రేయ్‌!.. మళ్లీ రారూ?

1 Aug, 2021 12:59 IST|Sakshi

ఎన్నెన్నో సాయంత్రాలలో
ఓ ప్రశాంత మైదానంలో
మరెన్నో మధుర తీరాలలో

పొద్దుగూకే వేళలో
గూటికి చేరే పక్షుల్లా
మా ప్రియ నేస్తాలంతా
అక్కడ వాలిపోయే వాళ్ళం

విహంగాల్లాంటి మా ప్రియమిత్రులకి
ఆ అందమైన మలిసంధ్యలే
తొలిసంధ్యల్లా నులివెచ్చని
గూడయ్యేది

ఎన్నెన్నో కమ్మని కబుర్లతో
మరెన్నో తియ్యని కలహాలతో

హాస్య గుళికలు చప్పరిస్తూ
మధుర జ్ఞాపకాల్ని నెమరేస్తూ
చిలిపితనాలు వెల్లడిస్తూ
వలపు వన్నెలు వల్లెవేస్తూ
తుంటరి చేష్టలు ప్రదర్శిస్తూ

అన్ని గుండెలు ఒకే గుండెగా
మైదానమే ఓ గూడుగా అల్లుకుని

రక్తబంధంకన్నా మిన్నగా
అరమరికలులేని హృదయాలతో
స్నేహామృతం పంచుకుని

వినువీధికెగసి
తారలతో తోరణాలు కూర్చి
ఒక మనసుపై మరొక మనసు
మాలలుగా అలంకరించుకుని
అమరలోకపు ఆనందాలు
ఆ మైదానంలోనే పొంది

ప్రతీ సాయంత్రం వేడుకగా
మరి కొన్నిరాత్రులు తిరునాళ్ళగా

గ్రీష్మమైనా శరదృతువులోనైనా
శీతలమైనా శిశిరంలోనైనా
ఏ కాలమైనా
కొంగ్రొత్తగా స్నేహం చిగురులు తొడిగే
నిత్యవాసంతమే ఆ మా ప్రియవిహంగాలకి

కన్నులనిండుగా కలలు నింపుకుని
రంగురంగుల మాటల తేనెలు ఒంపుకుని

ఒకరిలో ఒకరిగా పదుగురం ఒక్కరిగా
ఒంటరితనాన్ని గాలిలో విసరి
తియ్యని స్నేహాల్ని ఊపిరి చేసుకుని
గుండెలనిండా ప్రాణం పోసుకుని
ఐక్యమై మమేకమై

రెక్కలు రెప రెపలాడిస్తూ
రివ్వురివ్వున సాగిపోయిన
ఆనాటి మా అపూర్వ స్నేహ విహంగాలకి
ఆరోజులు ప్రతీరోజూ
ఉగాదులే సంకురాతురులే
శివరాత్రి దసరా దీపావళి పండుగలే
నిండుపున్నములే
హర్షించే వర్షపు జల్లులే
మెరిసేటి మెరుపులే
ఉరికేటి సెలయేళ్లే

మళ్లీ రావాలి ఆ వసంతం
కొత్త మోసులు మొలవాలి
ఆ పాత మధుర ఫలాలు
మళ్లీ మళ్లీ పండాలి

వలస పక్షుల్లా
పుట్టకొకరు చెట్టుకొకరు దిక్కుకొకరు
వెళ్లిపోయిన మేం
తిరిగి ఆ మైదాన తీరం గూటికి చేరాలి
కమ్మటి ఆనాటి ఊసులు పంచుకోవాలి
నిస్వార్థంగా గుండె గుండెలు పెనవేసుకోవాలి

తరలి రావాలని ఎదురు చూస్తున్నా
మళ్లీ ఆ వసంతం
మరలి పోకుండా
గుండెలు చెదరిపోకుండా
ఉండటానికి
రేయ్‌ ....
అందరూ మళ్లీ రారూ !!?
-నాగముని. యం. 

అగణితం

చుక్కల చెమరింతలెన్ని చూసిందో,
పాలపుంతల గిలిగింతలకెంత మురిసిందో.
క్షణాలే ఉచ్ఛ్వాసము
క్షణాలే నిశ్వాసము
కాలం
విశ్వానికి ఎడతెరపి లేని ఊపిరి.

కొనసాగడమే తెలిసిన కాలాన్ని
పెండ్యూలం అడుగులతో కొలవడం దేనికి
వింత కదూ!
అగణితమైనది అంకగణితానికి లొంగిపోతుందా?

అస్తమానం పగలు, రాత్రి అనడం దేనికి
పగలు కళ్లు మూసుకున్నా చీకటే
రాత్రి కళ్లు తెరిచినా ఒక్కటే.

సమయాన్ని
ఉదయాస్తమయ ఛాయల్లో చూడటం దేనికి
వివేచన రగిలించని వేళ వాలిపోతేనేమి?
హృదయాంతరాళాన్ని స్పృశించని క్షణాలు గడిస్తేనేమి?

క్షణం తీరిక లేక సాగే కాలం
దివారాత్రులను దివాలా తీస్తుంది.
ఎక్కడ తడుతుందో
ఎప్పుడు కుడుతుందో
కాలం
కనిపించక పాకే వేయికాళ్ళ జెర్రి.
-కుడికాల వంశీధర్‌ 

మరిన్ని వార్తలు