పొగతాగే తండ్రులు... పిల్లల్లో క్యాన్సర్‌ రిస్క్‌ 

30 Jan, 2021 09:24 IST|Sakshi

పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్‌ఏను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రి తప్పిదం వల్ల పిల్లలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఒక అధ్యయనం చెబుతోంది. బ్రాడ్‌ఫోర్ట్‌ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. దీనికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ జన్యువులను పిల్లలకు అందించే వీర్యకణాల్లోని డీఎన్‌ఏ... పొగవల్ల దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన డీఎన్‌ఏ వల్ల పిల్లల్లో క్యాన్సర్‌ అవకాశాలు ఎక్కువ. అయితే ఈ రిస్క్‌ను తప్పించుకునేందుకు ఒక ఉపాయం కూడా ఉంది.

దంపతులు గర్భధారణకు ప్లాన్‌ చేసుకున్న సమయం కంటే... కనీసం  మూడు నెలల ముందే పొగతాగే అలవాటు మానేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్‌ డయానా యాండర్సన్‌. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటు కు దూరంగా ఉంటే డీఎన్‌ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్‌ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికైనా పొగతాగకుండా ఉండాలని ఒకవేళ పొగతాగే అలవాటు ఉంటే పిల్లల ఆరోగ్యం కోసమైనా వెంటనే మానేయాలని ఈ అధ్యయనం చెబుతోంది.  

మరిన్ని వార్తలు