ఊపిరితిత్తులను ఇలా కాపాడుకుందా..!

17 Dec, 2020 08:20 IST|Sakshi

ఊపిరితిత్తులు ఎప్పుడూ శ్వాసిస్తూ ఉంటాయి.  కాబట్టి బయటి నుంచి కాలుష్యాలూ కరోనా వైరస్సులూ కలగలిసి దెబ్బతీసే అవకాశాలు ఎక్కువే. అయితే వాటి రక్షణ కోసం ఏర్పటైన వ్యవస్థ మన దేహంలోనే ఉంటుంది.
ముక్కునుంచే మొదలయ్యే రక్షణ... 
శ్వాసం కోసం తీసుకునే గాలి ప్రవేశించే ప్రవేశద్వారమైన ముక్కు నుంచి రక్షణ వ్యవస్థ మొదలైపోతుంది. ముక్కులో ఉండే వెంట్రుకలు పెద్ద కాలుష్యపు కణాలను (పార్టికల్స్‌ను) చాలావరకు అక్కడే కట్టడి చేస్తాయి. దానికి తోడు ముక్కు ఓ ఎయిర్‌కండిషనర్‌లా కూడా పనిచేస్తూ ఊపిరితిత్తులకు రక్షణ కలిగిస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బయటి గాలిని ముక్కు ఒకింత చల్లబరిచాకే ఊపిరితిత్తుల్లోకి వెళ్లేలా జాగ్రత్త తీసుకుంటుంది. అలాగే వాతావరణం బాగా చల్లబడే ఈ సీజన్‌లో ఆ చలిగాలి ప్రవేశించకుండా, దాంతో ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలు బాగా సంకోచించుకుని పోకుండా అదే ముక్కు జాగ్రత్తపడుతుంది. ఈ సీజన్‌లో చలిగాలిని కాసింత వేడిగా మారాకే ముక్కు గాలిని లోనికి పంపుతుంది. ఇలా మన ముక్కు ఊపిరితిత్తులకు దాదాపుగా ఒకేలాంటి ఉష్ణోగ్రత ఉన్న గాలిని అందజేస్తుంది. 

నిర్మాణమే అద్భుతం... 
ముక్కు చివరన ఉండే వాయునాళం (ట్రాకియా) మొదటి అంతస్తు అనుకుంటే ఊపిరితిత్తుల చివరి అంచెలో ఉండే ఆల్వియోలస్‌ అనే గాలిగదిది చివరి అంతస్తు. ఇలా మన శ్వాస వ్యవస్థలో 28 అంతస్తులుంటాయి. లంగ్స్‌కు ప్రతిరోజూ 16 వేల లీటర్ల గాలి అందుతున్నప్పుడు... కేవలం ఒక కిలో కంటే కాస్తంత ఎక్కువ బరువు ఉండే ఊపిరితిత్తుల్లో ఇంత పెద్దమొత్తంలో ఎక్స్‌ఛేంజ్‌ ఆఫ్‌ ఎయిర్‌ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. చివరి అంతస్తు అయిన ఆల్వియోలైలో అతి సన్నగా చీలిన రక్తనాళాలుంటాయి. ఆల్వియోలైకు చేరినప్పుడు ద్రవంలా ఉండే రక్తం... ఒక పల్చని పేపర్‌షీట్‌లా మారి అలా నిలబడిపోతుంది. అప్పుడు ఆ 28వ అంతస్తులో బయటి ఆక్సిజన్‌ దేహానికి అంది, శరీరంలోని కార్బన్‌డైఆక్సైడ్‌ బయటకు వెళ్తుంది. ఇలా వెళ్లే క్రమంలో ఊపిరితిత్తులను బయటి కాలుష్యాల నుంచి రక్షించడానికి సన్నటి సీనియా అనే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. అవన్నీ వెలుగుతున్న కొవ్వొతి మంట చివరిభాగంలా, ఒక్కోసారి కొరడా ఝుళిపించినట్లుగా కదులుతూ గాలిలోని పొగ, కాలుష్యాలను బయటకు పంపిస్తుంటాయి. 

