చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు..సైన్స్‌కే అందని అద్భుతం

24 Oct, 2021 09:23 IST|Sakshi

పొల్లాక్‌ సిస్టర్స్‌’ కథ

పుణ్యఫలం, కర్మఫలం.. జీవాత్మ, పరమాత్మ.. గతజన్మ, పునర్జన్మ.. ఇవన్నీ అస్పష్టమైన నమ్మకాలే కానీ.. కొట్టిపారేయలేని అంశాలంటారు చాలామంది. అయితే నేటి స్మార్ట్‌ యుగాన్ని సైతం అబ్బురపరచే కొన్ని గత సంఘటనలు ఆ నమ్మకాలను బలపరచే ఆధారాలుగా నిలుస్తుంటాయి. అందులో ‘పొల్లాక్‌ సిస్టర్స్‌’ కథ ఒకటి. సైన్స్‌కే అందని ఓ అద్భుతమది.

అమెరికాకు చెందిన ఆ అక్కాచెల్లెళ్లు.. చనిపోయి మళ్లీ పుట్టారు.. అవును.. 1957లో కారు యాక్సిడెంట్‌లో చనిపోయిన ఇద్దరూ.. తిరిగి కొన్ని ఏళ్లకు (1964లో..) అదే తల్లి కడుపున కవలలుగా పుట్టారు. మాటలు వచ్చే వయసుకి.. గతజన్మ సంఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడంతో ఒక్కసారిగా జనాలు ఉలిక్కిపడ్డారు. పరిశోధకులు సైతం సమాధానం చెప్పలేని స్థితిలో.. ఈ పునర్జన్మ కథ ఓ మిస్టరీగా మారింది.

అసలు ఏం జరిగింది?
జొవాన్నా పొల్లాక్,  జాక్వెలిన్‌ పొల్లాక్‌ అనే అమెరికన్‌ సిస్టర్స్‌.. మొదటి జన్మలో కవలలు కాదు. జాన్‌–ఫ్లోరెన్స్‌ అనే దంపతులకు 1946లో జొవాన్నా, 1951లో జాక్వెలిన్‌ జన్మించారు. జొవాన్నా కంటే జాక్వెలిన్‌ చిన్నది కావడంతో చెల్లెల్ని తల్లిలా చూసుకునేది జొవాన్నా. అయితే జాక్వెలిన్‌ పుట్టిన ఆరేళ్లకు చర్చ్‌ రోడ్‌లో స్నేహితుడు ఆంథోనీతో కలిసి నడుస్తున్న జొవాన్నా(11), జాక్వెలిన్‌(6) మీదకి ఓ కారు దూసుకొచ్చింది. ఆ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. అయితే 1964లో ఫ్లోరెన్స్‌ మళ్లీ తల్లి అయ్యింది. ఆ సమయంలో జాన్‌ తన భార్య కడుపులో కవలలు ఉన్నారని బలంగా నమ్మాడు.

ఫ్లోరెన్స్‌ని చెకప్‌ చేసిన డాక్టర్స్‌.. బ్ల్లడ్‌లైన్స్‌ ఆధారంగా కవలలు ఉండే అవకాశమే లేదని చెప్పినా సరే.. జాన్‌ తన నమ్మకాన్ని వదులుకోలేదు. అదే నిజమైంది. కవలలు పుట్టారు. మెల్లగా యాక్సిడెంట్‌ ట్రాజెడీని మరచిపోవడం మొదలుపెట్టారు జాన్‌ దంపతులు. కవలలకు గిలియన్, జెన్నిఫర్‌ అని పేర్లు పెట్టారు. బుడి బుడి అడుగులతో.. బోసి మాటలతో మళ్లీ కుటుంబంలో సంతోషాలు మొదలయ్యాయి. ఒకరోజు గిల్లియన్, జెన్నిఫర్‌లు తల్లిని ‘అటకపైన దాచిన ఫలానా పాత బొమ్మలు కావాలి, ఆడుకుంటాం’ అని అడిగారు. అప్పటి దాకా చూడని ఆ బొమ్మల గురించి కవలలకు ఎలా తెలిసిందో ఫ్లోరెన్స్‌కు అంతుచిక్కలేదు. అయినా పిల్లల కోరిక కాదనలేక అటకమీద నుంచి తీసి ఇచ్చింది. వాటిని అందుకున్న పిల్లలు.. వెంటనే ఇవి నా బొమ్మలు..

