మానవ మనుగడకి ముప్పుగా కాలుష్యం.. ఏటా 70 లక్షల మరణాలు!

26 Jan, 2022 14:34 IST|Sakshi

ప్రకృతి ఒడిలో ఎక్కడో కొండకోనల్లో జీవిస్తున్నవారు తప్ప ప్రపంచంలో మిగతా ప్రజలంతా కలుషిత గాలినే పీల్చుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు మించి కలుషితమైన గాలినే పీల్చుకుంటోంది ప్రపంచంలోని 99 శాతం జనాభా. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన తాజా గణాంకాలే తెలియజేస్తున్నాయి. 


ఎక్కువమంది ప్రాణాలను హరిస్తున్న కాలుష్య మహమ్మారి ఇది. ఏటా ఈ కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది బలవుతున్నారు. ఈ కాలుష్యం ఇంటా బయటా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఆరుబయటను పీల్చటం వల్ల ఏటా 42 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. వంటగదుల్లో పొగ కాలుష్యం వల్ల ఏటా 38 లక్షల మంది మరణిస్తున్నారు. పొగతాగటం వల్ల వస్తున్న క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్‌ సహా అనేక దీర్ఘకాలిక రోగాలతో ఏటా మన దేశంలో దాదాపు 13.5 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 

భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా 2019లో దాదాపు 17 లక్షల మరణాలు సంభవించాయి. మనదేశంలో నమోదైన మొత్తం మరణాలలో ఇది 18 శాతం. మరణాలు, వాయు కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల వల్ల ఏకంగా రూ. 2,60,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. స్థూల జాతీయోత్పత్తి లో ఇది 1.4 శాతం మేరకు ఉంటుందని ఒక నివేదిక చెబుతోంది. కోవిడ్‌ –19 కారణంగా దాదాపు రెండేళ్లలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 54.4 లక్షలు. అయితే ఏటా వాయు కాలుష్యం 70 లక్షల మందిని బలిగొంటున్నా పాలకులకు అంతగా పట్టట్లేదు. 

ఇంతకీ వాయు కాలుష్యం అంటే ఏమిటి? 
భూ ఉపరితల వాతావరణంలో ప్రకృతిసిద్ధమైన గాలి సహజ గుణగణాలను ఇంటా బయటా రసాయనిక, భౌతిక, జీవ సంబంధమైన వాహకం ద్వారా కలుషితం కావటం. ఒక్కమాటలో చెప్పాలంటే అసాధారణమైన రసాయనాలు లేదా ధూళి కణాలు కలిగి ఉన్న గాలే కలుషితమైన గాలి. 

వాయు కాలుష్య రకాలు.. 
వంట కలప, మోటారు వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగం, అడవులు తగులబడటం వంటివాటి ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున పంట అవశేషాలను కాల్చడం.. పొగ, పొగమంచు, సూక్ష్మరేణువులతో కూడి వాయు కాలుష్యానికి కారణమవుతోంది. 
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం, రాడాన్‌ ప్రధాన కారణాలు. ఇంట్లో వాయు కాలుష్య కారకాలైన అత్యంత ప్రమాదరకమైన మూడు కారకాల్లో రాడాన్‌ ఒకటి. 
ప్రజారోగ్యానికి సంబంధించి ప్రధాన కాలుష్య కారకాలు.. అతిచిన్న ధూళి కణాలు (పిం.ఎం. 2.5, పి.ఎం. 10), కార్బన్‌ మోనాక్సైడ్, ఓజోన్, నైట్రోజన్‌ డయాక్సైడ్‌తో పాటు సల్ఫర్‌ డయాక్సైడ్‌ కూడా ఉంది. ఇవేకాక గ్యాసోలిన్, బెంజీన్, స్టైరిన్, ఫార్మాల్డిహైడ్‌ వంటి అస్థిర సేంద్రియ సమ్మేళనాలూ వాయు కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. 

సహజ వాయు కాలుష్య కారకాలు... 
అడవులను దహించే కార్చిచ్చు, పుప్పొడి, ధూళి తుపాను, రాడాన్‌ వాయువు మొదలైనవి. 

అసహజ కాలుష్య కారకాలు..
మనుషుల పనులు, వాహనాల్లో మండించే ఇంధనం, ఇళ్లు, ఫ్యాక్టరీలలో ఉపయోగించే బొగ్గు, కలప ఇతర ఇంధనాలు వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. 

