వ్యతిరేకాల మధ్య..

5 Sep, 2021 15:11 IST|Sakshi

కాలరేఖపైన 
ఒకేసారి పుడతాయి
అందిపుచ్చుకుని
పడేగొట్టేయాలి అనేది
అందక
సాగిపోతూనే ఉండాలి 
అనుకునేది

నువ్వు మొదలుపెట్టని 
గమనం వెంటపడి 
పోతూ ఉన్నప్పుడు
ఏ ఆదమరచిన క్షణంలోనో
ఒక్కసారిగా ఎదురై 
వాటేసుకుంటుంది
ఎక్కడివక్కడే ఉంటాయి
సర్దుకోవటం అప్పగించటాలు
ఉండవు
నీవి అయినవీ కానివీ
చూస్తూ ఉండిపోతాయి
దాగుడుమూతలు అంతం

దొరికావు
నేనే గెలిచానంటూ
ఒకటి
ఇంతకాలం 
నీకు అందకుండా 
తిరగటంలో కష్టం
నీకు అర్థం కాదు
గెలిచింది నేనేనంటూ
మరొకటి
కాలంలో కలిసిపోతాయి

వ్యతిరేకాల మధ్య
ఎడతెగని దేవులాట
నీ ప్రమేయంలేని
ఎగిరిపోవటం వరకు    

-కళ్ళేపల్లి తిరుమలరావు 

వర్ష ఋతువులో...
కొన్ని ప్రకృతి వరాలు
పరవశింప జేస్తుంటయ్‌

చిటపట మంటూ చినుకులు
ఇంటి రేకులపై సరిగమల సవ్వడైతది
వసారా మీదుగా నీటి బొట్లై
రాలుతున్న దృశ్యం
మనసున ముత్యాల ముగ్గుల్ని పరుస్తది
పచ్చని ఆకుల మధ్య తచ్చాడుతున్న
నీటి బిందువులు
వెండి వెలుగుల చుక్కలై మెరుస్తుంటయ్‌

ఆట పాటల బాల్యానికి
వర్షం ఓ ఆలంబనైన జ్ఞాపకం
గగనాన నీలిమేఘాలు అలముకుని
చల్లని చిరు జల్లుల్ని చల్లితేచాలు
ఇప్పటికీ మేడ మీదుంచి
దేహం రెక్కలు కట్టుకుని దూకుద్ది

అరటాకులే గొడుగులైన అడుగులు
కాగితప్పడవల్లే కదలాడిన బుడుగులు
వర్ష ఋతువు హర్ష స్మృతులు

వరదలతో ఊరంతా ఉప్పొంగినా
చింతచెట్టు కింద ముసలవ్వ కాల్చిన
మొక్కజొన్న పొత్తులు తింటూ
బషీర్‌ భాయ్‌ ఇచ్చిన గరమ్‌ చాయ్‌ తాగుతూ..
దోస్తులతో చేసే కమ్మని కబుర్లు
మనసున మల్లెలై గుబాళించేవి

సూరన్న రవ్వంత తొంగిచూసినా..
ఠక్కున ఆకాశంలో
పొడుసుకొచ్చిన ఇంద్రధనస్సు
ఆనందాన్ని మోసుకొచ్చిన ఉషస్సయ్యేది
ఏరువాక సాగుతో పల్లెంతా పడుచు పిల్లయ్యేది
హరిత హారాన్ని కప్పుకున్న అడవంతా
కవి కుంచె గీసిన అక్షర చిత్రమయ్యేది..!
-డా.కటుకోఝ్వల రమేష్‌ 

మేలిమి పద్యం
అరుణకిరణుండు తూర్పున నవతరింప
ప్రాణిలోకమ్ము మాంద్యమ్ము బాసె; నింక
నింటనుండుట మర్యాదయే కుమార?
చలిదిచిక్కంబు కట్టుము పొలము జేర.
(దువ్వూరి రామిరెడ్డి ‘కృషీవలుడు’ నుంచి)


ఒకడు స్వప్న ప్రకారము నుగ్గడింప
ఎల్ల వారలకు గలదె తెల్లవార్లు?
నవ్వుదురను తలంపు లేదెవ్వరికిని
పేరు కొననేమిటికి నట్టి బీదకవుల?
(రామకృష్ణ కవుల ‘ఆంధ్ర కవుల అపరాధములు’ నుంచి)


దూరాలోచన బుద్ధి న
పారముగా నొసగెనేని పని పాటులు వి
స్తారముగ పాడు చేయుట
సారమతుల్‌ మానవలయు చదరంగబున్‌!
(ఒక అవధానంలో ‘కవిగారు’ మారేపల్లి రామచంద్రశాస్త్రి)


రాళ్లపల్లిలోన రాళ్లెన్ని పుట్టెనో
రాళ్లలోన వజ్జరాలు పుట్టె
వజ్జరాలలోన వలపెట్టు పుట్టెరా?
కీర్తినీయ చరిత! కృష్ణశర్మ!
(రాళ్లపల్లి అనంతకృష్ణశర్మపై డాక్టర్‌ చిలుకూరు నారాయణరావు ప్రశంస)
 

మరిన్ని వార్తలు