వైరల్‌ ప్రధాని మెచ్చారు!

24 Jul, 2022 05:57 IST|Sakshi

జాతీయోద్యమ కాలంలో పాట చూపించిన ప్రభావం తక్కువేమీ కాదు. ఊరూరు తిరిగింది... ఉర్రూతలూగించింది. అణువణువులో దేశభక్తి నింపుకొని కదం తొక్కింది.... పాట బలమైన ఆయుధం అయింది. అలాంటి తమిళ దేశభక్తి గీతం ఒకటి ఇప్పుడు సామాజిక వేదికలలో వైరల్‌ అయింది. ‘అద్భుతం’ అనిపించిన ఆ పాటను ఆలపించింది తమిళులు కాదు... అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు...

అశప్‌మై, కుమారి బెహల్టీలు స్వాతంత్య్ర సమరయోధుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన తమిళ దేశభక్తి గేయం ‘పారుక్కుళ్లే నల్ల నాళ్‌ ఎంగళ్‌ భారతినాడు’ను ఆలపించారు. ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మొదటిసారి ఈ వీడియోను అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ప్రశంసావాక్యాలు రాశారు.

24 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో స్పందించారు.
‘ఈ వీడియోను చూసి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఈ షైనింగ్‌ స్టార్స్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణాచల్‌ సిస్టర్స్‌ గొంతులో వినిపించిన తమిళదేశభక్తి గీతం ఏక్‌ భారత్, శ్రేష్ఠభారత్‌ స్ఫూర్తిని చాటుతుంది’ అని ట్వీట్‌ చేశారు ప్రధాని.

ఇక సోషల్‌ మీడియా ‘కామెంట్‌ సెక్షన్‌’లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రశంసలు వచ్చాయి.
‘అచ్చం తమిళ సిస్టర్స్‌ పాడినట్లుగానే ఉంది’ అని ఎంతోమంది అరుణాచల్‌ ప్రదేశ్‌ సిస్టర్స్‌ను ఆకాశానికెత్తారు. ‘మా అమ్మాయిలు కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లోని గొప్పదేశభక్తి పాటలు పాడడానికి సిద్ధం అవుతున్నారు’ అని ఒక తమిళియన్‌ కామెంట్‌ పెట్టాడు.
‘మన దేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో దేశభక్తి గీతాలు ఉన్నాయి. అవి ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై పోకుండా, అందరికీ సుపరిచితమై పోవాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి’ అని ఒకరు స్పందించారు.
మంచిదే కదా!

మరిన్ని వార్తలు