హరిత గృహ వాయువులు.. వాతావరణ మార్పు
వాతావరణ మార్పులతో వాయు కాలుష్యకారకాలు సంక్లిష్ట సంబంధాన్ని కలిగి ఉంటాయి. పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ (పి.ఎం.) ధూళి కణాలు వాతావరణాన్ని వేడిక్కిస్తాయి లేదా చల్లబరుస్తాయి. బ్లాక్‌ కార్బన్, ఓజోన్‌ వంటి కొన్ని కాలుష్య కారకాలు వాతావరణంలో వేడిని బంధించడం ద్వారా ఉష్ణోగ్రతను పెంచుతాయి. అయితే సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటివి కాంతిని పరావర్తనం చెందించే కణాలను ఏర్పర్చి వాతావరణాన్ని చల్లబరుస్తుంటాయి. సూర్యరశ్మిని భూవాతావరణంలో బంధిస్తూ  హరిత గృహ వాయువులూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రధానమైనవి కార్బన్‌ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్, నీటి ఆవిరి (ఇవన్నీ సహజంగా ఏర్పడతాయి)తో పాటు ఫ్లోరినేటెడ్‌ వాయువులూ (ఇవి సింథటిక్‌) ఉన్నాయి.  వీటిని హరిత గృహ వాయువులని, వీటి ప్రభావాన్ని హరిత గృహ ప్రభావమని అంటున్నాం. మన దేశంలో హరిత గృహ వాయువుల తలసరి ఉద్గారాలు తక్కువ. అయితే మొత్తంగా చూస్తే కాలుష్యకారక దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉంటే మూడో స్థానంలో మన దేశం ఉంది. మనుషుల అవసరాల కోసం  బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు వంటి శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల  వాతావరణం వేడెక్కుతోంది. దీన్నే భూతాపోన్నతి.. గ్లోబల్‌ వార్మింగ్‌ అంటున్నాం. దీన్ని పారిశ్రామిక పూర్వకాలం (క్రీ.శ. 1850– 1900 మధ్య) నుంచే గమనిస్తున్నాం. 

ఇప్పుడు వాతావరణం వేగంగా మారుతోంది. 2100 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 5.4 డిగ్రీల సెల్సియస్‌ దాకా పెరగవచ్చు. ఈ మార్పు వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. ప్రజారోగ్యానికీ హాని కలుగుతోంది. జాతుల మనుగడకూ ముప్పే. దీన్ని తట్టుకొని నిలబడడం ప్రపంచానికే సవాలుగా మారింది. విధాన నిర్ణేతలు తప్పనిసరిగా మెరుగైన వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో వాయు కాలుష్య నివారణ,నియంత్రణ చట్టం – 1981 వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పొచ్చు. 

పిల్లలను బడులకు పంపొద్దు
పిల్లల ఊపిరితిత్తులు నాజూగ్గా ఉంటాయి. కాబట్టి వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని బడులకు పిల్లలను పంపవద్దు. ఎర్త్‌ లీడర్స్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మానిటరింగ్‌ కార్యక్రమం కింద వ్యాస రచయిత సారథ్యంలో అహ్మదాబాద్, సూరత్‌లోని కొన్ని పాఠశాలల్లో వాయు కాలుష్యం ఎంత ఉందో చెప్పే కిట్లను పిల్లలతోనే తయారుచేయించి, ఆయా పాఠశాలల్లో అమర్చారు.  వాయు కాలుష్యం ఎప్పుడు, ఎంత ఉంటున్నదని తల్లిదండ్రులతో పాటు ఇంకా ఎవరైనా తెలుసుకోవడానికి వీలుగా డేటాను క్లౌడ్‌తో అనుసంధానించారు. వాయు కాలుష్య సమస్యను అర్థం చేసుకోవడానికి, పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతోంది. 

గాలిలో కాలుష్య కణాలు..
సల్ఫేట్, నైట్రేట్లు, అమ్మోనియా, సోడియం క్లోరైడ్, బ్లాక్‌ కార్బన్‌ (డీజిల్‌ వాహనాల నుంచి విడుదలయ్యే కణాలు బ్లాక్‌ కార్బన్‌ను కలిగి ఉంటాయి), ఖనిజాల «ధూళి వంటివన్నీ  కాలుష్య కణాలే. గాలిలో తేలియాడే ఈ అతిచిన్న కణాలన్నిటినీ మనం పీల్చుకుంటున్నాం. పది మైక్రో మీటర్లు (మీటరులో 10లక్షల వంతు) లేదా అంతకంటే చిన్న కణాలు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లగలవు. అయితే వీటికన్నా ఇంకా చిన్న కాలుష్య కాణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. 2.5 మైక్రో మీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం ఉన్న  (పి.ఎం. 2.5) కాలుష్య కణాలు ఊపిరితిత్తులను దాటుకొని మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి. పి.ఎం. 2.5 కణాలు మన వెంట్రుక వ్యాసంలో ముప్పయ్యవ వంతు సూక్ష్మంగా ఉంటాయి. మనుషులను మరణానికి చేరువ చేస్తున్న అయిదవ అతి ప్రమాద కారకాలివి. 80 శాతం వాయు కాలుష్య మరణాలకు పి.ఎం. 2.5 కాలుష్య కణాలే కారణం. వీటి మూలంగా 2010లో 6, 27,000 మంది మృత్యువాత పడ్డారని, ఆ ఏటి మరణాల్లో ఇవి 6 శాతమని 2012లో జీబీడీ – లాన్సెట్‌ పేర్కొంది. 

గాలి నాణ్యతపై నిఘా
గాలి నాణ్యత విషయంలో ప్రతి దేశానికి వేరువేరు ప్రమాణాలున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను నిర్దేశించింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ సూచీలో కాలుష్య తీవ్రతను తెలియజెప్పే ఆరు విభాగాలున్నాయి. ఎనిమిది కాలుష్య కారకాలను పరిగణనలోకి తీసుకొని నాణ్యత ఏ మేరకు ఉందో నిర్ధారిస్తారు. 

