చిన్నారుల అరచేతుల్లో చర్మం ఊడుతోందా? 

13 Mar, 2022 22:55 IST|Sakshi

కొందరు చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో పొట్టు ఒలిచిన విధంగా చర్మం ఊడి వస్తుంటుంది. అంతేకాదు విపరీతమైన దురదతోనూ బాధపడుతుంటారు. ఇందుకు ప్రధాన కారణం ఎగ్జిమా. ఇలా చర్మం ఊడిపోతూ, దురదల వంటి లక్షణాలు ఎగ్జిమాతో పాటు హైపర్‌కెరటోటిక్‌ పాల్మార్‌ ఎగ్జిమా, కెరటోలైసిస్‌ ఎక్స్‌ఫోలియేటా, ఎస్‌.ఎస్‌.ఎస్‌. సిండ్రోమ్, కన్‌స్టిట్యూషనల్‌ డిసీజెస్, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కనిపిస్తుంటాయి. తగినంత పోషకాహారం దొరకని పిల్లల్లో విటమిన్‌ లోపాల వల్ల కూడా అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పెద్దల్లో సైతం సోరియాసిస్, స్కార్లెట్‌ ఫీవర్‌ వంటి కారణంగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. 

ఏవైనా వైరల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గిన తర్వాత కొందరు పిల్లల్లో ఈ లక్షణాలే కనిపిస్తుంటాయి. కాకపోతే మొదట్లో చాలా తీవ్రంగా కనిపించినా క్రమక్రమంగా తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్‌ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్‌లా వచ్చి... ఇవే లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘పోస్ట్‌ వైరల్‌ ఎగ్జింథిమా’ అంటారు. ఇది రెండు నుంచి మూడు వారాల్లో పూర్తిగా తగ్గిపోతుంది. 

చికిత్స: పిల్లల అరచేతులు, అరికాళ్ల అంచుల్లో చర్మం ఊడుతూ... దురదలు వస్తూ తీవ్రంగా అనిపించే ఈ సమస్య... దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. చాలావరకు ప్రమాదకరం కూడా కాదు. ఉపశమనం కోసం, చేతులు తేమగా ఉంచుకోవడం కోసం మాయిశ్చరైజింగ్‌ క్రీమ్స్‌ రాయవచ్చు. జింక్‌ బేస్‌డ్‌ క్రీమ్స్‌ రాయడం వల్ల కూడా చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం పిల్లల డాక్టర్‌ / డర్మటాలజిస్ట్‌ సలహా మేరకు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్‌ (మైల్డ్‌ స్టెరాయిడ్స్‌) క్రీమ్‌ రావడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న సూచనలు పాటించాక కూడా సమస్య తగ్గకపోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్‌ వచ్చినా, లక్షణాలు మరీ ఎక్కువవుతున్నా డెర్మటాలజిస్ట్‌ను కలిసి తగు సలహా, చికిత్స తీసుకోవాలి.  

మరిన్ని వార్తలు