Viral: 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా! ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. వీడియో వైరల్‌

17 Jan, 2023 11:12 IST|Sakshi
PC: Captain Krutadnya Instagram

తండ్రీ... నీ ఆశీర్వాదం

కూతురు పైలెట్‌.. తండ్రి ప్రయాణికుడు. మరి కాసేపట్లో విమానం గాల్లో ఎగరాలి. కూతురు కాక్‌పిట్‌ నుంచి బయటికొచ్చి తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. తండ్రి ఆనందంతో తబ్బిబ్బు అయ్యాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మరిచి నేను ఏ పనీ చేయను అంటున్న భారతీయ పైలెట్‌ కృతద్న్యా సోషల్‌ మీడియాలో మెటికలు విరిచే ఆశీర్వాదం పొందుతోంది.

‘ఈ రోజు కోసం నేను 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ఇన్‌స్టాలో రాసుకుంది పైలెట్‌ కృతద్న్యా హాలె తన తండ్రితో పాటు ఉన్న తన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.
‘నేను పైలెట్‌ అవ్వాలని కలలు కంటున్నప్పుడు మా నాన్న తప్ప ఎవరూ నా మీద విశ్వాసం ఉంచలేదు. నా కెరీర్‌ మొదలెట్టి 13 ఏళ్లు అయింది. ఇవాళ మా నాన్నను ఆకాశం మీదుగా గమ్యాన్ని చేర్చే అవకాశం వచ్చింది’ అని కూడా రాసుకుంది కృతద్న్యా.

ముంబై నుంచి స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌కి ఎయిర్‌బస్‌ 320 తరచూ నడిపే కృతద్న్యా తన తండ్రిని బహుశా స్వదేశం తీసుకు వస్తూనో లేదా స్పెయిన్‌ తీసుకువెళుతూనో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. విమానం ఎగిరే ముందు కాక్‌పిట్‌ నుంచి బయటకు వచ్చి పాసింజర్‌ సీట్‌లో కూచుని ఉన్న తండ్రి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ఆయన్ను హత్తుకుంది. తబ్బిబ్బవుతూ తండ్రి ఆమెను ఆశీర్వదించాడు.

ఆ వీడియోను కృతద్న్యా పోస్ట్‌ చేస్తూ ‘తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా నేను ఏ పని చేయను. ఒక్కోసారి డ్యూటీకి నేను తెల్లవారుజాము మూడుకో నాలుక్కో ఇంటి నుంచి బయట పడాల్సి వచ్చినా నా తల్లిదండ్రులు గాఢనిద్రలో ఉన్నా వారి పాదాలు తాకి వెళ్లడం అలవాటు’ అని రాసింది.

ఈ వీడియోను ఆమె పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే దానికి దాదాపు ఐదు లక్షల లైకులు వచ్చాయి. ఇన్‌స్టాలో చాలామంది నెటిజన్లు ఉద్వేగానికి లోనయ్యారు. ‘నిన్ను, మీ నాన్నను చూసి కన్నీరు ఆగడం లేదు’ అని ఒకరు రాస్తే ‘ఇది అసలు సిసలు భారతీయ సంస్కృతి’ అని మరొకరు రాశారు. ‘నీలాంటి అమ్మాయిలే మాకు రోజూ స్ఫూర్తినిస్తున్నారు’ అని మరొక మహిళ కామెంట్‌ చేసింది.

భారతీయ కుటుంబాల్లో తండ్రీ కూతురు అనుబంధం ప్రత్యేకమైనది. కొందరు కూతుళ్లు అమ్మ కూచిలుగా కాకుండా నాన్న బిడ్డలుగా ఉంటారు. నాన్నతో క్లోజ్‌గా ఉంటారు. నాన్నలు వారి కోసం ప్రాణం పెడతారు.  కృతద్న్యా, ఆమె తండ్రిలో అలాంటి తండ్రీ కూతుళ్లు తమను తాము పోల్చుకోవడంతో ప్రస్తుతం ఈ వీడియో యమా వైరల్‌గా మారింది.

చదవండి: Unpaid Care Work: వేతనం లేని పనికి.. గుర్తింపు ఉండదా?!
Priyadarshini Karve: పొగరహిత కుక్కర్‌ తో.. పొగకు పొగ పెట్టవచ్చు!
  

A post shared by Capt. Krutadnya Hale✈️ (@pilot_krutadnya)

మరిన్ని వార్తలు