చిరుద్యోగి నుంచి సీయీవో దాకా!

5 May, 2022 00:11 IST|Sakshi
పారుల్‌ తరంగ్‌ భార్గవ

జనబాహుళ్యంలోకి ఆన్‌లైన్‌ మార్కెట్‌ వచ్చాక తయారీదారుల నుంచి కస్టమర్ల దాకా ఆందరూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కామర్స్‌ మార్కెట్‌ను సరిగ్గా ఒడిసి పట్టుకుంటే అందనంత ఎత్తుకు ఎదగవచ్చని గ్రహించిన ఓ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ వినూత్న ఆలోచనలతో అనుబంధ సంస్థను దేశంలోని టాప్‌ ఫైవ్‌ కంపెనీలలో ఒకటిగా నిలబెట్టింది. కంపెనీలో కంటెంట్‌ రైటర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి, అనతికాలంలోనే ‘వీ కమిషన్‌’ కంపెనీకి సీఈఓ అయిన ఎంట్రప్రెన్యూర్‌ మరెవరో కాదు పారుల్‌ తరంగ్‌ భార్గవ. పదేళ్లుగా కంపెనీ సీఈఓగా  విజయవంతంగా రాణిస్తూ తాజాగా గ్లోబర్‌ అఫిలియేట్‌ నెట్‌వర్క్‌ కేటగిరిలో ‘‘ప్రామిసింగ్‌ ఉమెన్‌ సీఈఓ ఆఫ్‌ ద ఇయర్‌– 2022 విశేష సత్కారం అందుకుని నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది పారుల్‌.

ఏంజిల్‌ ఇన్వెస్టర్, స్పీకర్, లీడర్, వీ కమిషన్‌ సహవ్యవస్థాపకురాలు పారుల్‌ తరంగ్‌ భార్గవ ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తల్లిదండ్రుల మాట జవదాటకుండా నడుచుకునేది. స్కూలు విద్యాభ్యాసం అంతా ఆడుతూ పాడుతూ గడిపిన పారుల్‌కు... కాలేజీ చదువులు ప్రారంభమయ్యాక అసలైన ప్రçపంచం మనిషి మనుగడ, పేరు ప్రఖ్యాతులకోసం పడే తాపత్రయం, ఉన్నతంగా ఎదగడానికి ఎదుర్కోవాల్సిన పోటీని ప్రత్యక్షంగా తెలుసుకుంది. గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్శిటీలో బిటెక్‌(ఐటీ) చదివే సమయంలోనే ప్రస్తుత జీవిత భాగస్వామి గురుగావ్‌కు చెందిన తరంగ్‌ భార్గవ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం, తర్వాత ప్రేమ చిగురించి జీవిత భాగస్వాములయ్యారు.

వీకమిషన్‌..
ఇంజినీరింగ్‌ అయ్యాక తరంగ్‌  2006లో పేరిట ‘వీకమిషన్‌’ అఫిలియేట్‌ కంపెనీని ప్రారంభించారు. వివిధ ఈ కామర్స్‌ కంపెనీలకు అనుబంధ మార్కెటర్స్‌ను అందించడమే ఈ కంపెనీ ముఖ్యమైన పని. దీనిలో కంటెంట్‌ రైటర్‌గా చేరింది పారుల్‌. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ప్రస్తుత మార్కెట్‌ ట్రెండింగ్‌ అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వీ కమిషన్‌ ఎదుగుదలకు సరికొత్త ఐడియాలను అన్వేషించి అమలు చేసేది. దీంతో వీ కమిషన్‌ అభివృద్ధి బాట పట్టింది. ఈ కామర్స్‌ మార్కెట్‌లో తనదైన ముద్రవేయడంతో 2008లో వీ కమిషన్‌కు సహవ్యవస్థాపకురాలిగా మారింది పారుల్‌.

నమ్మకాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా..
ఇండియన్‌ అఫిలియేట్‌ మార్కెట్లపై విదేశీ కంపెనీలకు మంచి అభిప్రాయం లేదని గ్రహించిన పారుల్‌ ముందుగా ఆయా కంపెనీల నమ్మకాన్ని గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే యూఎస్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వంటి దేశాలను లక్ష్యంగా పెట్టుకుని చిగురుటాకులా ఉన్న వీకమిషన్‌ను అనతి కాలంలోనే అతిపెద్ద కంపెనీగా నిలబెట్టింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న పాపులర్‌ అఫిలియేట్‌ ప్లాట్‌ఫామ్‌లలో వీ కమిషన్‌ కూడా ఒకటి. యాడ్‌వేస్‌ వీసీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎయిర్‌టెల్, ఫ్లిప్‌కార్ట్, ఈబే, అమెజాన్, డోమినోస్, ఏసియన్‌ పెయింట్స్, పీఅండ్‌జీ వంటి ప్రముఖ కంపెనీలకు అనుబంధంగా వీ కమిషన్‌ పనిచేస్తోంది.

ఈ– కామర్స్, ట్రావెల్, ఫైనాన్స్, ఇన్సురెన్స్, ఐ గేమింగ్, నేచురల్‌ ప్రోడక్ట్స్, డొమైన్‌ కంపెనీలకు అఫిలియేటర్‌గా, వాల్‌మార్ట్, అలీబాబా, మింత్రా, అగోడా, షాపీ, ఖతార్‌ ఎయిర్వేస్‌కు అనుబంధంగా పనిచేసింది. పది స్టార్టప్‌ కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. ఇలా అనేక పరిశ్రమ వర్గాల నమ్మకాన్ని చూరగొని 2015లో టాప్‌–50 అలెక్సా ర్యాంకింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. చకచకా దూసుకుపోతూ దశాబ్దకాలంలోనే ల„ý ల నెట్‌వర్క్‌ అఫిలియేట్స్‌ను చేరుకుని 80 మిలియన్ల నెలవారి ట్రాఫిక్, నెలకు రెండు బిలియన్ల జీఎమ్‌వీతో ఏషియాలోనే అతిపెద్ద కంపెనీగా వీ కమిషన్‌ నిలవడానికి పారుల్‌ ఇచ్చిన సలహాలు, సూచనలు, టిప్పులు ట్రిక్స్, కృషే కారణం.
 
బెస్ట్‌ ఈ–కామర్స్‌ కంపెనీగా...
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ మార్కెట్‌ నడుస్తోంది. ఆయా ఈ కామర్స్‌ యాజమాన్యాల దగ్గర నుంచి వస్తువుల లింక్‌  తీసుకుని వివిధ అనుబంధ మార్కెటర్స్‌తో విక్రయించడమే అఫిలియేట్‌ చేసే పని. ఇలా లక్షలమంది అఫిలియేట్‌ మార్కెటర్స్‌ను జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు పనిచేసేలా చేయడంతో, ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫాంకు మంచి లాభాలు వచ్చాయి. ఈ కామర్స్‌ కంపెనీల నమ్మకాన్ని చూరగొనడంతో మా వీకమిషన్‌ బెస్ట్‌ ఈ కామర్స్‌ కంపెనీగా నిలిచింది. కస్టమర్ల అభిరుచులు తెలుసుకుని విభిన్నంగా ఆలోచిస్తే ఎవరైనా మంచి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగవచ్చు.
– పారుల్‌ తరంగ్‌ భార్గవ్‌, ‘వీకమిషన్‌’ సిఈఓ

మరిన్ని వార్తలు