అలా ఆత్మారాం... ‘భాస్కర్‌’ ఆట కట్టించాడు!

10 Aug, 2021 09:29 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

‘ఏమిటి పరిస్థితి? వాడు దొరికాడా?’ ఫోన్‌లో అడిగాడు  సీఐ మహంకాళి. 
‘ఇంకా లేదు సార్‌. బ్యాంక్‌కి ఎదురుగానే కాచుకొని ఉన్నాం’ చెప్పాడు  వినయంగా ఎస్సై ఆత్మారాం. ‘నీతోపాటు ఇంకెవరున్నారు?’ సీఐ మహంకాళి.  
‘ఇద్దరు పీసీలు ఉన్నారు సార్‌. వాళ్లకు ఈ విషయం తెలియదు. ఏదో రొటీన్‌ డ్యూటీ అనుకుంటున్నారు’ 
‘గుడ్‌. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నీకు తెలుసుగా.. మన రహస్యాలు లీకయి పోతున్నాయి. ఎవరినీ నమ్మలేకపోతున్నాం. జాగ్రత్త. వాడు మహా కన్నింగ్‌ ఫెలో. ఇన్నాళ్ళకు వాడిని పట్టుకునే అవకాశం దొరికింది. ఎట్టి పరిస్థితుల్లో  వాడు తప్పించుకోకూడదు’ అంటూ హెచ్చరించాడు సీఐ. 

ఆత్మారాం చాలా ఎలెర్ట్‌గా ఉన్నాడు. ఒకవైపు ఫోన్‌ మాట్లాడుతున్నా అతని చూపులు బ్యాంక్‌ మీద నుంచి మళ్లడం లేదు. అతను పనిచేసే  ప్రాంతం చుట్టూ ఇటీవల కాలంలో మావోయిస్టుల కార్యక్రమాలు బాగా ఎక్కువయ్యాయి. ఎన్నడూ లేనిది ఆ అడవి ప్రాంతంలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని నిర్ధారణ కావడంతో తన పోలీస్‌ స్టేషన్‌పై ఒత్తిడి పెరిగింది. ఒక ముఖ్యమైన మావోయిస్టు బ్యాంకులో ఉన్నాడని పక్కా సమాచారం అందడంతో అతన్ని పట్టుకునే బాధ్యత ఆత్మారాం మీద పడింది.
ఎవరయినా తమని గమనిస్తున్నారేమోనని అటూ ఇటూ చూస్తూ, తన పనిలో నిమగ్నమయ్యాడు ఆత్మారాం. కాస్తంత దూరంలో నడచివస్తున్న ఒక మనిషి, అతన్ని ఆకర్షించాడు.

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ తన లోకంలో తాను ఉన్న ఆ మనిషి తన కుడి కాలిని ఈడ్చుకుంటూ నడవడం, అప్పుడప్పుడు ఎడమ చెవిని రుద్దుకుంటూ ఉండడం ఆత్మారాంని ఏవో జ్ఞాపకాల్లోకి నెట్టేశాయి. ‘ఇలా కాలు ఈడుస్తూ నడవడం, చెవినలా రుద్దుకోవడం ఎవరో చేసేవారే? ఆ అలవాట్లు ఉన్న ఇతన్ని ఎక్కడో చూశానే? ఎక్కడ? ఎక్కడ?’ అనుకుంటూ పరధ్యానంలో పడినా, వెంటనే కర్తవ్యం గుర్తొచ్చి, బ్యాంక్‌పై దృష్టి నిలిపాడు. అయినా ఆత్మారాం మనసు నిలకడగా ఉండడం లేదు. ఆ వ్యక్తి కారణంగా అతను  బాగా డిస్టర్బ్‌ అవుతున్నాడు. అతను దగ్గరవుతున్న కొలదీ ఆత్మారాం ఏకాగ్రత చెదరసాగింది. ఆ వ్యక్తి.. ఆత్మారాంను దాటుకొని ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు వెలిగింది ఆత్మారాంకి.. అతను చిన్నప్పుడు తనతో కలిసి చదువుకున్న క్లోజ్‌ ఫ్రెండ్‌  భాస్కర్‌ అని. వెంటనే అనాలోచితంగా అతని నోటిమ్మట ‘బాచీ’ అన్న పదం వెలువడింది. ఆ వ్యక్తి  ఆగిపోయి, వెనక్కి తిరిగి చూసి, ఎవరు పిలిచారో తెలియక దిక్కులు చూశాడు. తన ఊహ కరెక్టే అని అనుకోగానే ఆత్మారాం ఆనందానికి అంతే లేదు.