సాధారణంగా మన శరీరంలో రోజు 15–20 మి.లీ. మ్యూకస్‌ తయారవుతూ ఉంటుంది. అలాగే కాలుష్య పదార్థాలను బయటకు నెట్టివేసే సీలియా సక్రమంగా పనిచేయడానికి వీటి చుట్టూ పలచని మ్యూకస్‌ ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. అందుకే మన ముక్కు ఉపరితలం వద్ద ఉంటే మ్యూకస్‌ ఎప్పుడూ ఎండిపోతూ, గాలికి రాలిపోతూ ఉంటుంది. ఇలా మ్యూకస్‌తో కలిపి కాలుష్యాలను బయటకు నెట్టేసే చర్య కారణంగా ఊపిరితిత్తుల్లో ఉన్న సీలియరీ వ్యవస్థల నిర్మాణాన్ని మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్‌ అని కూడా అంటుంటారు. ఇలా అవి శరీరంలోకి వచ్చే పదార్థాలను (ఫారిన్‌ బాడీ) బయటకు పంపిస్తూ ఉంటాయి.  ఇన్ఫెక్షన్స్‌నుంచి మనల్ని కాపాడతాయి. 

చలికాలంలో మరింత జాగ్రత్త అవసరం... 
ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ బాగా తక్కువగా ఉంటుంది. ఉదయం వేళ మినహా గాలి పొడిగా ఉంటుంది. (అందుకే ఈ సీజన్‌లో ఒంట్లో ఉన్న తేమను వాతావరణం బయటకు లాగేస్తూ ఉన్నందుకే ఒళ్లు, చర్మం, పెదవులు పగిలినట్లుగా అయిపోతాయి. దాన్ని అరికట్టేందుకే మనం వాజిలెన్‌ వంటివి రాస్తూ ఒంట్లోని తేమను బయటకు పోకుండా రక్షించుకుంటూ ఉంటాం). గాలిలో తేమ తక్కువగా ఉండి, గాలి పొడిగా ఉండటంతో దాని ప్రభావం సీలియరీ వ్యవస్థ మీద కూడా పడి అది దెబ్బతినే అవకాశం ఎక్కువ. ఈ పొడిదనం కారణంగా మ్యూకస్‌ ఎండిపోయి చిక్కగా మారి కాలుష్యాలను బయటికి నెట్టడం కూడా కష్టమవుతుంది. పొగతాగే అలవాటుతోనూ, కొన్నిసార్లు కొన్ని రకాల మందులు వాడటం ద్వారా (ఉదాహరణకు ఎట్రోపిన్‌ వంటివి), మద్యపానంతో కూడా మన ఊపిరితిత్తుల సొంత రక్షణ వ్యవస్థకు చేటు తెచ్చిపెట్టుకుంటున్నామని గ్రహించి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.

రక్షణ కోసం ఏం చేయాలి? 
మనం ఈ కరోనా సీజన్‌లో వాడే మాస్క్‌ చలిగాలిని నేరుగా ముక్కుల్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా చాలావరకు కాపాడుతుంది. అలాగే కాలుష్యాలనూ అరికట్టగలుగుతుంది. కాబట్టి ఇటు కరోనా నివారణతో పాటు ఊపిరితిత్తుల రక్షణకూ మాస్క్‌ ఉపయోగపడుతుందని గ్రహించి... తప్పక వాడాలి. 

సీలియా బాగా పనిచేయడానికి గాలిలో తేమ పెంచాలి. ఇందుకోసం తరచూ ఆవిరి పట్టడం వంటి జాగ్రత్తలు చేపడితే అది తేమను పెంచడంతో పాటు ఈ సీజన్‌లో శ్వాసనాళాలు కుచించుకుపోకుండా చూస్తూ... ఊపిరితిత్తులకు గాలి ధారాళంగా అందేందుకూ దోహదపడుతుంది. 

పెదవులతో పాటు గాలి ప్రవేశ ద్వారమైన ముక్కు చివరల వద్ద ఉండే చర్మం కూడా ఈ సీజన్‌లో పగిలే అవకాశం ఉన్నందున, అక్కడి చర్మం సెన్సిటివ్‌గా మారకుండా అక్కడ కూడా వాజిలెన్‌ రాయడం మంచిది. 

పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లను వెంటనే మానేయాలి. 

మరిన్ని వార్తలు