Ketaki Sheth: ఫొటోస్టూడియో ఆటోబయోగ్రఫీ

16 Oct, 2022 00:21 IST|Sakshi

కళ

ఒకసారి కళ్లు మూసుకొని స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు లేని ఫొటోస్టూడియోల కాలంలోకి వెళ్లండి. దీపావళి పండగరోజు అక్కయ్య, అన్నయ్యలతో కలిసి దిగిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో గుర్తుందా? ‘రెడీ... అనగానే అలా కళ్లు మూయవద్దు తల్లీ’ అని సుతిమెత్తగా మందలించిన మీ ఊరిలోని ఫొటోగ్రాఫర్‌ గుర్తున్నాడా? ఫిల్టర్‌లు, మొబైల్‌ ఫోన్‌ అప్లికేషన్‌లు లేని ఆ కాలంలో స్టూడియోలలోని అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌ పెయింటింగ్స్‌ గుర్తుకొస్తున్నాయా? కేతకి సేథ్‌ తన ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌తో ఆ కాలంలోకి తీసుకువెళుతుంది. పదండి ఒకసారి...

సెల్‌ఫోన్‌ కెమెరాలు వచ్చిన తరువాత ‘ఫొటో స్టూడియో’లు తగ్గిపోయాయి. ఉన్నవి ఆనాటి వెలుగును కోల్పోయాయి. ఎన్నో కుటుంబాలతో అనుబంధాలు పెనవేసుకున్న అలనాటి ఫొటోస్టూడియోల గత వైభవాన్ని ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌తో మన కళ్ల ముందుకు తీసుకువస్తుంది ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్‌ కేతకి సేథ్‌.

2014లో నార్త్‌ ముంబైలోని ‘జగదీష్‌ ఫొటోస్టూడియో’లోకి కేతకి అడుగుపెట్టినప్పుడు అది ఫొటో స్టూడియోలా లేదు. గతకాల వైభవంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ఇక అది మొదలు 2018 వరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 67 పాత ఫొటోస్టూడియోలను సందర్శించింది. ఆ జ్ఞాపకాలను రికార్డ్‌ చేసింది. దిల్లీలోని ‘ఫొటోఇంక్‌’ గ్యాలరీలో తొలిసారిగా ‘ఫొటోస్టూడియో’ పేరుతో ఫొటోఎగ్జిబిషన్‌ నిర్వహించింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. కేతకి ప్రాజెక్ట్‌పై ‘ఫొటోస్టూడియో’ పేరుతో నాణ్యమైన పుస్తకం కూడా వచ్చింది.

తాజాగా... పాతతరానికి సంబంధించిన కొత్త ఫొటోలతో ముంబైలో చెమౌల్డ్‌ ప్రిస్కాట్‌ రోడ్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది కేతకి. ఈ ఫొటోలలో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఫొటోస్టూడియోలు ఉండడం విశేషం. అప్పట్లో ఇమేజ్‌–క్రేజ్‌ బాగా ఉండేది. స్క్రీన్‌కి అవతలి ప్రపంచాన్ని ఊహించేవారు కాదు. అందమైన ప్రకృతి దృశ్యాల నుంచి అభిమాన తారల వరకు ఎన్నో బ్యాక్‌డ్రాప్‌ పెయింటింగ్స్‌ స్టూడియోలలో కనిపించేవి. ఆ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు ఈ ఎగ్జిబిషన్‌లో కనిపించి కనువిందు చేస్తాయి.

కేతకి తన ప్రయాణంలో నాటి ఫొటోగ్రాఫర్‌లతో మాత్రమే కాదు, ఫొటోస్టూడియోలలో బ్యాక్‌గ్రౌండ్‌ పెయింటింగ్స్‌ గీసే ఆర్టిస్ట్‌లతో కూడా మాట్లాడింది. అలనాటి ఫొటోస్టూడియో యజమానులతో మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్నట్లుగా అనిపించలేదు. ఫొటోస్టూడియోలు తమ ఆటోబయోగ్రఫీని చెప్పుకుంటున్నట్లుగా ఉంది!

‘గతంలో ఎన్నో ఫొటో ఎగ్జిబిషన్‌లకు వెళ్లాను. కాని వాటన్నిటికంటే ఈ ఎగ్జిబిషన్‌ నాకు బాగా దగ్గరైంది. నా కాలంలోకి, సొంత ఇంట్లోకి అడుగుపెట్టినట్లుగా ఉంది. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతున్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. గ్యాలరీ నుంచి బయటికి వచ్చినా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది’ అంటుంది ఫొటో ఎగ్జిబిషన్‌కు వెళ్లివచ్చిన అరవై అయిదు సంవత్సరాల పూర్ణ.

‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌ సూపర్‌హిట్‌ అయిందని చెప్పడానికి ఇంతకుమించి ఉదాహరణ ఏముంటుంది!

మరిన్ని వార్తలు