Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు

17 Aug, 2022 00:39 IST|Sakshi

ఉదయం అమ్మకు ఇంట్లో టాటా చెప్పి, బడిలో పాఠాలు వింటూ.. స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ తిరిగిన అమ్మాయి సాయంత్రం అయ్యేసరికి తనకు తెలియని చీకటి లోకంలో ఉంటే ఎంత భయం... చుట్టూ ఏం జరుగుతోందో... తనకేం జరిగిందో తనకే సరిగా తెలియని ఆ ‘చీకటి లోకం’లో తెగువ చూపి, అది మిగిల్చిన చేదు సంఘటనల నుంచి బయటపడి ఇంటికి వచ్చేసింది 14 ఏళ్ల ఆ అమ్మాయి. ఊళ్లో అంతా విచిత్రంగా చూశారు ఆమెను. ‘బిజినెస్‌ గర్ల్‌’ అని అంతా అంటుంటే కుంగిపోయింది. కానీ, అదే అమ్మాయి 21 ఏళ్ల వయసు వచ్చేనాటికి మానవ అక్రమ రవాణాకు గురైన బాలికల జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోంది. ఆమె పేరు పీహూ మోండల్‌. పశ్చిమ బెంగాల్‌లోని ఓ మారుమూల గ్రామం.

‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బారిన పడిన ఆడపిల్లల బాధను పంచుకుని, వారిని నరకపు నీడ నుంచి బయటికి తీసుకొచ్చి, వెలుగు చూపగలిగినప్పుడు ఇంకా నా గుర్తింపును నేను ఎందుకు దాచుకోవాలి?!’ అని ప్రశ్నిస్తున్న ఈ అమ్మాయి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

‘‘మేడమ్‌ సాహెబ్‌’ కావాలని నా చిన్ననాటి నుంచి నాతో పెరిగిన కల. పరగాణాలోని చిన్నూరు మాది. మా నాన్న రోజు కూలీ. అమ్మ గృహిణి. మాకంటూ సెంటు భూమి లేదు. ఉన్నదల్లా తలదాచుకునేందుకు చిన్న ఇల్లు. మా ఊళ్లో ఆడపిల్లలు చదువుకోవడానికి బడికి వెళ్లరు. కానీ, నాకు చదువుకోవాలని ఉండేది. నేను మేడమ్‌ సాహెబ్‌గా ఎదగాలని కలలు కంటూ, పుస్తకాలనే ఎక్కువ ఇష్టపడేదాన్ని.

ఇదే విషయాన్ని మా అమ్మానాన్నలతో చెబితే వాళ్లూ ‘సరే’ అన్నారు. ఊళ్లో చాలా మంది వ్యతిరేకించారు అమ్మాయిలకు చదువెందుకని. కానీ, వాళ్లతో గొడవపడి మరీ నన్ను స్కూల్లో చేర్పించారు నాన్న. నాకు చదువు మీద ఉన్న ఇష్టం చూసి, ఇంటి పనిలో కూడా సాయం చేయమని అడిగేది కాదు అమ్మ. అప్పుడప్పుడు మా ఊరి వాళ్లు కొందరు వెక్కిరించినా వాటిని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు.

నొప్పి ఉంది, ప్రాణం లేదు
పద్నాలుగేళ్ల వయసు. పదవతరగతిలోకి అడుగు పెట్టాను. నేనూ, మా స్నేహితురాలు కలిసి ఇంటికి తిరిగి వస్తున్నాము. చాలా ఎండ, గొంతెండుకుపోతోంది. దారిలో ఒకరి దగ్గర నీళ్లు ఉంటే అడిగి, తీసుకొని తాగాం. ఆ తర్వాత ఇంటివైపు బయల్దేరాం. కొంచెం దూరం నడిచాక అడుగులు తడబడటం మొదలెట్టాయి. తల అంతా తిరుగుతున్నట్టు అనిపించింది... కళ్లు తెరిచి చూసేసరికి నేనూ, నా ఫ్రెండ్‌ రైలులో ఉన్నాం. ఒళ్లంతా విపరీతమైన నొప్పి. కూర్చోవడానికి ఒళ్లు సహకరించడం లేదు.

