పల్టీ టాస్కింగ్‌

10 Sep, 2020 08:39 IST|Sakshi
పారుల్‌ అరోరా  

చీర ఎటూ కదలనివ్వదు. చుట్టుకుని ఉండేది ఒంటికే.. మనసును బంధించేస్తుంది! బైక్‌ని నడపనిస్తుందా?బ్యాటింగ్‌ చేయనిస్తుందా? ఫుట్‌బాల్‌ ఆడనిస్తుందా? ఎత్తయిన మెట్టు ఎక్కనిస్తుందా? ఒక్క గెంతులో దూకనిస్తుందా?నాన్‌–అథ్లెటిక్‌.. పవర్‌లెస్‌. అవునా!మరి ఈ పవర్‌ని ఏమందాం?

పచ్చటి చెట్ల మధ్య సన్నటి మట్టి దారి. అదెక్కడి ప్రదేశమో తెలియదు. వంగపండు రంగు బ్లవుజు, ఎల్లో శారీలో ఉన్న ఒక యువతి కాళ్లకు చెప్పుల్లేకుండా, ఆ గతుకుల దారిలోనే గాలిలోకి ఎగిరి వెనక్కి పల్టీ కొట్టడం రెండు నెలల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 360 డిగ్రీలలో గుండ్రంగా ఆమె వెనక్కు ‘ఫ్లిప్‌’ అవడం కాదు ఆశ్చర్యం. చీరలో.. చీరలో అలా సినిమాటిక్‌గా తిరగడం! వావ్‌ అనీ, వాట్‌ ఎ టాలెంట్‌ అనీ, దేశవాళీ సూపర్‌ ఉమన్‌ అనీ, జా డ్రాపింగ్‌ ఫ్లిప్‌ అని, ఫ్యాంటాస్టిక్‌ సోమర్‌సాల్ట్‌ (వృత్త విన్యాసం) అనీ కామెంట్స్‌ వచ్చాయి.

అలా అందరికీ ఆమె తెలుసు. కానీ ఆమె ఎవరో ఈరోజుకీ ఎవరికీ తెలీదు. సంగీత వారియర్‌ అనే పేరు మీద ఉన్న ఒక ట్విట్టర్‌ అకౌంట్‌లో ‘ఇండియన్‌ ఉమెన్‌ ఆర్‌ రియల్లీ సూపర్‌ ఉమెన్‌’ అనే అభినందనతో ఈ క్లిప్‌ షేర్‌ అయింది. క్రీడలు, యువజన కార్యక్రమాల కేంద్ర సహాయ మంత్రి కిరేర్‌ రిజిజు కూడా ఆ వీడియోను ట్యాగ్‌ చేశారు. ‘ఎక్స్‌లెంట్‌’ అని కామెంట్‌ పెట్టారు. నెటిజన్‌లు ఆ అజ్ఞాత యువతిలోని విన్యాస నైపుణ్యాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చినందుకు సంగీతకు కూడా అభినందనలు, ఆ తర్వాత ధన్యవాదాలు తెలిపారు.

పారుల్‌ ఫ్రంట్‌ పల్టీ
రెండు నెలలు గడిచాయి. ఇప్పుడు మరో యువతి అదే ‘ఫీట్‌’తో ఆ ఎల్లో శారీ యువతిని గుర్తుకు తెచ్చింది. ఎల్లో శారీ వెనక్కు పల్టీ కొడితే, ఈ బ్లూ శారీ ముందుకు పల్టీ కొట్టింది. రెండు విన్యాసాలూ కష్టమైనవే. చీరలో మరీ కష్టమైనవి. ఈ బ్లూ శారీ అమ్మాయిది హర్యానాలోని అంబాలా. తనే ఈ వీడియోను అప్‌లోడ్‌ చేసింది. పద్నాలుగేళ్లుగా తను జిమ్మాస్టిక్స్‌ చేస్తోందట.  అంతకుమించిన వివరాలను ఈ యువతి తన గురించి చెప్పుకోలేదు. ఇలా గుండ్రంగా గాలిలోకి లేచి ఫ్లిప్‌ కొట్టడానికి ప్రయత్నించి రెండుసార్లు విఫలం అయ్యాక మూడోసారి విజయం సాధించానని మాత్రం చెప్పింది. ‘‘ఇదేం విజయం! ఎందుకైనా పనికొచ్చేదా!’’ అని ఒకరిద్దరు ట్రోల్‌ కూడా చేశారట. అలాంటివి పట్టించుకుంటే గాల్లోకి లేవడం అటుంచి, కనీసం భూమి మీద నాలుగు అడుగులైనా వేయలేం అంటోంది పారుల్‌. గట్టి మాటే. ఫెమినిస్ట్‌ స్టేట్‌మెంట్‌.

‘ఎల్లో శారీ’ బ్యాక్‌ పల్టీ

మరిన్ని వార్తలు