Parenting Tips: పిల్లలందరూ బాగా రాయాలనే అనుకుంటారు! కానీ ఒక్కోసారి! ఇలా చెప్పారంటే మాత్రం..

27 Sep, 2022 11:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మార్కులు ఎన్ని వచ్చాయి?

How To Deal With Children When Scoring Low Marks: దసరా సెలవులు వచ్చేశాయి. పిల్లలు క్వార్టర్లీ ఎగ్జామ్స్‌ రాశారు.. కొందరు రాస్తున్నారు. అందరూ మార్కులు ఎన్నొచ్చాయో ఇంట్లో చెబుతారు. ఎక్కువ రావచ్చు.. తక్కువ రావచ్చు. పిల్లలతో ఎలా మాట్లాడాలి? మరో ఆరు నెలల కాలంలో వారు చదువులో ఎదగడానికి ఇప్పుడు మాట్లాడేదే ముఖ్యం.వారిని నొప్పించవద్దు. మరింత బాగా చదివేలా ఒప్పిద్దాం.

వాటి గురించి పిల్లలు హుషారుగా ఎదురు చూసే ముందు పరీక్షలు వస్తాయని వారికి తెలుసు. అవి రాయాలి. మార్కులు తెచ్చుకోవాలి. తల్లిదండ్రుల, టీచర్ల మెప్పు పొందాలి. ఆ తర్వాత సెలవుల్ని ఎంజాయ్‌ చేయాలి.

తల్లిదండ్రులు కూడా పరీక్షలు బాగా రాయి... సెలవుల్లో ఫలానా చోటుకు తీసుకెళతాము అని చెబుతుంటారు. బాగా రాయడం అంటే బాగా రాయాలనే పిల్లలందరూ అనుకుంటారు. కాని సబ్జెక్ట్‌లన్నీ ఒకటి కాదు. పిల్లలందరూ ఒకటి కాదు. అన్ని సబ్జెక్టుల్లో అందరు పిల్లలూ ఒక్కలా తెలివి ప్రదర్శించలేరు.

తెలివైన పిల్లలు కూడా ఇష్టపడని, సరిగా రాయని సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఇవాళ్టి పరీక్షలకు గత రెండు మూడు వారాల్లో ఏవైనా ఇంట్లో అవాంతరాలు, పిల్లలకు అనారోగ్యాలు వస్తే వాటి ప్రభావం ఉంటుంది. పరీక్షల సమయంలో తెలిసిన ప్రశ్నకు జవాబు తెలిసినా సరిగ్గా రాయకపోవడం ఉంటుంది. పరీక్షలు అయ్యాక పిల్లలు తెచ్చే జవాబు పత్రాలు, వాటిలో కనిపించే మార్కుల వెనుక ఎన్నో విషయాలు ఉంటాయి.

కాని తల్లిదండ్రులకు మాత్రం పిల్లల మార్కులు వందకు వంద, ఎనభైకు ఎనభై, యాభైకు యాభై, ఇరవై అయిదుకు ఇరవై అయిదు కనిపిస్తేనే ఆనందం. సంతోషం. బాగా చదివినట్టు లెక్క. మార్కులు మాత్రమే పిల్లలు బాగా చదివినట్టు నిరూపిస్తాయా?

సంతృప్తికి హద్దు
పూర్వం తల్లిదండ్రులు పరీక్షల్లో 60 శాతం మార్కులు వస్తే సంతోషపడేవారు. తర్వాత అది ఎనభైకి చేరింది. ఆ తర్వాత తొంభై శాతం మార్కులు తెచ్చిన పిల్లలను నలుగురికీ గర్వంగా చూపేవారు.

ఇవాళ వంద శాతం తెచ్చుకుంటే తప్ప తల్లిదండ్రుల ముఖాలలో చిర్నవ్వు కనిపించడం లేదు. తల్లిదండ్రుల ఎదుట ముఖం చెల్లుబాటు అయ్యేందుకు, తల్లిదండ్రుల తిట్లు (కొందరు కొడతారు) తప్పించుకునేందుకు ఆ సబ్జెక్ట్‌లు వచ్చినా రాకపోయినా మంచి మార్కులు తెచ్చుకోవాలనే వొత్తిడి పిల్లలు ఎలా తట్టుకోవాలి?

టీచర్లు సమర్థులేనా?
పిల్లలు మార్కులు తెచ్చారు. వాటిని తల్లిదండ్రులు చూశారు. కొన్ని పేపర్లలో మంచి మార్కులు వచ్చాయి. కొన్నింటిలో తక్కువ వచ్చాయి. వెంటనే ఇరుగింటి వారి ముందు పొరిగింటి వారి ముందు తిట్టడం మొదలుపెట్టకూడదు. ‘గ్రేడ్స్‌ షేమింగ్‌’... అంటే ఇతర పిల్లల మార్కులు కనుక్కొని మన పిల్లల కంటే ఎక్కువ వచ్చి ఉంటే అవమానించవద్దు. వారికి ఎందుకు వచ్చాయి నీకు ఎందుకు రాలేదు అని దబాయించవద్దు.

మొదట పిల్లలతో మాట్లాడాలి. స్నేహంగా కూచోబెట్టుకోవాలి. సమస్య ఏమిటో అడగాలి. కొన్ని సబ్జెక్ట్‌లు ఎందుచేతనో పిల్లలకు పట్టుబడవు. కొందరు ఇంగ్లిష్‌లో బాగా చదివి లెక్కల్లో పూర్‌గా ఉంటారు. కొందరు సైన్స్‌ బాగా చదివి తెలుగు తప్పులు రాస్తారు. ఏ సబ్జెక్ట్‌లో వారికి ఎటువంటి సమస్య ఉందో తెలుసుకోవాలి.

