చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి

23 Oct, 2021 19:32 IST|Sakshi

ఫాస్ట్‌ఫుడ్స్‌కు స్వస్తిపలికి పూర్వీకుల ఆహారంపై మక్కువ చూపుతున్న జనం

చిరుధాన్యాలు, ఇంటి వంటలు పట్ల ఆసక్తి

తరం మారుతోంది...వారి స్వరం కూడా మారుతోంది. ఆరోగ్యమే మహా భాగ్యమంటూ చిరుధాన్యాలను తమ ఆహార మెనూలో చేర్చి అగ్రస్థానం కల్పిస్తున్నారు. తమ జాబితాలో మొదటి స్థానంలో ఉండే బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ ఫుడ్‌లను తొలగిస్తూ ఆరోగ్యప్రద ఆహారాలకు ప్రధానంగా యువత ప్రాధాన్యమిస్తున్నారు. 

ఫాస్ట్‌ఫుడ్స్‌కు క్రమేపీ దూరమవుతూ.. చిరు ధాన్యాల వైపు జనం దగ్గరవుతున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పు రావడంతో ఇందుకు అనుగుణంగా మార్కెట్‌ కూడా మారుతోంది. చిరుధాన్యాల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండడంతో బియ్యం దుకాణాల్లో ఇవి కూడా అమ్మకానికి పెడుతున్నారు. బిస్కెట్లు, చాక్లెట్లు, చపాతి, మురుకులు, ఇడ్లీలు కూడా చిరుధాన్యాలతో తయారు చేస్తున్నారు. 

కరోనా రాకతో మరింత గిరాకీ 
మనిషికి హిమోగ్లోబిన్‌ 15 గ్రాములుంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అన్నిటికంటే రాగులు ద్వారా శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలకు కాల్షియాన్ని అందిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు రాగికి బెల్లం జతచేసిన ఆహార పదార్ధాలు ఇళ్లల్లో తయారీ చేయిస్తూ తమ పిల్లలకు అందిస్తున్నారు. గ్లూకోజ్‌ స్థాయులను కూడా నియంత్రించడంలో రాగులు దోహదపడుతుండడంతో మధుమేహులు కూడా ఆకర్షితులవుతున్నారు.

వీటితోపాటు జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలను కూడా తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. బెల్లంతో చేసిన తినుబండారాలను ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు. బెల్లం పాకంతో వేరుశెనగ, నువ్వు ఉండలు, రాగి లడ్డు, మినపలడ్డు, రాగి అట్టులను యువత ఇష్టపడుతుండడంతో మిఠాయి దుకాణాల్లో ఇవి స్థానం దక్కించుకుంటున్నాయి.  

 

మరిన్ని వార్తలు