ఇవి నీ బొమ్మలు అని జొవాన్నా బొమ్మల్ని గిల్లియన్, జాక్వెలిన్‌ బొమ్మల్ని జెన్నిఫర్‌ పంచుకున్నారు. ఇదంతా వాళ్ల 3 ఏళ్ల వయసులో జరిగింది. ఆ ఘటన మరవకముందే.. చనిపోయిన ఇద్దరి పిల్లల ఫొటోని చూసిన ఆ కవలలు ‘ఇది నువ్వు.. ఇది నేను’ అని గుర్తుపట్టడం తల్లి కళ్లారా చూసింది. పిల్లల మాటలు విన్న ఫ్లోరెన్స్‌కి.. కాళ్ల కింద నేల కంపించినట్లైంది. వెంటనే ఆ ఫొటోని దాచిపెట్టింది. అయితే కవలల్లో గిల్లియన్‌.. గత జన్మలోని జొవాన్నా మాదిరే ఉదారస్వభావంతో ఉండేదట. అంతేకాదు తన వస్త్రధారణ, మాటతీరు అంతా తన చెల్లెలు జెన్నిఫర్‌తో పోల్చినప్పుడు చాలా పరిపక్వత కనిపించేదట. ఎందుకంటే తన గత జన్మలో తన చెల్లెలు జాక్వెలిన్‌ కంటే సుమారు ఐదారేళ్లు పెద్దది.

మరో రోజు కవలలతో బయటికి వెళ్లిన జాన్‌ దంపతులకు ఇంకో షాక్‌ ఎదురైంది. గతంలో జొవాన్నా, జాక్వెలిన్‌లు చదివిన స్కూల్‌ని, యాక్సిడెంట్‌ అయిన  ప్లేస్‌ని గుర్తుపట్టారు. అయితే అప్పటిదాకా కవలలు ఆ ప్లేస్‌ని ఎప్పుడూ చూడలేదు. ఇక రోడ్డుపై కవలలు వెళ్తున్నప్పుడు కారు కనిపిస్తే.. తమవైపే దూసుకొస్తుందని ఏడ్చేవారట. ఇలా ఐదారేళ్లు వచ్చేదాకా అచ్చం జొవాన్నా, జాక్వెలిన్‌లానే ప్రవర్తించేవారు కవలలు. షాకుల మీద షాకులు తిన్న తల్లిదండ్రులకు.. ఓ క్లారిటీ వచ్చింది. చనిపోయిన తమ పిల్లలే గిల్లియన్, జెన్నిఫర్‌ల్లా పుట్టారని నమ్మడం మొదలుపెట్టారు. తమకు కలిగిన అనుభవాలను అందరితో పంచుకోవడం ఆరంభించారు. ఏడేళ్ల వయసు వచ్చేసరికి.. గత జన్మ స్మృతులని పూర్తిగా మరచిపోయిన కవలలు.. సాధారణ పిల్లల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దాంతో సమస్య తీరింది. కానీ అదెలా సాధ్యం అనేది మాత్రం నేటికీ అంతుచిక్కలేదు. అయితే ఈ పొల్లాక్‌ సిస్టర్స్‌ పునర్జన్మ ఓ కట్టుకథ అని కొట్టిపారేసేవాళ్లూ లేకపోలేదు.

అమెరికన్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ ఇయాన్‌ స్టీవెన్సన్‌.. పునర్జన్మలు, గత జన్మ జ్ఞాపకాలపై పలు పరిశోధనలు చేశారు. వేల కేసుల్ని స్టడీ చేశారు. 1987లో ఇలాంటి 14 ఆసక్తికర సంఘటనలతో ‘చిల్డ్రన్స్‌ హూ రిమెంబర్‌ దెయిర్‌ పాస్ట్‌ లైవ్స్‌ (గత జన్మలను గుర్తుపెట్టుకున్న పిల్లలు)’ అనే పుస్తకం కూడా రాశారు. కచ్చితంగా పునర్జన్మలు ఉన్నాయని, అందులో పొల్లాక్‌ సిస్టర్స్‌ కథ కూడా వాస్తవమేనని వెల్లడించారు. సాధారణంగా అమెరికన్లకు ఏలియన్స్, టైమ్‌ ట్రావెల్స్‌తో పాటు ఆత్మలన్నా, దెయ్యాలన్నా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. పైగా చనిపోయిన వారిలో 24 శాతం మంది మళ్లీ తిరిగి పుడతారని వారు బలంగా నమ్ముతారు.

--సంహిత నిమ్మన

మరిన్ని వార్తలు