 ‘నేను రా బాచీ.. ఆత్మారాంని’ అంటూ అరిచాడు. 
‘సారీ.. మీరెవరో నాకు తెలియదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో?’ అంటూ ఒక్క అడుగు వెనక్కివేశాడు. 
‘అరే.. నన్ను గుర్తుపట్టలేదా? రామచంద్రపురం హైస్కూల్లో కలిసి చదువుకున్నాం. ఎలా మర్చి పోతావ్‌రా ఈ ఆత్మని?’ అన్నాడు ఆశ్చర్యపోతూ.
 ‘ఓ.. ఆత్మారాంవా? నిజంగా? అయితే మాత్రం ఎలా గుర్తుపడతాను? అప్పుడు సన్నగా పుల్లలా ఉండే నువ్వు ఇలా వస్తాదులా మారిపోతే ఎలా గుర్తుపట్టగలను?’ అంటూ నవ్వి,  ‘థైరాయిడ్‌ వల్ల నా ముఖం కూడా బాగా మారిపోయింది. చిన్నప్పటి స్నేహితులెవరూ గుర్తుపట్టలేక పోతున్నారు. నువ్వెలా ఎలా గుర్తుపట్టావురా? అంటూ ఆశ్చర్యపోయాడు. 

‘వాళ్ళకీ నాకూ తేడా లేదా? నేను పోలీసోడిని కదా?’ అంటూ గర్వంగా నవ్వుతున్న ఆత్మారాంకి తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. ఆందోళనగా బ్యాంక్‌ వైపు చూశాడు. ‘అయ్యో ఎంత ఏమరుపాటుగా ఉన్నాను? కొంపదీసి వాడు ఈ గ్యాప్‌లో తప్పించుకు పోలేదు కదా?’ అని కంగారు పడ్డాడు. ‘వాడు అసలే నక్కజిత్తుల మారి. వాడు తప్పించుకోవడానికి రెండు నిమిషాలు చాలు. నేను ఎక్కువ టైమే ఇచ్చేశాను. ఎంత పొరపాటు అయిపోయింది!’ అని గాభరా పడ్డాడు.
 ‘ఏమిటా కంగారు? ఎనీథింగ్‌ రాంగ్‌?’ అని అడిగాడు భాస్కర్‌. 

దానికి సమాధానం చెప్పకుండా  ‘ఒక్క క్షణం ఇక్కడే వెయిట్‌ చేయి. ఇప్పుడేవస్తాను’ అంటూ హడావిడిగా బ్యాంక్‌ వైపు నడిచాడు.
బ్యాంక్‌లోకి అడుగు పెడుతూనే సెక్యూరిటీ గార్డ్‌ని పిలిచి, గేట్‌ వేసేయమని ఆర్డర్‌ చేశాడు. జనం మధ్యలో తిరుగుతూ తీవ్రవాది కోసం తీక్షణంగా గాలించడం మొదలుపెట్టాడు. అతని జాడ లేకపోవడంతో చెమటలు పట్టాయి. మేనేజర్‌ని కలిసి, సిసి కెమెరా ఫుటేజ్‌ చూశాడు. కొద్దిసేపటి కిందటే అతను వెతుకుతున్న మనిషి గేట్లోంచి బయటకు పోయినట్లు రికార్డ్‌ అయింది. అతను గేటు దాటిన టైమ్‌ చూశాడు. సరిగ్గా  అదే సమయంలో తను భాస్కర్‌తో మాట్లాడుతూ కర్తవ్యాన్ని మర్చిపోయినట్లు గ్రహించాడు.

 ‘ఛ.. ఎంత పొరపాటు జరిగిపోయింది?’ అనుకుంటూ కుమిలిపోయాడు. ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయని ఆత్మారాంకి చాలా బాధ కలిగింది.
మావోయిస్ట్‌ కోసం బయట పడిగాపులు కాచే బదులు, బ్యాంక్‌లోకే  వెళ్లి అతన్ని పట్టుకోవాలని ముందు ప్లాన్‌ చేసుకున్నాడు. అయితే సీఐ అందుకు ఒప్పుకోలేదు. అలా చేస్తే పెద్ద పబ్లిసిటీ అయిపోతుందని, మీడియాతో నానా ఇబ్బందులు వస్తాయని, కస్టమర్‌ను అడ్డుపెట్టుకొని, తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని, అప్పుడు వాడిని పట్టుకోవడం కష్టం అవుతుందని అడ్డు చెప్పాడు సీఐ. బయటకు వచ్చిన తీవ్రవాదిని గుట్టుచప్పుడు కాకుండా బంధించి, జీపెక్కించడమే ఉత్తమమని సలహా ఇచ్చాడు.

