కానిస్టేబుల్‌ థెరిసా.. రెహానా!

13 Jun, 2021 05:23 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభంలో మహారాష్ట్ర, దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకుల్లా వణికిపోవడంతో.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, ఆపదలో సాయం అడిగిన ప్రతి ఒక్కరికి సాయమందించి ‘అభినవ మదర్‌ థెరిసా’ గా గుర్తింపు తెచ్చుకున్నారు ముంబైకి చెందిన పోలీసు కానిస్టేబుల్‌ రెహానా షేక్‌. విపత్కర పరిస్థితులో తనని సాయం అడిగిన వారందరికి రెహానా ఆక్సిజన్, ప్లాస్మా, బ్లడ్, బెడ్స్‌ ఏది కావాంటే అది ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించారు. దీంతో రెహానా భర్త, తన తోటి ఉద్యోగులు, తెలిసిన వారు మదర్‌ థెరిసాగానేగాక ఆమెను మంచి సామాజిక కార్యకర్తగా పిలుస్తున్నారు. కరోనా సమయంలో మానవత్వం తో వ్యవహరించిన రెహానాను పోలీసు కమిషనర్‌ ఎక్స్‌లెన్స్‌ సర్టిఫికెట్‌తో సత్కరించారు. అంతేగాక అందరు పిలుస్తున్నట్లుగానే మదర్‌ థెరిసా అవార్డు వరించడం విశేషం.

మదర్‌ థెరిసాగా..
2000 సంవత్సరంలో ముంబై పోలీసు కానిస్టేబుల్‌గా బాధ్యతలు చేపట్టిన రెహానా మంచి వాలీబాల్‌ ప్లేయర్, అథ్లెట్‌ కూడా. 2017లో శ్రీలంకలో జరిగిన పోటీల్లో ఆమె రజత, స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. ఆటలు, డ్యూటీలో చురుకుగా ఉండే రెహానా సామాజిక సేవలోనూ ముందుంటారు. ఈ క్రమంలోనే గతేడాది మే 13న తన కూతురు పదహారో పుట్టినరోజు సందర్భంగా రాజ్‌గఢ్‌ లోని వాజే తాలుకాలో ఉన్న డయానై సెకండరీ స్కూల్‌ సందర్శించి అక్కడ చదువుతోన్న విద్యార్థులకు స్వీట్లు పంచారు. ఆ సమయంలో స్కూలు ప్రిన్స్‌పాల్‌తో మాట్లాడిన ఆమె.. స్కూల్లో చదువుతోన్న ఎక్కువమంది విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారిలో కొందరికి కనీసం కాళ్లకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవని తెలుసుకున్నారు. దీంతో తన కూతురి పుట్టిన రోజుకోసం ఖర్చు చేద్దామని కేటాయించిన డబ్బులు, ఈద్‌ కోసం ఖర్చుచేసే మొత్తం డబ్బులను స్కూలు పిల్లలకోసం ఇచ్చేశారు. అంతేగాక యాభై మంది పిల్లలను పదోతరగతి వరకు చదివిస్తానని మాట ఇచ్చారు. కోవిడ్‌ సమయంలో ఆసుపత్రిలో బెడ్ల ఏర్పాటు, ప్లాస్మా, రక్త దానం, ఆక్సిజన్‌ సరఫరా చేసి 54 మందిని ఆదుకున్నారు. దీంతో ఆమె మంచి సామాజిక వేత్తగా గుర్తింపు పొందారు.

తోటి ఉద్యోగులకుసైతం..
తన తోటి కానిస్టేబుల్‌ తల్లికి ఇంజెక్షన్‌ దొరకక ఇబ్బంది పడుతున్నారని తెలిసి.. పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి సంబంధిత ఇంజెక్షన్‌ ఎక్కడ దొరుకుతుందో తెలిసేంత వరకు కాల్స్‌ చేసి ఇంజెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇది తెలిసిన పోలీసు యంత్రాంగంలోని కొంతమంది బ్లడ్, ప్లాస్మా, ఆసుపత్రిలో తమ బంధువులకు బెడ్‌లు కావాలని అడగడంతో ఆమె బ్లడ్‌ డోనార్స్‌  వాట్సాప్‌ గ్రూపుల్లో చేరి రక్తదాతలకు మెస్సేజులు చేసి కావాల్సిన బ్లడ్‌ను ఏర్పాటు చేశారు. అంతేగాక క్యాన్సర్‌ రోగులకు అవసరమైన సాయం చేస్తున్నారు. ఉద్యోగంతోపాటు తోటి వారి సమస్యలు తీర్చే రెహానా లాంటి వారు అరుదుగా కనిపిస్తారు.  

మరిన్ని వార్తలు