వామ్మో.. విదేశీ విత్తన ప్యాకెట్లు!

11 Aug, 2020 08:36 IST|Sakshi

అమెరికా, కెనడా, బ్రిటన్‌ తదితర దేశాల్లో ‘చైనా’ అనుమానాస్పద విత్తనాల కలకలం 

కరోనా విపత్తుతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్న తరుణంలో విదేశాల నుంచి అవాంఛిత విత్తనాల ప్యాకెట్లు అడగకుండానే పౌరుల పేరు మీద వేలాదిగా పోస్టులో రావటం అమెరికా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ తదితర ఐరోపా దేశాల్లో ఇటీవల పెను సంచలనాన్ని కలిగించింది. వ్యవసాయక జీవవైవిధ్యానికి, ఆహార భద్రతకు పెనుముప్పు కలిగించే దురుద్దేశంతోనే చైనా ఈ ‘విత్తన బాంబుల’ను విసురుతున్నదని సర్వత్రా ఆందోళన నెలకొంది. 

అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు ఎవరి పేరు మీద వచ్చినా ఆ విత్తనాలను ముట్టుకోవద్దని, పొలంలో, పెరట్లో, కుండీల్లో ఎక్కడా కూడా వాటిని మట్టిలో నాటవద్దని, ఇటువంటి విదేశీ విత్తన ప్యాకెట్లు ఎవరికైనా అందితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయా దేశాల ప్రభుత్వాలు పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. చైనా ఈ ఆరోపణలను ఖండించింది. అయితే, కోరని వ్యక్తులకు పోస్టు/కొరియర్‌ ద్వారా విదేశాల నుంచి వస్తున్న ఈ విత్తన ప్యాకెట్లపై చైనా పేరు ముద్రించి ఉండటంతో చైనా దేశం నుంచే దురుద్దేశంతోనే రకరకాల రంగుల్లో, రకరకాల పంటల విత్తనాలను పంపుతున్నట్లు భావిస్తున్నారు. 

భారత వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కూడా ఇటువంటి హెచ్చరికే చేసింది. అనుమానాస్పద విత్తనాలు విషపూరితమైనవి అయి ఉండొచ్చని.. వైరస్‌లు, బ్యాక్టీరియా వ్యాధులతో అనేక పంటలకు పెనునష్టం కలిగించేవి అయి ఉండొచ్చని.. భయంకరమైన కలుపు జాతి మొక్కల విత్తనాలు కూడా ఇందులో ఉండొచ్చని హెచ్చరించింది. వీటి ద్వారా వ్యవసాయ పర్యావరణానికి, జాతి భద్రతకు ముప్పు కలగొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ హెచ్చరించింది. ఇటువంటి విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, విత్తనాభివృద్ధి సంస్థలు, పరిశోధనా సంస్థలకు కేంద్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డా. దిలిప్‌ కుమార్‌ శ్రీవాస్తవ లేఖ రాశారు. మన దేశంలో ఎవరికీ అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు వచ్చినట్లు ఇప్పటికైతే సమాచారం లేదు.   

దేశ జీవ భద్రతకు, ఆహార భద్రతకు ముప్పు
విదేశాల నుంచి పరిశోధనల నిమిత్తం విత్తనాలను, మొక్కలను తెప్పించుకోవడానికి ప్రత్యేకమైన క్వారంటెయిన్‌ వ్యవస్థ ఉంది. అయినా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, సరిహద్దుల దగ్గర అధికారుల కన్నుగప్పి కొన్ని విత్తనాలు, మొక్కలు మన దేశంలోకి వస్తూనే ఉన్నాయి. అమెరికా నుంచి అలా వచ్చిన వర్తులాకార తెల్లదోమ కొబ్బరి, పామాయిల్‌ వంటి ఉద్యాన తోటలను గత మూడేళ్లుగా అల్లాడిస్తున్న సంగతి జ్జాపకం పెట్టుకోవాలి. అయితే, విదేశాల్లో కంటికి నచ్చాయని పెరట్లో పెంచుకుందామన్న ఆసక్తి కొద్దీ ఒకటీ అరా అయినా సరే విదేశీ విత్తనాలను మన దేశానికి తెస్తున్న / తెప్పించుకుంటున్న వారు లేకపోలేదు. తెలిసీ తెలియక చేసే ఇటువంటి పని ఎంత ప్రమాదకరమో ఇప్పటికైనా తాము దేశ జీవ భద్రతకు, ఆహార భద్రతకు ముప్పు తెచ్చి పెడుతున్నారని గుర్తించాలని అధికారులు హెచ్చస్తున్నారు. 

పోలీసులకు ఫిర్యాదు చేయండి: డా.కేశవులు
అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం(ఐఎస్‌టిఎ) ఉపాధ్యక్షులు, తెలంగాణ విత్తనోత్పత్తి – ఆర్గానిక్‌ ధృవీకరణ సంస్థ సంచాలకులు డాక్టర్‌ కేశవులు ఈ విషయమై ముందుగా స్పందించి, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. విత్తనంతో పాటు విదేశాల నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రమాదకరమైన చీడపీడలు మన దేశ జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో విత్తన క్వారంటెయిన్‌ యంత్రాంగం మరింత జాగరూకత వహించాలని ఆయన సూచించారు. 

ఎవరికైనా అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు అందితే వెంటనే దగ్గరలోని వ్యవసా, పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లక్షలాది ఎకరాల్లో అనేక రాష్ట్రాల్లో నిషిద్ధ కలుపు మందును తట్టుకునే పత్తి విత్తనాలు అక్రమంగా సాగవుతున్న మన దేశంలో ఇలాంటి అవాంఛనీయ విత్తనాలను అరికట్టడం సాధ్యమేనా అన్న సందేహాలకు తావు లేదని, ప్రభుత్వం పటిష్ట నియంత్రణ చర్యలు తీసుకుంటున్నదని ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖిలో డా. కేశవులు అన్నారు. దశాబ్దాల క్రితం గోధుమలతోపాటు మన దేశానికి అమెరికా నుంచి దిగుమతైన పార్థీనియం (వయ్యారిభామ/ కాంగ్రెస్‌ గడ్డి) మొక్కలు తామర తంపరగా పెరుగుతూ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు