Period Pain Relief: భరించలేని నెలసరి సమస్యలా? ఈ 10 చిట్కాలు ట్రై చేయండి..

27 Sep, 2021 09:57 IST|Sakshi

అతివలకు ప్రతి నెలసరి ఒక్కో అగ్నిపరీక్ష లాంటిది. ఆ సమయంలో కడుపునొప్పితో మొదలై వాంతులు, కళ్లు తిరగడం, నడుం నొప్పి,, నీరసం, చికాకు, తిమ్మిర్లు, అధిక రక్త స్రావం.. వంటి తీవ్ర పరిస్థితుల గుండా వెళ్లవల్సి ఉంటుంది. ఐతే ఈ లక్షణాలు అందరి విషయంలో ఒకేలా ఉండవు. కొందరికి నెలసరి మొదలయ్యే ముందు కనిపిస్తే, మరికొందరికి రుతుస్రావ సమయంలో ఇబ్బంది పెడతాయి. నొప్పి తీవ్రత కూడా కొందరికి విపరీతంగా ఉంటే, మరికొందరికి స్వల్పంగా ఉంటుంది. కొంతమందికైతే ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఏదిఏమైనప్పటికీ ఇవి వారి దైనందిన జీవితంలో వృత్తి, వ్యక్తిగత పనులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. 

అయితే కొన్ని రకాల ఆహార అలవాట్లతో ఈ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుందాం..

పుదీనా- దాల్చిన చెక్క టీ
పుదీనాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే! వివిధ రకాల వ్యాధుల నివారణలో దీని పాత్ర ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుదీనాలో మెంథోల్‌ అధికంగా ఉంటుంది. ఇది కండరాల నొప్పులను అరికట్టడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక దాల్చిన చెక్క గర్భాశయ రక్తప్రవాహాన్ని అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. పుదీనా - దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ ఈ సమయంలో తాగడం ద్వారా నెలసరి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

నిమ్మరసం - అల్లం
నిమ్మరసంలోని కాల్షియం, మాగ్నిషియంతో సహా వివిధ పోషకాలు నెలసరి నొప్పిని ఎదుర్కొంటాయి. మొటిమలను నివారించడంలో కూడా నిమ్మరసం మేటే! అలాగే తాపనివారక, బాధ ఉపశమన కారకాలు అల్లంలో నిండుగా ఉంటాయి. మరిగే నీళ్లలో అల్లం ముక్క, నిమ్మరసం కలపి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగడం వల్ల నెలసరి కడుపునొప్పి నివారణకు మాత్రమేకాకుండా శరీరంలోని ఇతర హానికారకాలను బయటికి పంపడంలోనే కీలకంగా వ్యవహరిస్తుంది.

డార్క్‌ చాక్లెట్‌ - అవకాడో పండు
తిమ్మిర్ల నివారణకు డార్క్‌ చాక్లెట్‌ ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ శరీరానికి అవసరమైన మాగ్నిషయంను కూడా అందిస్తుంది. అవకాడో పండులో కూడా మాగ్నిషియం అధికంగానే ఉంటుంది. వీటిని మీ ఆహారంలో భాగంగా తీసుకన్నట్లయితే నెలసరి నొప్పిని కలుగజేసే ప్రొస్టాగ్లాండిన్ లను తగ్గించి కండరాలను సేదతీరేలా చేస్తాయి. డార్క్‌ చాక్లెట్‌, అవకాడో పండు ముక్కలను విడిగా తినవచ్చు లేదా వీటితో తయారు చేసిన లడ్డులను తిన్నా మంచిదే. 

చేప - పాలకూర
చేపలోని ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు బాధ నివారణకు ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌, మాగ్నిషియం వంటి ఇతర పోషకాలు చేపలో అధికంగా ఉంటాయి. అలాగే పాలకూరను పచ్చిగా లేదా ఉడకబెట్టి ఏవిధంగా తిన్నా మంచిదే. ఐతే వీటిని కడిగి తినడం మాత్రం మర్చిపోకండి. చేప - పాలకూరను రెండూ కలిపి వండి తినొచ్చు లేదా విడిగానైనా తినొచ్చు.

అరటి, పైనాపిల్‌, కివీ
తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం లక్షణాలను అరటి పండు నివారిస్తుంది. దీనిలో బి6, రోజువారీ శరీరానికి అవసరమైన పొటాషియం నిండుగా ఉంటాయి. తాపాన్ని నివారించే బ్రొమెలైన్‌ ఎంజైమ్‌ పైనాపిల్‌లో ఉంటుంది. అలాగే కివీలోని యాక్టీనిడిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఈ పండ్లను మీ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే నెలసరి సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు.

నిపుణులు సూచించే మరికొన్ని చిట్కాలు
తగినంత నీరు తాగాలి
ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా అవసరం. కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగాలి. లెట్యూస్‌ క్యాబేజీ, సెలెరీ ఆకు కూర, దోసకాయ, పుచ్చకాయ, బెర్రీ పండ్లు వంటి నీరు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన నీరు అందుతుంది.

నూనెలతో మసాజ్‌ చేయడం
మార్జోరాం, లావెండర్‌ (మరువం వంటి ఒక మొక్క), సీమ చేమంతి వంటి ఔషద మొక్కల నూనెతో పొత్తి కడుపు మీద మర్దన చేయడం వల్ల కూడా బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా వీటినుంచి వచ్చే పరిమళం మీ మనస్సును తాజాగా ఉంచడానికి తోడ్పడుతుంది.

మీ శరీరానికి తగినంత విశ్రాంతి నివ్వండి
కొన్ని సార్లు ఒత్తిడివల్లనో, అలసిపోవడం వల్లనో పీరియడ్‌ టైంలో నొప్పి అధికంగా సంభవిస్తుంది. అలాంటప్పుడు కొంత విశ్రాంతి తీసుకుంటే బాధ నుంచి నివారణ పొందవచ్చు.

ఆల్కహాల్‌ తీసుకోవడం తగ్గించాలి
ఆల్కహాల్‌ మీ శరీరాన్ని డీహైడ్రేట్‌ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల తలనొప్పి, ఉబ్బరం, విరేచనాలు, వికారం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆల్కహాల్‌ తీసుకోకపోవడం మంచిది.

ఎక్సర్‌సైజ్‌ చేయడానికి ప్రయత్నించండి
తేలికపాటి శరీర వ్యాయామాలు నెలసరి నొప్పి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. యోగాసనాలు ద్వారా కూడా తిమ్మిర్లను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: Health Tips: రక్తంలో కొలెస్ట్రాల్‌, గ్లూకోస్‌ స్థాయిలు గణనీయంగా తగ్గాలంటే..

మరిన్ని వార్తలు