తేడా వస్తే.. ఆ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు.. వాళ్లకు అలర్ట్‌ వెళ్లిపోద్ది

22 Feb, 2022 23:28 IST|Sakshi

ఆరోజు రాత్రి  పనిఒత్తిడి వల్ల శ్వేతకు ఆఫీసు నుంచి బయటకు రావడం బాగా ఆలస్యం అయింది. ఆ సమయంలో వాళ్ల  ఏరియాకు వెళ్లే బస్సులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటో ఎక్కాల్సి వచ్చింది. కొంత దూరం వెళ్లాక డ్రైవర్‌ ప్రవర్తనలో మార్పు కనిపించింది.

అట్టే ఆలస్యం చేయకుండా తన మెడలోని లాకెట్‌ను రెండుసార్లు నొక్కింది శ్వేత. ప్రమాదం నుంచి బయటపడింది. అది మంత్రం దట్టించిన లాకెట్‌ కాదు. మామూలు లాకెట్టే...కాకపోతే టెక్నో లాకెట్టు!

‘ఆభరణాలు అందం కోసం’ అనేది నిన్నటి మాట. ‘అభరణాలు అందం కోసమే కాదు స్వీయరక్షణ కోసం కూడా’ అనేది నేటి మాట. ‘ఏ పుట్టలో ఏ పాము ఉందో’ అన్నట్లుగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియదు మనకు. వైద్యసూక్తి ‘చికిత్స కంటే నివారణ ముఖ్యం’లాగే మన వ్యక్తిగత భద్రత విషయంలోనూ నివారణ అనేది ముఖ్యం కావాలి. ప్రమాదాలను నివారించడంలో అందమైన ఆభరణాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మచ్చుకు కొన్ని...

మీ మెడలో కనిపించే ఇన్‌విసావేర్‌ లాకెట్‌ను చూసిన వాళ్లు ‘ఎంత బాగుందో’ అంటారు. అయితే ఈ లాకెట్‌పని అందంగా కనిపించడం మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనిలోని హిడెన్‌ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు మీ కుటుంబసభ్యులు, స్నేహితులలో అయిదుమందికి మీరు ప్రమాదంలో ఉన్నట్లు తెలియజేసే మెసేజ్‌ చేరుతుంది.

బ్లూటూత్‌తో అనుసంధానమై ఉన్న ఈ లాకెట్‌ జీపిఎస్‌ లొకేషన్‌ తెలియజేస్తుంది. ఈ గోల్డ్‌ప్లేటెడ్‌ లాకెట్‌ మన భద్రత విషయంలో బంగారంలాంటి విలువైనది అని చెప్పుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ‘పెండెంట్‌ విత్‌ వైట్‌సేఫర్‌ వీఐ.0’ లాకెట్‌ గురించి...
గ్రీన్‌కలర్‌లో మెరిసిపోయే ఈ లాకెట్‌లోని బాక్స్‌లో మైక్రో యుఎస్‌బి అమర్చబడి ఉంటుంది. బ్లూటూత్‌ టెక్నాలజీతో, ‘సేఫర్‌ బీ లీఫ్‌’ యాప్‌తో కలిసిపనిచేస్తుంది. ప్రమాదపరిస్థితుల్లో ఈ లాకెట్‌ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు మన వాళ్లకు సమాచారం చేరిపోతుంది. సమీపంలో ఉన్న పోలిస్‌స్టేషన్, హాస్పిటల్‌ను యూజర్‌ నేవిగేట్‌ చేసే ఆప్షన్‌ ఉంది.

మెడలో సులభంగా ఇమిడిపోయి, ఆకర్షణీయంగా కనిపించే గ్లాస్‌ పెండెంట్‌ ‘సేఫర్‌’ కూడా ప్రమాద సమయాలలో మన వాళ్లను అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఐటీ–దిల్లీ, దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ విద్యార్థులు దీనికి రూపకల్సన చేశారు.
‘ఒంటరి సమయంలో కూడా  నా చుట్టూ పదిమంది ఉన్నారు అనే ధైర్యాన్ని సేఫర్‌ ఇస్తుంది’ అంటున్నారు.
‘ఏదో కొన్నామంటే కొన్నాం అన్నట్లుగా కాకుండా ప్రతిరోజు విధిగా లాకెట్‌ను మెడలో ధరించాలి’ అంటున్నారు భద్రత నిపుణులు. 

మరిన్ని వార్తలు