రెండేళ్లుగా బిఎస్‌6 ప్రమాణాలు 
శిలాజ ఇంధనాలు వినియోగించే మోటారు వాహనాలు తదితర యంత్రాల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం భారత్‌ స్టేజ్‌ ఎమిషన్‌ స్టాండర్డ్స్‌ (బీఎస్‌ఈఎస్‌)ను ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, భూతాపోన్నతి శాఖ పరిధిలోని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్ణీత కాలవ్యవధిలో ఈ గాలి కాలుష్య ప్రమాణాలు అమలవుతున్నాయి. భారత్‌స్టేజ్‌ 6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన వాహనాలకు మాత్రమే దేశవ్యాప్తంగా 2020 నుంచి రిజిస్ట్రేషన్‌ సాధ్యపడుతోంది. చమురు కంపెనీలు కూడా బిఎస్‌6 ప్రమాణాలకు అనుగుణంగా 100 పీపీఎం మేరకు గంధకం కలిగిన పెట్రోలు డీజిల్‌ను సరఫరా చేస్తున్నాయి. తక్కువ కాలుష్య కారకమైన ఇంధనంగా పేరుగాంచిన సిఎన్‌జీతో సమానమైన సామర్థ్యం బిఎస్‌6 ప్రమాణాలతో కూడిన డీజిల్, పెట్రోల్‌కు ఉండడం విశేషం. 

కాటేస్తున్న వాయు కాలుష్యం
ప్రపంచవ్యాప్తంగా 2019లో వాయు కాలుష్యం వల్ల 67 లక్షల మంది చనిపోయారు. చైనాలో అత్యధికంగా 18.5 లక్షల మంది, భారత్‌లో 16.7 లక్షల మంది వాయుకాలుష్యానికి బలయ్యారు. మన దేశంలో ప్రతి నలుగురు మృతుల్లో ఒకరు వాయు కాలుష్యం వల్ల చనిపోయారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీస్తున్న కారణాల్లో రక్తపోటు, పొగాకు, నాసిరకం ఆహారం తర్వాత నాలుగో స్థానం వాయు కాలుష్యానిదే. 
దీర్ఘకాలం పాటు వాయుకాలుష్యానికి గురైతే అనేక రకాల జబ్బుల పాలు కావడమే కాకుండా మరణాలూ సంభవిస్తున్నాయి. 

వాయు కాలుష్య మరణాలు  
ఆంధ్రప్రదేశ్‌లో 62,808 మంది
తెలంగాణలో35,364 మంది
∙ 2019లో దేశంలో వాయుకాలుష్యంతో చనిపోయిన వారిలో సగం మంది ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్‌కు చెందిన వారే. తద్వారా జరిగిన ఆర్థిక నష్టం 3,680 కోట్ల డాలర్లు. ఇంకా చెప్పాలంటే మన దేశ స్థూల ఉత్పత్తిలో 1.36 శాతం. 
∙2019లో ఆంధ్రప్రదేశ్‌లో 62,808 మంది వాయు కాలుష్యం బారిన పడి మృత్యువాత పడ్డారు. ఏపీలో 15.6 శాతం మరణాలకు కారణం వాయుకాలుష్యమే. ఆర్థిక నష్టం 134.95 కోట్ల డాలర్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 1.09 శాతం.  
∙తెలంగాణలో 2019లో వాయు కాలుష్యం కారణంగా 35,364 మంది ప్రాణాలొదిలారు. రాష్ట్రంలో చనిపోతున్న వంద మందిలో 15.5 శాతం మంది వాయు కాలుష్యం వల్లనే చనిపోతున్నారు. ఆర్థిక నష్టం 111.59 కోట్ల డాలర్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 0.91 శాతం.
(సౌజన్యం: స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ 2020)

మానవ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావాలు
∙వాయు కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. 
∙వాయు కాలుష్యం ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. వృద్ధులు, శిశువులు, గర్భిణీలు, గుండె, శ్వాసకోశానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వంటి హై రిస్క్‌ గ్రూపులోని వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. 
∙పిల్లల్లో ఊపిరితిత్తులు ఇంకా ఎదిగే దశలో ఉంటాయి కాబట్టి వాళ్లు వాయు కాలుష్యానికి బహిర్గతమైనప్పుడు అది వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. 
∙వాయు కాలుష్యం వల్ల కంటి దురదలు, తలనొప్పి, వికారం వంటి చిన్న చిన్న అనారోగ్యాలతోపాటు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి. అంతేకాదు దీర్ఘకాలం పాటు విషపూరిత వాయువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి జబ్బులూ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ  వాయు కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల దిగువ భాగాలకు చేరి శ్వాసనాళాల వాపు, సంధి వాపు వంటి వ్యాధులకూ కారణమవుతున్నాయి. 
డాక్టర్‌ ఎన్‌. సాయి భాస్కర్‌ రెడ్డి, జియో సైంటిస్ట్‌  92463 52018

మరిన్ని వార్తలు