‘ఛ.. నా ప్లాన్‌ని ఫాలో అయ్యుంటే ఈ తప్పు జరిగి ఉండేది కాదు’ అని విచారపడ్డాడు. ఇప్పుడు
జరిగినదంతా దాచి మావోయిస్ట్‌ చాలా తెలివిగా తన కన్ను గప్పి తప్పించుకున్నాడని సీఐతో చెప్పాడు. సీఐ ఉగ్రుడైపోయి చెడామడా తిట్టేశాడు. అలా తిట్లు కాయడం మొదటిసారి కావడంతో తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాడు ఆత్మారాం.
బ్యాంక్‌ నుంచి బయటకు వచ్చిన ఆత్మారాంని చుట్టుముట్టారు కానిస్టేబుళ్లు. 

‘ఏమయిందిసార్‌? ఒక్కసారిగా అలా  బ్యాంక్‌లోకి పరిగెత్తారు? మమ్మల్ని పిలిస్తే, మేమూ కూడా వచ్చేవాళ్ళం కదా?’ అన్నాడొక కానిస్టేబుల్‌. 
ఏమి జరిగిందో.. ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు భాస్కర్‌.
‘ఏం లేదు. చిన్న ఎంక్వైరీ అంతే. నన్ను మా ఇంటి దగ్గర దింపేసి మీరు స్టేషన్‌కి వెళ్ళిపొండి’ అంటూ అబద్ధమాడి భాస్కర్‌ వైపు తిరిగి ‘నీకు అర్జెంట్‌ పనేమీ లేదుగా? మా ఇంటికి వెళ్దాం. కాస్త రిలీఫ్‌గా ఉంటుంది’ అన్నాడు. 
తలూపి జీపు ఎక్కాడు భాస్కర్‌ అలవాటుగా తన ఎడమ చెవిని రుద్దుకుంటూ.
∙∙ 
ఇంటి తాళం తీసి హాల్లోకి నడుస్తూ ‘సారీ.. ఇంతసేపూ నీతో సరిగ్గా మాట్లాడలేక పోయాను. ఎన్నో ఏళ్ల తర్వాత కలిశావన్న ఆనందం ఆవిరి అయిపోయింది. మా ఉద్యోగాలింతే. నిత్యం టెన్షన్, టెన్షన్‌. అలా కూర్చో. కాఫీ చేసి తెస్తాను. మా ఆవిడ, పిల్లలు ఊరెళ్ళారు’ అంటూ భాస్కర్‌ కి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా కిచెన్‌లోకి నడిచాడు. నవ్వుకుంటూ సోఫాలో కూలబడి.. టీపాయ్‌ మీదున్న న్యూస్‌ పేపర్‌ అందుకున్నాడు భాస్కర్‌.  కాఫీ చేసుకొచ్చిన ఆత్మారం కాఫీ కప్పు భాస్కర్‌కు అందిస్తూ  ‘ఇప్పుడు చెప్పు. ఎక్కడుంటున్నావ్‌? ఏమి చేస్తున్నావ్‌?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. 

‘రామచంద్రపురంలోనే సెటిల్‌ అయ్యాను. ఓ స్కూల్లో పని చేశాను చాలాకాలం. ప్రజాసేవ చేయాలని బుద్ధి పుట్టడంతో ఉద్యోగం వదిలేశాను. బతకడానికి ఇబ్బంది లేదు. మా నాన్న నాకోసం బాగానే ఆస్తిని వదిలి పెట్టాడు. టీచర్‌గా నా అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాను. ఈ ఏరియాలో ‘ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ స్కూళ్ళు, హాస్టళ్ళు చాలా బాగా కట్టినా, ఫుడ్‌తో సహా అన్నిరకాల సౌకర్యాలు చక్కగా అమర్చినా, విద్యాబోధన కుంటు పడిందని తెలిసింది. పర్మినెంట్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పాతిక శాతం కూడాలేరని, పాఠాలు చెప్పడానికి మంచి టీచర్లు కరువయ్యారనీ చెవిన పడింది. అందుకే నా అంతట నేను ఫ్రీగా పాఠాలు చెప్పడానికి ముందుకొచ్చాను. ఆ హాస్టల్లోనే వసతి, భోజనం. అలా గడిచిపోతుంది’ చెప్పాడు భాస్కర్‌ నవ్వుతూ.

‘వెరీ గుడ్‌ మంచి పనిచేస్తున్నావు. మరి నువ్వు  ఊళ్లు పట్టుకు తిరుగుతుంటే నీ భార్య, పిల్లల సంగతి?’ అడిగాడు ఆత్మారాం. 
 ‘ఆ జంజాటం పెట్టుకోలేదు. సమాజసేవ చేయాలంటే ఆ బంధాలు అడ్డం కదా? అందుకే పెళ్ళే చేసుకోలేదు’ అంటూ చిన్నగా నవ్వాడు భాస్కర్‌. 
 ‘ఎంత ఎదిగిపోయావు? హ్యాపీగా ఉంది.. నీ ఆదర్శ జీవితం గురించి వింటుంటే. ఈ రోజే నీ మకాం ఇక్కడికి మార్చేయ్‌. మా వాళ్ళు నెలరోజుల దాకా రారు. ఆ తర్వాత  సంగతి తర్వాత’ చెప్పాడు ఆత్మారాం. ‘వద్దొద్దు. అక్కడ టీచర్లు పడుకునే చోట నాకో మంచం ఇచ్చారు. భోజనం హాస్టల్లో తినేస్తున్నాను. బాగానే ఉంది’ అంటూ అడ్డు చెప్పాడు భాస్కర్‌. 
కానీ ఆత్మారాం ఊరుకోకుండా పట్టు పట్టేసరికి ఒప్పుకోక తప్పలేదు అతనికి. 

సాయంత్రం భాస్కర్‌ తన సామాను పట్టుకొని ఆత్మారాం ఇంటికొచ్చేశాడు. అప్పటి క్లాస్‌మేట్స్‌ను, టీచర్లను తలుచుకొని.. ఆనాటి ముచ్చట్లతో ఆ సాయంకాలం కాలక్షేపం చేశారు. 
మర్నాడు ఉదయం భాస్కర్‌.. ఆత్మారాంకన్నా ముందే లేచి ఉప్మా, కాఫీ సిద్ధం చేసి.. ఆత్మారాంను నిద్రలేపాడు.  
ఆ ఏర్పాట్లకు ఆశ్చర్యపోతూ ‘ఎందుకురా శ్రమ పడడం? మా పనిమనిషి లక్ష్మి వచ్చి చేస్తుంది కదా?’ అంటూ మందలించాడు ఆత్మారాం .
‘అమ్మనాయనోయ్‌.. నిన్న రాత్రి తిన్నానుగా ఆమె చేతి వంట. నా వల్ల కాదు. ఆ వంటేదో నేనే చేస్తాను. అంట్లు తోమి, ఇల్లు శుభ్రం చేయమను చాలు. ముందు నువ్వు ముఖం కడుక్కొనిరా. కాఫీ తాగుదాం. టిఫిన్‌ చేయడం అయిపోయాక నీకు లంచ్‌ కూడా చేసేస్తాను. నేను హాస్టల్లో తింటానులే. రాత్రికి ఇద్దరికీ చపాతీలు చేస్తాను. నువ్వేమీ అనొద్దు. నేను చెప్పిందే ఫైనల్‌’ అంటూ స్నేహితుడిని  మాట్లాడనివ్వలేదు.  
చేసేదేం లేక నవ్వుతూ భుజాలు ఎగరేశాడు ఆత్మారాం.
∙∙ 
‘ఈపది రోజులూ మాట్లాడుకుంటున్నా జానీ గురించి గానీ, జాహ్నవి గురించి గానీ తలుచుకోలేదు. ఇంతకూ జానీ ఎలా వున్నాడురా? ఎప్పుడయినా కలిశావా?’ అని అడిగాడు ఆత్మారాం. పెదవి విరిచాడు భాస్కర్‌.
‘అందరూ చెల్లాచెదురై పోయారు. జానీగాడు జాహ్నవికి లవ్‌ లెటర్‌ రాసి సస్పెండ్‌ అయిపోయిన సంగతి నీకు గుర్తుందా?’ అడిగాడు భాస్కర్‌.
గుర్తుంది అన్నట్లు తలూపి ‘జానీగాడు చాలా మంచివాడురా. వాడా పనిచేశాడంటే నమ్మకం కలగడం లేదు’ అన్నాడు. 

