పచ్చ నెత్తుటి మరక...  

22 Aug, 2021 11:25 IST|Sakshi

వూరు చేరాలంటే
ముందు నిన్నే ముద్దాడాలి!
చూట్టానికి జుట్టంతా విరబోసుకున్న రాకాసిలానే కనిపిస్తావ్‌ కానీ
నువ్వో నిశ్చల తాపసివి!
నా గురించో... వూరి గురించో...
శివసత్తిలా సిగమూగుతూ
అందమైన తలపోతేదో చేస్తూనే వుంటావ్‌–
నువ్విప్పుడు జ్ఞాపకమయ్యేంతలా వలసపోయాను కానీ
వేలాడి వూగిన వూడల జాడలు
ఈ నా మునివేళ్లకి తగుల్తూనే వుంటాయ్, నేనే చోటున్నా సరే!

పొలిమేర ఖిల్లాలా వుంటావ్‌
యెన్నెన్ని శకలాలో నీలో...
వూయలూగిన బాల్యాన్ని దోసిట్లోకి నింపుకునేంతగా–
దూపగొన్న గొంతు...
మర్రితాడు రుచిని మర్రాకులోకి వొంపుకుంటే చాలు;
దిగులు ముంతను బొట్టు బొట్టుగా దింపుకోవచ్చు.
ఆకు ఆకులో లాలించే పచ్చ సముద్రమే వుంది;
గుండెల్లోకి తోడుకునేంత తావే లేదు కాకపోతే!
దేన్నీ యెదగనీయవనే అపనింద మోస్తూనే...
యెండా... వానా...
గొడుగై కాసిన లోగిట్లోంచి డొప్పలిచ్చింది నాకే కాదు; వూరు వూరంతటికీ.
కాయో...
పండో...
పువ్వో... కాదు,
పచ్చని కంచమై...
పండగ్గానో? పబ్బంగానో? పత్ర సందేశంగా వచ్చేస్తావ్‌ కదా!
చివరికి చిరిగిన విస్తరాకై...
యే చిరునామాకూ చిక్కకుండా తప్పిపోతావ్‌!
అచ్చంగా నాలోని నేను తప్పిపోయినట్టు!!

వేలి కొసల్లో ఎడార్లు మొలిచాక...
ప్రతీ చదరపు అడుగూ లెక్కలోకొస్తుంది;
ప్రతీ క్షణం... డాలర్‌ డేగై యెగిరొచ్చి ఎడం భుజమ్మీద వాలాక...
విధ్వంసక ప్రగతి నమూనా విసిరి పారేస్తుంది నిన్ను
పెనుగులాడిన వూడలతో సహా!

పూదోటలు...
మియావాకీలు...
కొత్తగా యేం అలికినా...
తులసికోట లేని ముంగిల్లా...
వూరి గుమ్మం బోసిపోయింది.
కూలదోసిన పచ్చ గుడారం  జ్ఞాపకాలు మాత్రం...
ఉరితాళ్ళలా వేలాడుతున్నాయ్‌!
-బోగ బాలసుబ్రహ్మణ్యం

► వంతెన పైన
నేను నడుస్తుంటాను
వంతెన మీద ఏకాంతంగా
ఎటూతేల్చుకోలేని సందేహాలతో. 

ఎవరూ ఏంచెప్పొద్దు. 
వంతెన దాటేముందు
నా అవయవాలన్నీ అదృశ్యమై
మెదడు మాత్రమే జీవించివుంటుంది. 

నేనెవరికీ గుర్తుండను. 
దూరంగా రైలు సైరను వినిపిస్తుంది. 
పిచ్చిగా నగరంవైపే చూస్తుంటాను. 

నా ముఖం లోని మడతలు
ఎన్నో కథలు చెప్పే వుంటాయి. 
చాలా దూరం వచ్చేశాను. 
నాకు నేను అర్థం కాకుండా! 

క్షమించు! 
నేను నిన్ను హత్తుకోవాలి. 
ఈ మాయా నిశ్శబ్దాన్ని ఛేదించాలి. 
కొత్త రుచుల వెతుకులాటలో
సమస్త అడవులగుండా, 
మైదానాల మీదుగా ప్రయాణిద్దాం. 
అక్కడ రెండు గ్లాసులు 
మనల్ని ఆహ్వానిస్తున్నాయ్‌. 
ఎర్రజీరల గద్ద కళ్లతో! 
-ఏటూరి నాగేంద్రరావు 

► మేలిమి పద్యం

నిను వేగించును నిత్యదుఃఖమను వహ్నీజ్వాల, తతాతపసం
జనితంబైన మహానుభూతి యొక డాచ్ఛాదంబుగా నీవు సా
గిన త్రోవల్‌ జగతీ చరిత్రగతి సాగెన్‌ క్రొత్త యధ్యాయమై
మును లేకున్నది, నేడు రాని దొక డొప్పున్‌ నీ మహాలక్ష్యమై!
(కుందుర్తి ‘వీథిమానిసి’ ఖండిక నుంచి)

ఏడులోకాల కనుసన్న నేలువాడు
ఇరుకు చీకటిగుడిలోన మరిగినాడు
నాకు లేనట్టి దేవుడు లోకములకు
లేడు, లేడింక, పిలిచినా, రాడు రాడు.
(శంకరంబాడి సుందరాచారి ‘నైవేద్యము’ నుంచి)
రేయినలసిన కనులకు రెప్పవేసి
లోకచిత్రంబు మూయగల్గుదునె గాని,
లోన చెలరేగు నల్లకల్లోలమునకు 
కనులుమూసి నిద్రింపజాలను క్షణంబు.
(పాలగుమ్మి పద్మరాజు ‘లోన – బయట’ ఖండిక నుంచి)

పేదల రక్తమాంసముల బెంపు వహించి దయా సుధా రసా
స్వాద దరిద్రులైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతో
న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతి బొమ్మలం
దూదరపోవు పాడు బ్రదుకొక్క నిమేషము సైప నాయెదన్‌!
(వేదుల సత్యనారాయణశాస్త్రి ‘కాంక్ష’ ఖండిక నుంచి)

మరిన్ని వార్తలు