మా దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మా పరిస్థితి చూశాక మేమెలాంటి దారుణానికి గురయ్యామో కొంత మేరకు అర్థమయ్యింది. అక్కడ మమ్మల్ని ఇంకెవరికో అమ్మేందుకు తీసుకువెళుతున్నారని, ఇప్పటికే రెండుసార్లు అమ్ముడు పోయామన్న మాటలు విన్నాం. ఒకరినొకరం చూసుకున్నాం. చైన్‌ లాగితే రైలు ఆగింది. వెంటనే, రైల్వే పోలీసులు వచ్చారు. తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి మానవ అక్రమరవాణాపై వర్క్‌షాప్‌కి హాజరయ్యాం. అందుకే, మాకు వెంటనే రైలును ఆపాలనే ఆలోచన వచ్చింది. విచారణ తర్వాత మేం ఇంటికి వచ్చాం.

అవగాహనే ప్రధానం
ఇవన్నీ మా ఇంట్లో... నా ఒంట్లో ఒకలాంటి నిస్తేజాన్ని నింపాయి. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లాను. నాకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో తిరిగి స్కూల్‌కి వెళ్లి, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని నిరూపించాను. దీని తర్వాత బంధన్‌ ముక్తి, ఇల్ఫత్‌లో చేరాను. అక్కడ, మానవ అక్రమ రవాణా, పిల్లల అక్రమ రవాణా, అత్యాచార ఘటనలలో ప్రాణాలతో బయటపడిన అమ్మాయిలను చాలా దారుణమైన స్థితిలో చూశాను.

వారి గురించి ఆలోచిస్తే నా వెన్నులో వణుకు వచ్చేస్తుంది. నేను తప్పించుకున్నది అదృష్టంగా భావించాను. నాలా మరే ఆడపిల్లా ఆ నరకంలోకి చిక్కుకోకుండా ఉండేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి మానవ అక్రమ రవాణా గురించి బాలికలకు అవగాహన కల్పిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడా ఏ అమ్మాయీ మానవ అక్రమ రవాణాకు గురికాకూడదు. ఇదే ఆలోచనతో నా లక్ష్యం వైపుగా సాగుతున్నాను.

సంస్కృతం ప్రధాన సబ్జెక్ట్‌గా బి.ఎ. పూర్తిచేశాను. ఇప్పుడు ఎం.ఎ. చేయాలనుకుంటున్నాను. సొంతంగా హ్యాండ్‌మేడ్‌ ఆభరణాలను తయారు చేస్తుంటాను. పెయింటింగ్స్‌ వేస్తుంటాను. పర్వతారోహణ చేయాలన్నది నా మరో కల. ఎల్తైన శిఖరం అంచున నిలబడి, చేతులు చాచి అక్కడి గాలిని ఆస్వాదించాలి. అందుకు కూడా అడుగులు వేస్తున్నాను’’ అని చెబుతున్న రేపటి ఈ ఆశాజ్యోతి ఆశయాలు నెరవేరాలని ఆశిద్దాం.
 
అంతటా దూరం దూరం..
స్కూల్‌కు రావద్దని అక్కడి టీచర్లు చెప్పేశారు. ఏడుస్తూ ఇంటికి వస్తే మా అమ్మానాన్నలు దీనస్థితిలో ఉన్నారు. ఊళ్లో అంతా ‘చదువుకునే అమ్మాయిలు పారిపోతారు’ అంటూ మమ్మల్ని నీచ పదాలతో తిట్టారు. కలెక్టివ్‌ గ్రూప్‌ సాయంతో స్కూల్లో చదువుకోవడానికి అనుమతి లభించింది. అయితే, అక్కడి టీచర్లు మాతో సరిగా ప్రవర్తించలేదు. ఇతర పిల్లలతో కలిసి కూర్చోనివ్వలేదు. మొదటి సీట్లో కూర్చొనేదాన్ని, చివర సీట్‌లోకి పంపించారు. ఇక ఇతర పిల్లల తల్లిదండ్రులు ‘మా అబ్బాయిలకు దూరంగా ఉండాలి. అయినా, చదువుకుని ఏం చేస్తావు, చేసేది అదే వ్యాపారం కదా!’ అని హేళనగా మాట్లాడేవారు.

మరిన్ని వార్తలు