‘వాడే ఒప్పుకున్నాడు. ఇంకా నీకు అనుమానం ఏమిటి?’ అన్నాడు విస్తుపోతూ. 
సమాధానం చెప్పకుండా తల పంకిస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు ఆత్మారాం.
‘జానీ ప్రస్తావన రాగానే, వీడేమిటి ఇలా అయిపోయాడు? అనుకుంటూ అలవాటు ప్రకారం ఎడమ చెవిని రుద్దుకోవడం మొదలుపెట్టాడు.
∙∙ 
‘ఇదేమిటి నన్ను అరెస్ట్‌ చేశావు? నీకేమయినా పిచ్చి ఎక్కిందా?’ అంటూ గావుకేకలు పెడుతున్న ఆదివిష్ణు ఉరఫ్‌ భాస్కర్‌ని చూసి గట్టిగా నవ్వాడు ఆత్మారాం. ‘అన్నన్నా.. ఎంత టోకరా వేశావురా? భాస్కర్‌గాడిలా కాలు ఈడ్చడం, చెవిరుద్దు కోవడం చేసి ఈ పోలీసోడినే బుట్టలో వేసేశావే? ఎంత తెలివైనోడివిరా? నువ్వు కూడా మాతో చదువుకున్నా ఆ రోజుల్లో నిన్ను పట్టించుకునే వాళ్ళం కాదు మేము. అందుకే నిన్ను నేను గుర్తుపట్టలేనని, ఈ సాహసం చేశావు. నీ వల్ల ఎంత నష్టపోయానురా? మీ వాడు బ్యాంకులోంచి సులువుగా తప్పించుకునేలా చేశావు. మా ఇంట్లోనూ, తోటలోనూ సీక్రెట్‌  మైక్రోఫోన్లు అమర్చి, నా ఫోన్‌ సంభాషణలు వింటూ, మా ప్లాన్లు ముందే తెలుసుకున్నావు. నీ వల్ల మా చేతికి దొరకబోయిన మీ వాళ్ళు తప్పించుకు పారిపోయారు.

మా ఇన్ఫార్మర్‌ ఎవరో తెలిసిపోవడంతో, అతన్ని దారుణంగా హత్యచేసేశారు మీ వాళ్ళు. ముందు నాకు నీమీద ఏ అనుమానమూ రాలేదు. వచ్చాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నీ బండారం బట్టబయలు చేసేదాకా నిద్రపోలేదు. రోజూ నువ్వు వాడుతున్న మాత్రల్లో థైరాయిడ్‌ మాత్రలు  లేకపోవడంతో నా అనుమానం కొట్టిపారేసేది కాదని తెలిసిపోయింది. దాదాపు నలభై ఏళ్లుగా ఈడుస్తూ నడుస్తున్న వాడి కాలు సన్నగా ఉండి, ఫ్లెష్‌ తక్కువగా ఉండాలి. కానీ నీ కాళ్ళు రెండూ మామూలుగా ఉండేసరికి, నువ్వు నాటకం ఆడుతున్నావని అర్థమైపోయింది. నువ్వు తోటలో కూర్చుని ఫోన్‌ మాట్లాడుతున్నపుడు, మా వాడి చేత ఒక పామును లోపలికి పంపాను. పాముని చూసి నువ్వు గంతులేయడం చూసిన వాడు ఎవడైనా నువ్వు కుంటి వాడివి కాదని కనిపెట్టేస్తాడు. అందుకే ఆ సమయంలో నేను ఇంట్లో లేనని నిన్ను నమ్మించాను.

ఫైనల్‌ పరీక్షలో కూడా నువ్వు దొరికిపోయావు. జాహ్నవికి లవ్‌ లెటర్‌ రాసింది జానీ కాదు. వాడి బావ చలపతి. జానీ తల్లితండ్రులు చనిపోతే చలపతి తండ్రే వాడిని పెంచాడు. అందుచేత వాడికి చలపతి అంటే ప్రాణం. అందుకే ఆ నింద తన మీద వేసుకున్నాడు. ఆ నిజం నాకూ, భాస్కర్‌కి కూడా తెలుసు. నీకు ఆ విషయం తెలియకపోవడంతో  తేలికగా దొరికిపోయావు’ అంటూ గట్టిగా నవ్వేసరికి సిగ్గుతో తలదించుకున్నాడు ఆదివిష్ణు.        
-కొయిలాడ రామ్మోహన్‌రావు

మరిన్ని వార్తలు