స్కూల్లో ఆ సబ్జెక్ట్‌లు చెప్పే టీచర్లతో వారికి స్నేహం ఉందా లేదా ఆ టీచర్లు ఆసక్తిగా చెబుతున్నారా కటువుగా చెప్తున్నారా తెలుసుకోవాలి. వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌లు ఇంట్లోగాని ట్యూషన్‌ ద్వారా గాని చెప్పే అవకాశం గురించి ఆలోచించాలి. ఇవన్నీ లేకుండా మార్కులు తక్కువ వచ్చాయని దండనకు దిగడం పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది.

పిల్లలూ తప్పులు చేస్తారు
పిల్లలు కూడా తప్పులు  చేస్తారు. నిర్లక్ష్యంగా ఉంటారు. సరిగా చదవకుండా ఎలాగోలా రాయొచ్చులే అనుకుంటారు. తీరా పరీక్షలు రాశాక తెల్లమొఖం వేస్తారు. మార్కులు వచ్చాక చేసిన తప్పు తెలుసుకుంటారు. వారు కూడా తమకు వచ్చిన మార్కులకు సిగ్గు పడతారు.

ఆ స్థితి గమనించి తల్లిదండ్రులు ‘పర్వాలేదు. ఈసారి జాగ్రత్త పడు’ అని చెప్పేలా ఉండాలి. ఇప్పుడు క్వార్టర్లీ రాశారు కనుక హాఫ్‌ ఇయర్లీ వరకూ ఇంప్రూవ్‌ కావాలని... యాన్యువల్‌ ఎగ్జామ్స్‌కు ది బెస్ట్‌గా ఎదగవచ్చని ధైర్యం చెప్పాలి. అందుకు తాము సాయం చేస్తామని భరోసా ఇవ్వాలి. తక్కువ మార్కులు వచ్చి అసలే ఇబ్బంది పడుతున్న పిల్లలను ఇంకా ఇబ్బంది పెట్టకూడదు.

వాస్తవాన్ని అంగీకరించమని చెప్పాలి
కష్టపడి చదివి రాయవలసినంత రాయి.. మార్కుల సంగతి ఆ తర్వాత అని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పకపోతే పిల్లల ఆలోచనలు పరి పరి విధాలుగా పోయే అవకాశం ఉంది. తమ వాస్తవిక పరిస్థితిని వారు అంగీకరించి దానిని తల్లిదండ్రులకు చెప్పే వాతావరణం ఇంట్లో ఉండాలి.

‘అమ్మో మార్కులు తక్కువ వచ్చాయి. తిడతారు. ఎక్కువ వచ్చాయని అబద్ధం చెబుదాం’ అని పిల్లలు అనుకుంటే ఆ తల్లిదండ్రులు ఫెయిల్‌ అయినట్టు లెక్క. ఒక్కోసారి మార్కులు తక్కువ వస్తే పిల్లలు ఇళ్ల నుంచి పారిపోయారంటే ఆ తల్లిదండ్రులు ఇంకా దారుణమైన పెంపకం వహిస్తున్నట్టు. పిల్లలు ఎలాంటి ఇబ్బంది అయినా తల్లిదండ్రులతో చెప్పే స్నేహం అవసరం. అందుకు సమయం ఇస్తున్నామా లేదా అని తల్లిదండ్రులు పరీక్షించుకోవాలి.

క్వార్టర్లీ పరీక్షలు మీ పిల్లల పరిస్థితిని, వారి పట్ల మీ అవగాహనను తెలియచేశాయి. వార్షిక పరీక్షలకు పిల్లలతో పాటు మీరు వారితో కలిసి ప్రయాణించడానికి ప్రేమతో, ఓర్పుతో, స్నేహంతో దారి వేసుకోండి. పిల్లలను ఉత్సాహపరిస్తే అద్భుతాలు చేస్తారు. బెదరగొడితే చతికిల పడతారు. గమనించండి.
 
ప్రోత్సాహకాలు
పిల్లలు బాగా చదివితే ప్రోత్సాహకాలు ఇచ్చి తల్లిదండ్రులు వారిని ఉత్సాహపరచాలి. రోజూ వారితో పాటు కాసేపు కూచుని వారు చదువుకుంటూ ఉంటే మెచ్చుకోవాలి. వారికి సందేహాలుంటే తాము తీర్చగలిగితే తీర్చాలి. లేదా వారి అనుమతితో (వారు వద్దంటే వద్దు) ట్యూషన్లు పెట్టాలి.

అన్నింటి కంటే ముఖ్యం ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి దసరా సెలవుల వంటి సందర్భాల్లో కూచోబెట్టి బలవంతంగా చదవమని శిక్ష విధించకూడదు. పిల్లలు వారి సరదా సమయాలను ఎంజాయ్‌ చేయనివ్వాలి. అదే సమయంలో బాగా చదవడం వారి బాధ్యత అని వారికి తెలియచేయాలి. 

చదవండి: Parenting Tips: ప్రేమతోనే పెంచుతున్నారా? చీటికిమాటికీ చిర్రుబుర్రులాడకండి! ఇలా చేస్తే..

మరిన్ని వార్తలు