర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉండడం ఆమెను కలచి వేసింది. అప్పుడు రాముడిని చూసి ఆమె.. రాముడు విష్ణువు అవతారమని గ్రహించింది. స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలనూ స్వయంగా చూసి తెలుసుకుంది. రాముడికి నిండు మనస్సుతో నమస్కరించింది.

ఆయన మన్ననలు అందుకుంది. అభిమానానికి పాత్రురాలయింది. తన పతి శరీరానికి అంతిమ సంస్కారాలు చేసుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడామె మాటను మన్నించాడు. విభీషణుని పిలిచి, రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. అంతేకాదు, మహా పతివ్రత అయిన మండోదరి పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం ఇస్తాడు.
ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూచోకూడదు. చేతనైనంతలో ఆ చెడు లక్షణాలనుంచి భర్తను పక్కకు మళ్లించి, సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. భర్త చేసే మంచి పనులకు సంపూర్ణ సహకారం అందించాలి. భర్తలోని చెడుని నివారించేందుకు తనవంతు కృషి చేయాలి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు